
బోరు నుంచి కలుషిత జలాలు.. ,పెట్రోల్ కాదు.. కెమికల్ నీళ్లు
కుత్బుల్లాపూర్: జీడిమెట్ల పారిశ్రామివాడ రసాయనాల నిల్వలకు అడ్డాగా మారింది. ఇక్కడ బోర్లు వేసినా ఎర్రటి నీరే వస్తుంది..దీంతో అధికారులే ఇక్కడ బోర్లు వేయడం మానేశారు. ఇంకేముంది కొంత మంది పరిశ్రమల యజమానులు రాత్రికి రాత్రే గుట్టు చప్పుడు కాకుండా తమ వద్ద నిల్వ ఉన్న వ్యర్ధ రసాయన జలాలను నాలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో వదిలి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. 1974లో ఇక్కడ పరిశ్రమలు రాగా ప్రజలు సంతోషించారు. ప్రస్తుతం రాను రాను బహుళ జాతి సంస్థలు ఇక్కడి నుంచి తరలించగా చిన్నా చితకా పరిశ్రమలు వెలిసి రసాయనాలకు అడ్డాగా మారాయి. దీంతో ప్రతి నిత్యం ఇక్కడ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వర్షం పడ్డా.. రాత్రయినా కెమికల్ మాఫియాకు పంట పండినట్లే. నిల్వ ఉన్న వ్యర్థాలను నాలాల్లోకి వదలడం ఇక్కడ పరిపాటిగా మారింది.
కాలనీల్లో భూగర్బ జలాలు కలుషితం..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామికవాడకు ఆనుకుని ఉన్న సుభాష్‌నగర్, గంపలబస్తీ, వెంకటేశ్వర సొసైటీ, రాంరెడ్డి నగర్, ఎస్‌ఆర్ నాయక్‌నగర్, అయోధ్యనగర్ ప్రాంతాల్లో ఎక్కడ 10 ఫీట్ల లోతు గుంత తవ్వినా ఎర్ర రంగులో నీరు బయటపడడం గమనార్హం. మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో వదలడంతో పరిసర ప్రాంతాలు జల కాలుష్యంతో పాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రసాయన వ్యర్థ జలాల్లో విష రసాయనాలు ఉండడం వల్ల నీరు కలుషితమవుతుంది. వాస్తవానికి, ఈ వర్థ్యాలను నేరుగా కామన్ ఇంప్లిమెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(సిఈటిపి)కి తరలించాలి. లేదా సొంత ఈటీపీ ద్వారా ఆయా రసాయన పరిశ్రమలు శుద్ధి చేయాలి. కానీ ఇక్కడ టోలిన్, మిథినాల్, ఎసిటోన్ వంటి సాల్వెంట్లతో కూడిన వ్యర్థ జలాలు నేరుగా శుద్ధి చేయకుండానే డ్రైనేజీ, నాలాల్లో కలపడం వల్ల ఇక్కడ భూగర్బ జలాలు కలుషితంగా మారాయి. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు సైతం వర్షాకాలంలో పైన పేర్కొన్న కాలనీలతో పాటు నాలా పరివాహక ప్రాంతాల్లో బోర్లు వేయడం మానేశారు. ఎందుకంటే అక్కడ బోర్లు వేస్తే వాటిలో ఎర్రటి రంగులో రసాయనాలు బయటకు వస్తున్నాయి.
వర్షం పడితే వీరి పంట పండినట్లే..
పారిశ్రామికవాడలో రసాయన పరిశ్రమల యాజమాన్యాలు తాము నిల్వ చేసుకున్న వ్యర్థ జలాలను ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లకు తరలించకుండా గుట్టు చప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో నాలాల్లోకి వదలడం, లేదా అక్రమ మార్గాల్లో వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి డంపింగ్ చేయడం జరుగుతూ వస్తుంది. అంతే కాదు...వర్షం పడితే వీరి పంట పండినట్లే. చిన్న పాటి వర్షం పడ్డా.. భారీ వర్షం కురిసినా నిల్వ ఉన్న వ్యర్థ రసాయనాలు బహిరంగ ప్రదేశాల్లో వదలడం నిత్యకృత్యంగా మారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడమే కాకుండా జ్వరం, నీరసం, తలనొప్పి, శాస్వకోస, చర్మ సంబంధింత వ్యాధులతో బాధపడుతున్నారు. వ్యర్థ జలాలు బహిరంగ ప్రదేశాల్లో వదలడం చట్టరిత్యా నేరం. అయినప్పటికీ ఇక్కడ రసాయన పరిశ్రమల యజమానులు రెచ్చిపోతుండడంతో ప్రజలు బిత్తరపోతున్నారు.
గతంలో కలకలం...
రసాయన పరిశ్రమల యాజమాన్యాలు కెమికల్ మాఫియా ముఠాను తయారు చేసి వారి ద్వారా ట్యాంకర్లలో దూలపల్లి, గాజులరామారం ఫారెస్ట్ ప్రాంతాల్లో డంపింగ్ చేసి చేతులు దులుపుకోగా గతంలో కలకలం రేపింది. అంతే కాకుండా ఏదైనా పరిశ్రమ మూత పడినా ఆ పరిశ్రమను అడ్డాగా చేసుకుని రసాయన వ్యర్థాలను భూముల్లోకి ఇంకేలా పెద్ద పెద్ద గోతులు తవ్వి పూడ్చగా గతంలో పలు సందర్బాల్లో ఇవి బయట పడిన విషయం తెలిసిందే. కొంత మంది మరింత రెచ్చిపోయి చెరువులు, కుంటల్లో రసాయనాలను కల్పడం వల్ల లక్షలాది రూపాయాలు విలువ చేసే చేపలు మృత్యువాడ పడిన విషయం తెలిసిందే. అంతే కాకుండా గంపల బస్తీలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న గోదాముల్లో కెమికల్ డ్రమ్ములను శుద్ధి చేసి వాటి నుంచి వెలువడే రసాయన వ్యర్ధాలను భూమిలోకి ఇంకేలా చేస్తున్నారు. ఈ విషయం పలుమార్లు బయట పడింది.
ఫిర్యాదులు వస్తే పీసీబీ హడావుడి
జీడిమెట్ల పారిశ్రామికవాడలో స్థానికుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని పీసీబీ అధికారులు ఇక్కడ భూమిలో నుంచి పైపులైన్లు వేసి నాలాలోకి రసాయనాలు వదులుతున్న మూడు పరిశ్రమలను గుర్తించారు. శ్రీపతి కెమికల్, కొపల్లి ఫార్మా, ఆర్‌కె మిస్ పరిశ్రమల నుంచి నేరుగా నాలాలోకి వదులుతున్న విషయంపై తవ్వకాలు చేపట్టి మరీ వాటిని సీజ్ చేశారు. మొత్తం ఈ ప్రాంతంలో 74కు పైగా రసాయన పరిశ్రమలు ఉండగా వాటి నుంచి లభించే వ్యర్థాలను ఎక్కడికి తరలిస్తున్నారో అన్నది ఇక్కడ అంతు చిక్కని ప్రశ్నగా మారింది. పీసీబీ అధికారులు మాత్రం నెల వారి మామూళ్లకు అలవాటు పడి అటు వైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment