జాన్వీ బజాజ్
నలభై ఏళ్ల వయసులో అందాల పోటీల్లో పాల్గొనడమంటే ఆషామాషీ కాదు. కానీ ఆమె.. ఆ కలను నిజం చేసుకున్నారు. అందాల కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె నగరవాసి జాన్వీ బజాజ్. గత నెలలో ఢిల్లీలో జరిగిన మిసెస్ ఇండియా క్వీన్ ఆఫ్ సబ్‌స్టాన్స్ (క్లాసికల్) పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. ఇలాంటి కలలు కనడానికే సంకోచించే వయసులో ఆమె దాన్ని సాకారం చేసుకున్నారు. మరెందరో మహిళలకు ఆదర్శంగా నిలిచారు.
– సాక్షి, సిటీబ్యూరో
వయసు 40లో పడిందంటే తాము పెద్దవాళ్లమైపోయామని చాలామంది మహిళలు అనుకుంటారు. గుమ్మం దాటకుండా విశ్రాంతి తీసుకోవడానికి దారులు వెతుకుతారు. కానీ జాన్వీ బజాజ్ (43) మాత్రం విజయాలకు బాటలు వేసుకున్నారు. ప్రతిష్టాత్మక అందాల పోటీలో కిరీటాన్ని సాధించడంతో తన దీర్ఘకాల స్వప్నం సాకారమైందని చెప్పారామె. గత నెలలో ఢిల్లీలో జరిగిన మిసెస్ ఇండియా క్వీన్ ఆఫ్ సబ్‌స్టాన్స్ (క్లాసికల్) పోటీల్లో మొత్తం 49 మంది పాల్గొనగా, ఆమె ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. ఈ సందర్భంగా జాన్వీ ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే...
టీనేజ్ డ్రీమ్..
మాది జైపూర్. కొంతకాలం క్రితం నగరంలో స్థిరపడ్డాం. ఇంగ్లిష్ లిటరేచర్‌లో ఎంఏ చేశాను. సిటీలో ఏరోబిక్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేస్తున్నా, చదువుకునే రోజుల్లో ఇతరత్రా ప్రతిభా సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం నాకు చిక్కలేదనే అసంతృప్తి ఉండేది. ముఖ్యంగా టీనేజర్ నుంచి అందాల పోటీలు చూస్తూ పెరిగాను. కనీసం ఒక్క బ్యూటీ కాంటెస్ట్‌లో అయినా పాల్గొనాలని అనిపించేది. దానికోసం పదేళ్ల క్రితం ఒకసారి, ఏడాది క్రితం మరోసారి దాదాపు తుదికంటా ప్రయత్నించాను. కానీ సాధ్యపడలేదు. తల్లాయ్యాక బాధ్యతలు పెరగడంతో పోటీలకు మరింత దూరమయ్యాను. అయితే బ్యూటీ క్వీన్ టైటిల్‌పై నా డ్రీమ్ మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు నా కుమారుడు పెద్ద వాడయ్యాడు. అలాగే కుటుంబ బాధ్యతలు కూడా తగ్గాయి. దీంతో మళ్లీ నా కల ఊపిరి పోసుకుంది.
ఓవర్‌కమ్ వెయిట్...
బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, పెరిగిన సోషలైజింగ్‌తో రెగ్యులర్ రొటీన్ నుంచి విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఇది కొన్ని అవాంఛనీయ మార్పులకు దారి తీసింది. ఎప్పుడూ లేనంతగా బరువు పెరిగాను. నన్ను నేను అద్దంలో చూసుకోవడానికే అయిష్టంగా ఉండేది. తిరిగి నా ఫిట్‌నెస్‌ను పునరుద్ధరించుకున్నాను. నా ఫుడ్, వర్కవుట్ మీద మరింత శ్రద్ధ పెట్టాను. ఇక ఆలస్యం చేయకుండా నా కలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నించాలని అనిపించింది. అదే సమయంలో ఈ పోటీ గురించి తెలిసి దరఖాస్తు చేశాను.
తడబడ్డా.. నిలబడ్డా..
నేనీ పోటీలో పాల్గొంటున్నానని తెలిసి స్నేహితులు, బంధువులు ప్రోత్సహించారు. పోటీ కోసం ప్రత్యేకంగా డైట్ ప్లాన్ చేసుకున్నాను. పోటీ విభిన్న రౌండ్లలో ఉంటుందని, అవుట్‌ఫిట్స్ కోసం చాలా షాపింగ్ చేశాను. అయితే ఎంత సిద్ధమైనా పోటీదారులను చూసినప్పుడు కాసింత ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. వాళ్లు నా కన్నా ఎన్నో రకాలుగా ముందంజలో ఉన్నారనిపించింది. పోటీ రెండో రోజు కొంత నెర్వస్‌గా ఫీలయ్యాను. అయితే చాలా త్వరగా ఆ పరిస్థితి నుంచి బయటకుపడ్డాను. నాకు చేతనైనంత సత్తా చాటాలనుకున్నాను. కచ్చితంగా టాప్ త్రీలో ఉండాలని నిర్ణయించుకున్నాను. అనుకున్నది సాధించాను. ఇదో గొప్ప ప్రయాణం. దీని నుంచి నేనెన్నో నేర్చుకున్నాను.
కల సాకారం.. అదే సందేశం
నేను ఒక పోటీలో పాల్గొనాలని చాలా రోజులు ఆశించాను. పరిస్థితులు అనుకూలించక పోయినా.. ఆశను చంపేసుకోలేదు. మరోవైపు సమాజం కూడా మధ్య వయసు మహిళల కలలను ఇప్పుడు అర్థం చేసకుంటోందని భావిస్తున్నాను. ఇలాంటి పోటీలపై ఏమైనా వ్యతిరేక భావాలుంటే అవి తొలగించుకోవాలి. పాల్గొనే వరకూ అవి నిజంగా ఎలా ఉంటాయనేది అర్థం కాదు. మహిళ కోరుకున్నది చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఏ సమయంలోనైనా బయట తిరిగే స్వేచ్ఛ కావాలి. సమాజంలో పేరుకుపోయిన కొన్ని భావజాలాలు తొలగించడానికి నా వంతు ప్రయత్నం చేయాలని ఉంది.
Comments
Please login to add a commentAdd a comment