
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్ చదివే విద్యార్థులను జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకూ సిద్ధం చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు మోడల్ స్కూల్స్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. ఇంటర్ బోర్డు అకడమిక్ కేలండర్ ప్రకారం జూన్ 1 నుంచి మోడల్ స్కూళ్లలో ఇంటర్ తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. జూన్ 15 నుంచి అన్ని మోడల్ స్కూళ్లలో ఇంటర్ విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎంసెట్ కోచింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
రోజు గంటపాటు జాతీయ స్థాయి పరీక్షలకు శిక్షణ ఇస్తామన్నారు. ముందుగా సెకండియర్ విద్యార్థులకు ఈ శిక్షణ ప్రారంభిస్తామన్నారు. ఇక ప్రథమ సంవత్సర ప్రవేశాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ఇంటర్ తొలి ఏడాదిలో 31 వేల సీట్లు ఉంటే 40 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులకు ఎక్కువగా.. ఎంఈసీకి తక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. తక్కువ దరఖాస్తులు వచ్చిన స్కూళ్లు ఉన్న చోట ఆ మండల పరిధిలోని గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించాలని టీచర్లకు సూచించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment