Aerobics
-
Arthritis: నడక, సైక్లింగ్, నీళ్లలో ఏరోబిక్స్ చేస్తున్నారా..?
ఎస్ అంటే ‘స్టార్ట్ స్లో అండ్ గో స్లో : ఆర్థరైటిస్‌తో బాధపడేవారు డాక్టర్లు సూచించిన విధంగా తమకు అనువైన తేలికపాటి వ్యాయామాల్ని ప్రారంభించాలి. అతి మెల్లిగా మొదలు పెట్టి.. క్రమంగా పెంచుకుంటూ పోవాలి. ఎమ్ అంటే మాడిఫై యువర్ యాక్టివిటీ వెన్ ఆర్థరైటిస్ సింప్టమ్స్ ఇంక్రీజ్ : ఆర్థరైటిస్ లక్షణాల్లో ప్రధానమైనది కీళ్లనొప్పి. ఇది తరచూ వస్తూ పోతూ ఉంటుంది. నొప్పి వచ్చి, అది తీవ్రమైనప్పుడు బాధితులు చేసే ఆ వ్యాయామరీతులను వారి లక్షణాలకు తగ్గట్లుగా మార్చుకోవాలి. ఉదాహరణకు తీవ్రత పెరిగినప్పుడు వ్యాయామం చేసే వ్యవధినీ, వ్యాయామ తీవ్రతనూ తగ్గించుకోవాలి. దీనివల్ల నొప్పి మరింతగా పెరగకుండా చూసుకోవచ్చు. ఏ అంటే ఏక్టివిటీస్ షుడ్ బి జాయింట్ ఫ్రెండ్లీ: బాధితుల వ్యాయామాలు వారి కీళ్లకూ, కండరాలకు మరింత మేలు చేసేలా ఉండాలి. ఉదాహరణకు వ్యాయామాల్లోని తేలికపాటివి... అంటే నడక, సైక్లింగ్, నీళ్లలో చేసేవి బాధితులకు శ్రమ ఎక్కువగా కలిగించవు. పైగా అవన్నీ చాలావరకు స్వాభావికమైనవే. నీళ్లలో వ్యాయామాలు చేయడం వల్ల కీళ్లపై పడే శరీర బరువు బాగా తగ్గుతుంది. అందువల్ల నీళ్లలో ఏరోబిక్స్ కీళ్లకు మేలు చేసేవిగా (జాయింట్ ఫ్రెండ్లీ)గా ఉంటాయన్నమాట. ఆర్ అంటే రికగ్నైజ్ సేఫ్ ప్లేసెస్ అండ్ వేస్ టు బి యాక్టివ్: ఆర్థరైటిస్ ఉన్నవారిలో ఎముకలు పెళుసుబారి ఉంటాయి. అందుకే అవి చిన్నపాటి శ్రమకు కూడా విరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే వ్యాయామం చేయడానికి సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవడం కూడా అవసరమే. ఉదాహరణకు పార్క్‌లో నడుస్తున్నప్పుడు... అక్కడి వాకింగ్ ట్రాక్ పగుళ్లు లేకుండా, స్లిప్ అవ్వడానికి అవకాశం లేకుండా సురక్షితంగా ఉండటం అవసరం. అలాగే చుట్టుపక్కల పెద్ద బండరాళ్లు ఉన్న ప్రదేశమైతే.. పొరబాటున పడిపోతే తలకు బలమైన గాయాలయ్యే అవకాశం ఎక్కువ. అలాంటివేవీ లేని సమతల ప్రదేశంలోనే వ్యాయామం చేయాలి. ఒకవేళ కాస్తంత సాయం సమయంలో చీకటిపడ్డప్పుడు వాకింగ్ చేస్తుంటే, అక్కడ తగినంత లైట్ల వెలుతురు ఉండేలా చూసుకోవాలి. టీ అంటే టాక్ టు హెల్త్ ప్రొఫెషనల్ : చిన్నవయసు ఆరోగ్యవంతులు కాకుండా... మరెవరు(అంటే కీళ్లనొప్పులు, గుండెజబ్బులు... వంటివి ఉన్నవారు) వ్యాయామాలు ప్రారంభించినా... ముందుగా ఓసారి వ్యాయామ నిపుణుడితోపాటు డాక్టర్ (లైఫ్‌స్టైల్ నిపుణులు లేదా ఆర్థో / గుండె / ఫిజీషియన్)ను సంప్రదించి, తమకు తగిన వ్యాయామాలేమిటో తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధులతో బాధపడేవారు ఎలాంటి వ్యాయామాలు చేయాలో నిపుణులు మాత్రమే సూచిస్తారు. చదవండి: Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే.. -
Mental Health: మంచి మ్యూజిక్, యోగా, డాన్స్, స్విమ్మింగ్.. వీటితో ఒత్తిడి హుష్!!
ఇటీవలి కాలంలో చిన్నవారి నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరినీ పీడిస్తున్న సమస్య మానసిక ఒత్తిడి. మన శక్తి సామర్థ్యాల గురించి మనం ఉన్నదానికన్నా బాగా ఎక్కువగా లేదా బాగా తక్కువగా ఊహించుకోవడం... ఫలితంగా నిరాశకు గురికావడం, మన గురించి మనం ఆలోచించడం కన్నా ఇతరులలో తప్పులు ఎన్నడం, సమయానికి తిండి, నిద్ర లేకపోవడం, ఎక్కువగా పని చేస్తూ తీవ్రమైన అలసటకు గురికావడం ఒత్తిడికి గురి చేస్తుంది. ఒత్తిడి వల్ల మన నాడీవ్యవస్థలోనూ, నరాల్లోనూ రసాయనాల మార్పులు జరుగుతాయి. ఆ మార్పుల వల్ల రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్‌తో పాటు చక్కెర పాళ్లు పెరుగుతాయి. ఇది ఎక్కువయితే కుంగుబాటు లేదా డిప్రెషన్ వస్తుంది. డిప్రెషన్ వల్ల అనేక దుష్పరిణామాలు కలుగుతాయి. కనుక ఒత్తిడికి గురికాకుండా ముందే జాగ్రత్త పడటం, ఒత్తిడి ఎక్కువయినప్పుడు వాటినుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవడం అవసరం. చదవండి: Helath Tips: కాఫీ తాగే అలవాటుందా? నిద్రలేమి, యాంగ్జైటీ, చిరాకు.. ఇలా అధిగమిద్దాం.. ►ఒక విషయం గురించి ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. అవతలి వారు చెప్పేదానిని వినడం, తక్కువ మాట్లాడటం మంచిది. ►విషయాలను మన కోణం నుంచి మాత్రమే కాకుండా ఎదుటి వారి కోణం నుంచి కూడా చూసి ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ►మన భావోద్వేగాలను బలవంతంగా అణిచేసుకోకుండా సన్నిహితులతో పంచుకోవడం వల్ల ఒత్తిడిని దూరం పెట్టవచ్చు. ►దేనికి ఒత్తిడికి గురి అవుతున్నామో గమనించుకుని రెండోసారి దానికే మళ్ళీ గురి కాకుండా ఉండేలా చూసుకోవాలి. ►సానుకూల దృక్పథంతో ఉండటం, మనసుకు సంతోషాన్నిచ్చే పనులు చేయడం వల్ల ప్రశాంతత కలుగుతుంది. ►మన ప్రవర్తనను ప్రభావితం చేసే ధూమపానానికీ, మద్యానికి, మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ►సంపాదనలో కనీసం పది శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యడం వల్ల కలిగే మానసిక తృప్తి ఒత్తిడికి గురి కాకుండా చేస్తుంది. ►నాకు వద్దు, నాకు రాదు, నాకు చేతకాదు అనే మాటలను చెప్పడం మానుకోవాలి. ►ఎప్పుడూ ఇంట్లోనే లేదా ఒక గదిలోనే కూర్చుండి పోవడం కన్నా బయటకు వెళ్లడం, స్నేహితులతో, బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం, సత్సంగం చేయడం ఒత్తిడిని తగ్గిస్తుంది. చదవండి: World Sight Day: ఆరెంజ్, క్యారెట్, రాగులు, ఉసిరి.. తిన్నారంటే.. మీ కంటి చూపు.. మంచి మ్యూజిక్ వినడం, యోగా, ఇంకా.. ►ఇష్టమైన సంగీతం వినడం, పాటలు వింటూ కూనిరాగాలు తీయడం కూడా ఒత్తిడి తగ్గిస్తుంది. ►వారానికి ఒకసారి ఉపవాసం చేయడం, ఉదయం సూర్యోదయంలోని లేత కిరణాలు ఒంటికి తగిలేలా కూర్చోవడం; సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూడడం మంచిది. ►మన ఆందోళన వలన సమస్యలు తొందరగా గానీ, సజావుగా కానీ పూర్తి కావని గుర్తించటం, నవ్వుతూ ఉండటం, ఈ ప్రపంచం అనే అందమైన ప్రకృతిలో మనమూ ఒక భాగమేనని గుర్తించటం, యోగ, ప్రాణాయామం చేయడం ఒత్తిడిని దూరంగా ఉంచుతాయి. ►గాఢంగా ఊపిరి పీల్చి వదలడం వంటి బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం... ►ప్రతి రోజు ఒక గంట ఏరోబిక్స్ లేదా టి.విలో చూస్తూ డాన్స్ చేయడం, వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటి వాటిలో ఏదో ఒకటి క్రమం తప్పకుండా చేయడం వల్ల గుండె , ఊపిరితిత్తులు, రక్తనాళాలు ఆరోగ్యకరంగా పనిచేస్తాయి. కండరాలు, కీళ్ళు గట్టిపడతాయి. శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. వ్యాయామంలో స్ట్రెస్‌ని కలిగించే హార్మోన్లు నశించి, మంచి హార్మోన్లు, ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. అవి ఒత్తిడిని దూరం చేస్తాయి. ►టెన్నిస్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, హాకీ లేదా క్రికెట్ వంటి ఆటలు ఆడుతుండాలి. ►ఉద్యోగంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమందితో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఒత్తిడి తగ్గుతుంది, ఆరోగ్యకరమైన పోటీ పెరుగుతుంది. నాయకత్వపు లక్షణాలు అలవడతాయి. ►ఏదైనా అంశం తీవ్రంగా బాధపెడుతుండటం లేదా పదే పదే గుర్తుకొస్తూ పశ్చాత్తాపానికి గురిచేస్తుంటే మరింకేదైనా వ్యాపకంలో పడుతూ దాన్ని మరచిపోవడం ఒత్తిడి నుంచి బయట పడేందుకు దోహదం చేస్తుంది. చివరగా ఒక్క విషయం... ఒత్తిడికి గురయ్యే క్షణాల్లో చిక్కుకున్నప్పుడు అది తప్పని పరిస్థితి అని, దాని కారణంగా ఒత్తిడికి గురవుతూ అంతర్మధనానికి లోనుకోవడం కంటే... అది తప్పించుకోలేని పరిస్థితి కాబట్టి, ఆ స్థితిని యథాతథంగా స్వీకరించడం మంచిదని మనం సర్దిచెప్పుకోవడం, పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడటం, సమస్యలను అధిగమించాల్సిన కోణంలో పరిశీలించడం వంటి కొన్ని మార్గాల ద్వారా ఒత్తిడిని సులువుగా అధిగమించవచ్చు. చదవండి: టీనేజర్స్ మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా బ్యాడ్ ఎఫెక్ట్..! -
జుంబా..రే: అందం, ఆరోగ్యం అన్నింటికీ ఒకటే మంత్రం
సాక్షి, భద్రాచలం(ఖమ్మం): గతంలో మెట్రో నగరాలకే పరిమితమైన ఫిట్‌నెట్ సంగీతాలు నేడు ఏజెన్సీ ప్రాంతంలోనూ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం యువత ఆరోగ్యంతో పాటు అందానికి ప్రాముఖ్యత ఇస్తూ, ఫిట్నెస్ను మెరుగుపర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలోనూ ఏరోబిక్స్, జుంబా నృత్యాలు కనిపించడం విశేషం. ఆధునికతను జోడించుకుని బరువు తగ్గించుకునే ఈ పద్ధతికి మహిళల నుంచి కూడా ఆదరణ లభిస్తోంది. అందం, ఆరోగ్యాల కలబోత నయా ఫిట్నెస్ మంత్ర.. నేడు మారిన ఆహార పద్ధతులతో ఊబకాయం ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించుకోవడానికి పురుషులు, మహిళలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో శాస్త్రీయంగా బరువును తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం జిమ్‌లు, ఏరోబిక్స్, జూంబా వంటివి కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే వీటిలో ఏరోబిక్స్, జుంబాలకు ప్రత్యేక శిక్షణ కలిగిన నిపుణులు అవసరమం. అలాంటి ఏరోబిక్స్, జుంబాల ఫిట్నెస్ సెంటర్లు సైతం ఏజెన్సీలోని భద్రాచలం, కొత్తగూడెం వంటి పట్టణాల్లో కనిపిస్తున్నాయి. ఉద్యోగులు, వైద్యులు, గృహిణులు ఖాళీ సమయాల్లో సంతోషంగా, ఆహ్లాదకరమైన సంగీతం వింటూ ఫిట్నెస్ను మెరుగుపర్చుకునేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. సులువుగా ఏరోబిక్స్, జుంబా.. బరువు తగ్గించేందుకు ఏరోబిక్స్, జుంబాల శిక్షణను విడివిడిగా నిర్వహిస్తారు. అయితే ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా రెండింటినీ కలబోసి ఫిట్నెస్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఏరోబిక్స్‌లో ప్లోర్, స్టెప్ వర్కౌట్లు, స్టెప్ ఏరోబిక్స్, బాల్ ఏరోబిక్స్, రోపింగ్లతో సాధన చేయిస్తారు. ఇక జుంబాలో ఆహ్లాదకరమైన సంగీతంతో సులువైన ఆసనాలతో కూడిన నృత్యాలు, ఎక్సర్సైజ్ స్టెప్పులతో ఉంటుంది. రోజుకు ఒక గంటలో చేసే వీటి ద్వారా సుమారు 500 నుంచి 800 వరకు కేలరీస్ ఖర్చవుతాయని శిక్షకులు చెబుతున్నారు. మూడు నెలల్లో 5 నుంచి 8 కేజీల బరువు తగ్గుతారని అంటున్నారు. ఈ సెంటర్లతో చాలా ఉపయోగం గతంలో ఉద్యోగ రీత్యా మెట్రో సిటీలలో ఉండేవాళ్లం. అక్కడ కనిపించే ఫిట్నెస్ సెంటర్లు భద్రాచలంలో కూడా ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యాను. ప్రతిరోజూ ఫిట్నెస్ సెంటర్‌కు వస్తున్నాను. చార్జీలు సైతం సిటీలో కంటే చాలా తక్కువగా ఉన్నాయి. – శిల్ప, గృహిణి పది కేజీల బరువు తగ్గాను ఎటువంటి ప్రయాసలు, శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుండా అధిక బరువును తగ్గించుకోవటానికి ఇది చాలా సులువైన మార్గం. ఉల్లాసంగా.. ఉత్సాహంగా..ఏరోబిక్స్, జుంబాలో వర్కవుట్ చేస్తూ మూడు నెలల్లో పది కేజీల బరువు తగ్గాను. – రీనా, గృహిణి వ్యయ, ప్రయాసలతో ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశాం ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో ఏరోబిక్స్, జుంబాలను పరిచయం చేయాలనే సంకల్పంతోనే ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి దీన్ని ఏర్పాటు చేశాం. స్పందన అద్భుతంగా వస్తోంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మహిళలైనా, పురుషులైనా బరువు తగ్గించుకోవడానికి ఇది సులువైన మార్గం. – నాగరాజు, ప్రియాంక, క్రేజీ మాస్టర్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో నిర్వాహకులు, భద్రాచలం -
ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోండిలా..
ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే కొంత శారీరక వ్యాయామం అవసరం. బరువు తగ్గాల్సిన ప్రక్రియలో లయబద్ధమైన శాస్వప్రక్రియతో పాటు గుండెవేగం, రక్తనాళాల్లో రక్తప్రసరణ పెరగడం, కండరాలకు తగిన పని... ఈ అన్ని కార్యక్రమాలు సరైన సమన్వయంతో జరిగినప్పుడే కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. ఇలా కొవ్వును తగ్గించే వ్యాయామాల్నే ఏరోబిక్స్ అంటారు. ఏరోబిక్స్ చేస్తున్నప్పుడు కొవ్వు ఎలా కరుగుతుందో తెలుసుకుందాం. ►ఊపిరితిత్తులు – శ్వాసించడం ద్వారా ప్రాణవాయువు ఊపిరితిత్తులను చేరుతుంది. సరిగా శ్వాసించడం వల్ల బయటి వాయువుల నుంచి ఆక్సిజన్‌ను ఎక్కువ గ్రహించగలుగుతాం. ►గుండె, రక్తనాళాలు –ఈ సిస్టమ్ శరీరంలో ఓ రవాణ వ్యవస్థలా పనిచేస్తుంది. గుండె, రక్తనాళాలు ఆక్సిజన్‌ను, పోషక పదార్థాలను శరీరంలోని కణజాలలకు అందచేస్తాయి. ఎరోబిక్ ద్వారా (ఓ నిర్ణీత పరిమితిలో) ఎంతగా గుండె కొట్టుకునేలా చేయగలిగితే అంత సమర్థంగా ఈ రవాణాను మెరుగుపరచవచ్చు. ►పనిచేసె కండరాలు – ఇవి ఆక్సిజన్‌ను, పోషక పదార్థాలను గ్రహిస్తాయి. ►చక్కగా శ్వాసించడం, గుండె అధికంగా కొట్టుకోవటం, కండరాల పనితీరు– ఇవన్నీ శరీరంలో కొవ్వు కరిగేందుకు ఉపకరిస్తాయని తెలుసుకున్నాం కదా! ఈ మూడు పద్దతులను ఏకకాలంలో చేసినప్పుడు దీని వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఈ రకమైన వ్యాయామాలనే ఎరోబిక్ ఎక్సర్సైజ్లు అని అంటారు. ఉదా. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి వ్యాయామాలు కొవ్వుని తగ్గించటంలో బాగా ఉపయోగపడతాయి. ఆల్కహాల్‌ను వదిలించే డీ–అడిక్షన్ ఎలా చేస్తారు? ఆల్కహాల్ సమాజంలో చాలా మంది జీవితాలను నాశనం చేస్తోంది. అయితే ఇది పరిష్కారం లేని సమస్యేమీ కాదు. ఆల్కహాల్‌కు అలవాటు పడినవారిని స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటి రకానికి చెందిన వారిలో... తమ సమస్య గురించి వారికి ఏమీ తెలియదు. తాము ఎప్పుడు మానాలంటే అప్పుడు మానేయగలమని భావించి, చికిత్సకు రారు. ఇలాంటివారి విషయంలోనూ కుటుంబానికి చేరువై సైకియాట్రిస్ట్‌లు వాళ్ల అలవాటు మాన్పించడానికి ఏదో ఒకటి చేయగలరు. ఇక రెండో రకానికి చెందిన వారికి తమ సమస్య ఎంత తీవ్రమైనదో వాళ్లకు అవగాహన ఉంటుంది. కానీ అలవాటు వారిని మద్యానికి బానిసలుగా మార్చేయడం వల్ల కోరికను జయించలేకపోతుంటారు. కాబట్టి ఈ రెండు రకాల వారికి ఏది అవసరమో ఆ చికిత్స చేయాల్సి ఉంటుంది. అంతేగాని... అందరినీ ఒకేగాటన గట్టి రీహాబ్ క్యాంప్‌లో చేర్చడం వల్ల ప్రయోజనం ఉండదు. పైగా దాని ప్రభావం తాత్కాలికం మాత్రమే. మొదట వారి సమస్య ఎంత తీవ్రమైనదన్న విషయంపై సైకియాట్రిస్ట్‌లు కౌన్సెలింగ్ ద్వారా పేషెంట్‌కు తెలియజెపుతారు. ఆ కౌన్సెలింగ్ ప్రక్రియలో సైకియాట్రిస్టులకు పేషెంట్ సహకారించాల్సి ఉంటుంది. పేషెంట్ సహకారం లేకుండా ఆ అలవాటు మాన్పించడం కష్టం. ఆల్కహాలిజమ్ అన్నది ఒక అలవాటు కాదనీ... అది ఒక వ్యాధి అని వాళ్లలో బలంగా నాటుకుపోయేలా చేయాలి. ఆ తర్వాత ఆల్కహాల్ వల్ల వాళ్ల ఒంటిలో పేరుకున్న విషాలను క్రమంగా తొలగించే మందులు ఇవ్వాలి. ఇలా చేసే క్రమంలో ఫిట్స్ రావడం లేదా వాళ్లు తీవ్రమైన కోపోద్రేకాలకు లోనుకావడం వంటి సైడ్ఎఫెక్ట్స్ వస్తున్నాయేమో చూసి... వాటిని రాకుండా మందులు మారుస్తూ పోవాలి. గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే.. ఈ సమస్యకు ఒక రోజులో మంత్రం వేసినట్లుగా చికిత్స సాధ్యం కాదు. అలా చేయగలమంటూ వచ్చే అడ్వర్టయిజ్మెంట్లను నమ్మవద్దు. ఎందుకంటే అలాంటి మందులతో కాలేయం, గుండె వంటివి పాడయ్యే అవకాశం ఉంది. అందుకే దీన్ని ఒక మానసిక సమస్యలా పరిగణించి నిద్రసంబంధ వ్యాధినీ, డిప్రెషన్‌నూ, వివాహబంధాన్నీ, సామాజిక సంబంధాలనూ, యాంగై్జటీనీ, ఫోబియాలను, ఇతర భయాలనూ పరిగణనలోకి తీసుకుని చికిత్స చేస్తే ఈ అలవాటునుంచి బయటపడగలడు. -
కరోనాను ఎదుర్కొనే కొత్త వ్యాయామం
సాక్షి, న్యూఢిల్లీ : మనుషులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామానికి మించిన మంచి మార్గం మరొకటి లేదని నిపుణులు ఆది నుంచి చెబుతూనే ఉన్నారు. వ్యాయామంలో రెండు రకాలని, ఒకటి ఎరోబిక్ అయితే మరొకటి ఎనరోబిక్ వ్యాయామాలంటూ కూడా విభజన తీసుకొచ్చారు. ఎరోబిక్ అంటే గాలి ఎక్కువగా అందుబాటులో ఉండే మైదానాల్లో నడవడం, పరుగెత్తడం, ఈత కొట్టడం కాగా, ఎనరోబిక్ అంటే బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వెయిట్ లిఫ్టింగ్, జంపింగ్ లాంటివి. ఒకానొక దశలో ఈ రెండు కూడా కలసిపోయి జిమ్ముల రూపంలో వెలిశాయి. ఎరోబిక్స్‌లో డాన్యుల లాంటివి కూడా కలిసిపోయాయి. (చదవండి : కరోనా రోగులకు మరో షాక్?!) ఆరోగ్యంతో పాటు శీరర సౌష్టవం సొగసుగా ఉండాలంటే ఎరోబిక్స్ ముఖ్యమని, ఎనరోబిక్స్ కూడా ముఖ్యమని, రెండూ కూడా అవసరమనే వాదనలు తలెత్తాయి, సద్దుమణిగాయి. ప్రాణాంతక కరోనా విజంభిస్తోన్న నేటి సమయంలో వ్యాయామం ఒక్క దానితో ప్రాణాలను కాపాడు కోలేమని, పౌష్టికాహారంతోపాటు అవసరమైన విటమిన్లు మింగాల్సిందేనంటూ కొంత మంది వైద్యులు చెబుతూ వచ్చారు. విటమిన్ల వల్ల మానవ శరీరాల్లో రోగ నిరోధక శక్తి పెరగుతోందని కూడా చెప్పారు. మనలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే విటమిన్ల సమతౌల్యంతో పౌష్టికాహారం తీసుకుంటే సరిపోదని, ‘రెసిస్టెంట్ ఎక్సర్సైజ్’ అవసరమని డాక్టర్ మైఖేల్ మోస్లీ కొత్త వాదన తీసుకొచ్చారు. ఈ వ్యాయామం చేసే వారికి కరోనా వ్యాక్సిన్లు కూడా బాగా పని చేస్తాయని చెప్పారు. ఈ విషయం కాలిఫోర్నియాలో వాలంటర్లీపై తాజాగా జరిపిన అధ్యయనంలో తేలిందని చెప్పారు. అంటు రోగాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు తాను గత కొంత కాలంగా రెసిస్టెంట్ ఎక్సర్సైజ్ చేస్తూ శిక్షణ కూడా ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. (చదవండి : అందుకే లాక్డౌన్ పొడగిస్తున్నాం) పుషప్స్, ప్రెసప్స్, స్క్వాట్స్, అబ్డామన్ క్రంచెస్, లంగ్స్, ప్లాంక్ వ్యాయామాలతో శరీరంలోని ‘టీ–సెల్స్’ అభివద్ధి చెంది రోగ నిరోధక శక్తి పెరగతుందని ఆయన చెప్పారు. ఫిజియో థెరపీ కింద వాడే సాగే రిబ్బన్లను తీసుకొని 15 నిమిషాలపాటు చేతులు, భుజాల వ్యాయామం తాను కొత్తగా ప్రయోగించి చూశానని, సాగే రిబ్బన్లను లాగడం వల్ల శరీర కణాల్లో చురుకుదనం బాగా పెరగతోందని ఆయన వివరించారు. ఆయన తన అధ్యయన వివరాలను పూర్తిగా ‘స్పోర్ట్స్ అండ్ హెల్త్’ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు. గుండె బాగుండాలంటే పషప్స్ ఒక్కటే సరిపోవని, శరీరాన్ని బాలెన్స్ చేస్తూ చేసే స్క్వాట్స్ ఎంతో అవసరమని డాక్టర్ మైఖేల్ తెలిపారు. వీటి వల్ల గుండెపోటు వచ్చే అవకాశం 20 శాతం తగ్గుతుందని డాక్టర్ చెప్పారు. మొదట కరోనా ఎదుర్కోవాలంటీ యోగా చేయాలని, ఊపిరితిత్తుల బలం కోసం బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయాలంటూ ఇంతవరకు ప్రచారంలో ఉన్న విషయం తెల్సిందే.(చదవండి :కరోనా దెబ్బ: తిరోగమనమే!) -
డోంట్ వర్రీ.. ఈజీ డెలివరీ
గర్భం దాల్చిన రోజు నుంచే సిజేరియన్‌కు మానసికంగా సిద్ధమైపోతోంది ఆధునిక మహిళ. నార్మల్ డెలివరీ అనేది దాదాపు అసాధ్యం అనే స్థాయికి ఆలోచనలు స్థిరపడ్డాయి. ఈ నేపథ్యంలో వ్యాయామం అలవాటు నార్మల్ డెలివరీకి, చక్కని సంతానభాగ్యానికి హామీగా మారుతూ పలువురిలో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. సిజేరియన్ బాధ లేకుండా పిల్లల్ని కనాలనుకునే వివాహితలకు సహకరించడం దగ్గర్నుంచి గర్భిణిగా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకూ, ప్రసవానంతరం తలెత్తే పలు ఆరోగ్య సమస్యల పరిష్కచారానికి, డెలివరీ అనంతరం శరీరాకృతి మెరుగు పరుచుకునేందుకు కూడా ఉపకరిస్తోంది. దీన్ని గుర్తిస్తున్న నగర మహిళ ఆ‘పరేషాన్’కి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. సాక్షి, హైదరాబాద్ (సిటీబ్యూరో) : హిమాయత్ నగర్లో నివసించే రమ్య ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. గర్భవతిగా తగినంత వ్యాయామం చేస్తూ.. నార్మల్ డెలివరీ ద్వారా చక్కని పాపకు జన్మనిచ్చారు. గర్భిణిగా ఉన్నా అన్ని వ్యాయామాలు, ఆసనాలు సాధన చేయవచ్చని స‘చిత్ర’ సమేతంగా నిరూపిస్తూ గర్భం దాల్చిన దగ్గర్నుంచి బిడ్డ పుట్టేవరకూ ఆమె పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌లు ఎంతో మందికి స్ఫూర్తిని అందించాయి. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో ఆమె తన అనుభవాలను ఇలా పంచుకున్నారు. ఆసనాలు ఇలా వేయాలి.. సూర్యనమస్కారాలు కాస్త సులభతరం చేసి చేయాలి. ఇందులో కోబ్రా పోజ్ తప్ప అన్నీ చేయవచ్చు. వృక్షాసన, తాడాసన, సేతుబంధాసన (ఇది ఎక్కువ సేపు కాకుండా 2 శ్వాసల కాలం మాత్రమే) అథోముఖ శ్వాసాసన వంటివి చేయవచ్చు. బటర్‌ఫ్లై ఆసనం కూడా చేయవచ్చు. ఫార్వర్డ్ బెండ్స్ చేసేటప్పుడు సగం మాత్రమే బెండ్ అవాలి. నెలలు నిండుతుంటే... వైడ్ లెగ్ ఫార్వార్డ్ ఫోల్డ్ చేయాలి. శశాంకాసన వంటివి చేయకూడదు. మాలాసన బాగా చేయాలి. నొప్పులు రాని పరిస్థితిని నివారించేందుకు ఇదిఅవసరం. మాలాసన చాలా ఉపయుక్తం. ఇది నేచురల్ డెలివరీకి బాగా ఉపకరిస్తుంది. నా విషయంలో.. 37 వారాల తర్వాత బేబీ తల రివర్స్ అయింది. దీంతో మంచం మీద కాళ్లు పెట్టి తల కిందకు పెట్టి చేసే ఇన్వర్షన్స్ వర్కవుట్ చేశాను. ప్రాబ్లం సాల్వ్ అయింది. గర్భిణులకు ఆహారం తీసుకున్న తర్వాత అరుగుదల కాసింత ఆలస్యం అవుతుంది. కాబట్టి.. తిన్నాక కనీసం 4గంటల తర్వాత మాత్రమే వ్యాయామాలు/ఆసనాలు చేయడం మంచిది. లంచ్ అయ్యాక ఈవినింగ్ స్నాక్స్‌కి ముందు సమయం అయితే బెటర్. ఆరోగ్య సంతాన ‘ప్రాప్తి’కోసం.. సంతానభాగ్యానికి అడ్డుపడే ఆరోగ్యపరమైన ఇబ్బందులని తొలగించుకోవడానికి నడక వంటి వ్యాయామాలను, యోగాసనాలు ఉపకరిస్తాయి. వీటిని దినచర్యలో భాగం చేసుకోగలిగితే హార్మోన్ల సమతుల్యత పెంపొందడం, రక్తప్రసరణ సజావుగా సాగడం, పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపడతాయి. తద్వారా సంతానలేమికి కారణమైన సమస్యల నివారణకు అవకాశం ఎక్కువ. గర్భం దాల్చాలని ఆశిస్తున్న వివాహితలు తమ ఆరోగ్య పరిస్థితికి అనువైన అన్ని రకాల యోగాసనాలను సాధన చేయవచ్చు. అలాగే ప్రసవానంతరం కూడా... శరీరం వదులు కావడం వంటి కొన్ని సమస్యలు వస్తాయి. వాటికి కూడా యోగాయే సమాధానం. వాకింగ్‌తో క్వీన్.. గర్భధారణ సమయంలో కూడా ఎప్పటిలాగే చురుగ్గా ఉండాలి. గర్భవతులకు వాకింగ్ చాలా ఉపయుక్తం. తొలి రెండు త్రైమాసికాల్లో ప్రతిరోజూ స్లో వాకింగ్ చివర్లో బ్రిస్క్ వాకింగ్ చేయవచ్చు. దాదాపు 28 వారాలు నిండాక ప్రీమేటల్ ఏరోబిక్స్ కూడా చేయవచ్చు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చాలా హెల్ప్‌ఫుల్. ప్రాణాయామ, అనులోమ, విలోమ ప్రాణాయామాలు చేయవచ్చు. ఎంత బాగా డీప్ బ్రీత్ తీసుకుంటే అంత చక్కగా శ్వాసని కడుపులోని బేబీకి పంపుతున్నట్టు అర్థం. మరో 2, 3 రోజుల్లో డెలివరీ ఉందనగా మెట్లు ఎక్కి దిగడం వంటివి చేస్తే ప్రసవం మరింత సులభం అవుతుంది. అలాగే డెలివరీ సమయంలో నొప్పుల్ని తగ్గించుకోవాలంటే... వేణ్నీళ్ల టబ్ ఒక మార్గం. నా డెలివరీ వాటర్ టబ్‌లోనే అయ్యింది. శారీరక శ్రమ అవసరమే.. అడుగు తీసి అడుగేయవద్దు, అటు పుల్ల ఇటు తీసి పెట్టొద్దు.. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు వంటి అతి జాగ్రత్తలు గర్ణిణుల విషయంలో సర్వసాధారణం. అయితే అవి సరికాదు. నడక వంటి తేలికపాటి వ్యాయామాలతో పాటు, గర్భంలోని శిశువు సజావుగా పెరగడానికి, తల్లి ఆరోగ్యంలో అసాధారణ మార్పు చేర్పులు చోటు చేసుకోకుండా ఉండడానికి యోగాసనాల సాధన అత్యంత ఉపయుక్తం. మూడోనెల నుంచీ.. గర్భధారణ తర్వాత 3 నెలల తర్వాత నుంచి ఆసనాలు సాధన చేయవచ్చు. తగినంత యోగా నైపుణ్యం ఉన్నవారైతే ఇంకాస్త ముందుగానే మొదలుపెట్టవచ్చు. తేలికపాటి భంగిమలకు, ఆసనాలకు పరిమితం కావాలి. ముఖ్యంగా వెనుకకు బాగా వంగి చేసే ఆసనాలు వేయకూడదు. అలా చేస్తే ప్లెసెంటా డిటాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్ట్రెచ్చింగ్లు (శరీరాన్ని సాగదీసే వ్యాయామ భంగిమలు) అన్నీ చేయవచ్చు కానీ అశ్వసంచలాసన లాంటి ట్విస్ట్స్ చేయకూడదు. ఓపెన్ ట్విస్ట్స్ చేయవచ్చు. భరద్వాజాసన లాంటివి చేయవచ్చు. దీనిలోనే క్లోజ్ ట్విస్ట్స్ చేయకూడదు. అధిక ఆహారం అవసరం లేదు.. కొంత మంది తల్లీ, బిడ్డ.. ఇద్దరి కోసం తింటున్నాం అనే భావనతో రోజువారీగా తీసుకునే ఆహారం అమాంతం పెంచేస్తారు. అది సరికాదు. సగటున మహిళకు సాధారణ పరిస్థితుల్లో.. 300 కేలరీల కంటే ఎక్కువ ఆహారం అవసరం లేదు. గర్భవతిగా ఉన్నప్పుడు అత్యధికంగా 10 నుంచి 12 కిలోల బరువు పెరగడం వరకూ ఫర్వాలేదు. అంతకన్నా ఎక్కువైతే ఇబ్బందులే. డ్రైఫ్రూట్స్, ఆకు కూరలు, ప్రొటీన్‌ఫుడ్ బాగా తీసుకోవాలి. స్వీట్స్ ఎక్కువ తింటే జెస్టేషనల్ డయాబెటిస్ రావచ్చు. స్వీట్స్ బాగా తక్కువగా తీసుకోవాలి. పన్నీర్, పెరుగు వంటి కాల్షియం పుష్కలంగా ఉండేవి తీసుకోవాలి. రక్తహీనత సమస్యను అధిగమించేందుకు ఖర్జూరం, బీట్రూట్.. క్యారెట్, పాలకూర, తోటకూర వంటివి బాగా తీసుకోవాలి. -
అద్దంలో చూసుకోవాలనిపించేది కాదు.. కానీ!
నలభై ఏళ్ల వయసులో అందాల పోటీల్లో పాల్గొనడమంటే ఆషామాషీ కాదు. కానీ ఆమె.. ఆ కలను నిజం చేసుకున్నారు. అందాల కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె నగరవాసి జాన్వీ బజాజ్. గత నెలలో ఢిల్లీలో జరిగిన మిసెస్ ఇండియా క్వీన్ ఆఫ్ సబ్‌స్టాన్స్ (క్లాసికల్) పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. ఇలాంటి కలలు కనడానికే సంకోచించే వయసులో ఆమె దాన్ని సాకారం చేసుకున్నారు. మరెందరో మహిళలకు ఆదర్శంగా నిలిచారు. – సాక్షి, సిటీబ్యూరో వయసు 40లో పడిందంటే తాము పెద్దవాళ్లమైపోయామని చాలామంది మహిళలు అనుకుంటారు. గుమ్మం దాటకుండా విశ్రాంతి తీసుకోవడానికి దారులు వెతుకుతారు. కానీ జాన్వీ బజాజ్ (43) మాత్రం విజయాలకు బాటలు వేసుకున్నారు. ప్రతిష్టాత్మక అందాల పోటీలో కిరీటాన్ని సాధించడంతో తన దీర్ఘకాల స్వప్నం సాకారమైందని చెప్పారామె. గత నెలలో ఢిల్లీలో జరిగిన మిసెస్ ఇండియా క్వీన్ ఆఫ్ సబ్‌స్టాన్స్ (క్లాసికల్) పోటీల్లో మొత్తం 49 మంది పాల్గొనగా, ఆమె ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. ఈ సందర్భంగా జాన్వీ ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... టీనేజ్ డ్రీమ్.. మాది జైపూర్. కొంతకాలం క్రితం నగరంలో స్థిరపడ్డాం. ఇంగ్లిష్ లిటరేచర్‌లో ఎంఏ చేశాను. సిటీలో ఏరోబిక్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఫిట్నెస్ మెయింటెయిన్ చేస్తున్నా, చదువుకునే రోజుల్లో ఇతరత్రా ప్రతిభా సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం నాకు చిక్కలేదనే అసంతృప్తి ఉండేది. ముఖ్యంగా టీనేజర్ నుంచి అందాల పోటీలు చూస్తూ పెరిగాను. కనీసం ఒక్క బ్యూటీ కాంటెస్ట్‌లో అయినా పాల్గొనాలని అనిపించేది. దానికోసం పదేళ్ల క్రితం ఒకసారి, ఏడాది క్రితం మరోసారి దాదాపు తుదికంటా ప్రయత్నించాను. కానీ సాధ్యపడలేదు. తల్లాయ్యాక బాధ్యతలు పెరగడంతో పోటీలకు మరింత దూరమయ్యాను. అయితే బ్యూటీ క్వీన్ టైటిల్‌పై నా డ్రీమ్ మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు నా కుమారుడు పెద్ద వాడయ్యాడు. అలాగే కుటుంబ బాధ్యతలు కూడా తగ్గాయి. దీంతో మళ్లీ నా కల ఊపిరి పోసుకుంది. ఓవర్‌కమ్ వెయిట్... బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, పెరిగిన సోషలైజింగ్తో రెగ్యులర్ రొటీన్ నుంచి విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఇది కొన్ని అవాంఛనీయ మార్పులకు దారి తీసింది. ఎప్పుడూ లేనంతగా బరువు పెరిగాను. నన్ను నేను అద్దంలో చూసుకోవడానికే అయిష్టంగా ఉండేది. తిరిగి నా ఫిట్నెస్ను పునరుద్ధరించుకున్నాను. నా ఫుడ్, వర్కవుట్ మీద మరింత శ్రద్ధ పెట్టాను. ఇక ఆలస్యం చేయకుండా నా కలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నించాలని అనిపించింది. అదే సమయంలో ఈ పోటీ గురించి తెలిసి దరఖాస్తు చేశాను. తడబడ్డా.. నిలబడ్డా.. నేనీ పోటీలో పాల్గొంటున్నానని తెలిసి స్నేహితులు, బంధువులు ప్రోత్సహించారు. పోటీ కోసం ప్రత్యేకంగా డైట్ ప్లాన్ చేసుకున్నాను. పోటీ విభిన్న రౌండ్లలో ఉంటుందని, అవుట్‌ఫిట్స్ కోసం చాలా షాపింగ్ చేశాను. అయితే ఎంత సిద్ధమైనా పోటీదారులను చూసినప్పుడు కాసింత ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. వాళ్లు నా కన్నా ఎన్నో రకాలుగా ముందంజలో ఉన్నారనిపించింది. పోటీ రెండో రోజు కొంత నెర్వస్‌గా ఫీలయ్యాను. అయితే చాలా త్వరగా ఆ పరిస్థితి నుంచి బయటకుపడ్డాను. నాకు చేతనైనంత సత్తా చాటాలనుకున్నాను. కచ్చితంగా టాప్ త్రీలో ఉండాలని నిర్ణయించుకున్నాను. అనుకున్నది సాధించాను. ఇదో గొప్ప ప్రయాణం. దీని నుంచి నేనెన్నో నేర్చుకున్నాను. కల సాకారం.. అదే సందేశం నేను ఒక పోటీలో పాల్గొనాలని చాలా రోజులు ఆశించాను. పరిస్థితులు అనుకూలించక పోయినా.. ఆశను చంపేసుకోలేదు. మరోవైపు సమాజం కూడా మధ్య వయసు మహిళల కలలను ఇప్పుడు అర్థం చేసకుంటోందని భావిస్తున్నాను. ఇలాంటి పోటీలపై ఏమైనా వ్యతిరేక భావాలుంటే అవి తొలగించుకోవాలి. పాల్గొనే వరకూ అవి నిజంగా ఎలా ఉంటాయనేది అర్థం కాదు. మహిళ కోరుకున్నది చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఏ సమయంలోనైనా బయట తిరిగే స్వేచ్ఛ కావాలి. సమాజంలో పేరుకుపోయిన కొన్ని భావజాలాలు తొలగించడానికి నా వంతు ప్రయత్నం చేయాలని ఉంది. -
వ్యాయామంతో జ్ఞాపకశక్తి మెరుగు
లండన్ : వయసు పెరిగే కొద్దీ మతిమరుపు పెరగడం సహజం. అయితే వ్యాయామంతో మెరుగైన జ్ఞాపకశక్తిని సొంతం చేసుకోవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. ఫిట్నెస్ కొరవడటమే మతిమరుపుకు కారణమని పరిశోధకులు గుర్తించారు. ఆరోగ్యకరంగా ధృడంగా ఉన్న వృద్ధుల్లో మతిమరుపు ఛాయలే కనిపించలేదని పరిశోధకులు తేల్చారు. దశాబ్ధాల కిందటి విషయాలను సైతం వారు అలవోకగా చెప్పారని అథ్యయనంలో గుర్తించామని తెలిపారు. శారీరక ఫిట్నెస్ మెరుగైతే మానసిక ఆరోగ్యం కూడా చక్కడా ఉంటుందని అథ్యయనంలో గుర్తించారు. సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన శారీరక ఆరోగ్యానికి ఫిట్నెస్ ప్రాధాన్యత, ఏరోబిక్ ఫిట్‌నెస్‌కు గుండె ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని పరిశీలించారు. వృద్ధుల శారీరక పటుత్వం ఎంత అధికంగా ఉంటే వారిలో జ్ఞాపకశక్తి అంత మోతాదులో ఉన్నట్టు తమ పరిశోధనలో వెల్లడైందని అథ్యయన రచయిత, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ స్కూల్ ఆఫ్ సైకాలజీకి చెందిన రచయిత డాక్టర్ కట్రిన సెగార్ట్ చెప్పారు. -
జుంబారే జుంజుంబరే!
ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది. వేలాది మంది మూకుమ్మడిగా రోడ్లపైకొచ్చి యోగా, ఎరోబిక్స్ అభ్యసిస్తున్నట్లు ఉంది కదా? నిజమే. వీరంతా ఫిలిప్పీన్స్ దేశంలో తెగ పాపులర్ అయిన ‘జుంబా’ డ్యాన్స్ ఫిటినెస్ కార్యక్రమాన్ని సాధన చేస్తున్నారు. పనిలో పనిగా కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించాలని కదం తొక్కారు. ఒకే వేదికపై 12,975 మంది జుంబా ప్రాక్టీస్ చేసి కొత్త రికార్డును తమ పేరిట నమోదు చేసుకున్నారు. ఫిలిప్పీన్స్‌లోని మాండలుయాంగ్ నగరంలో ఆదివారం తీసిందీ ఫొటో. -
అత్యుత్తమం యోగా! కసరత్తులూ మంచివేగా!!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ‘యోగా’ వీడియో విడుదల చేసింది. ఇక టాలీవుడ్ సెలబ్రిటీ అమల అక్కినేని యోగా శిక్షకురాలు. అలాగే ‘విక్రమ్ యోగా’ అని, ‘క్రియ యోగా’ అనీ... విభిన్న రకాల ప్రక్రియల్ని మిగిలిన సెలబ్రిటీలు వరుసగా మోసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు యోగా అంటే ఒక ఫ్యాషన్. ఒక ఓషన్. మన సంప్రదాయం అందించిన, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న వ్యాయామ సాధనంగా యోగా ప్రస్తుతం జేజేలు అందుకుంటోంది. దీనికి మరోవైపు సిక్స్‌ప్యాక్ లు, స్లిమ్ ట్రిమ్ ఫిజిక్లూ వాటి కోసం అందుబాటులోకి వస్తున్న వ్యాయామాలు కూడా హల్చల్ చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో అందాలు, షేప్లూ అని ఆరాటపడకుండా కేవలం ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలనుకునేవారికి కొన్ని సంశయాలు ఏర్పడుతున్నాయి. మనదైన సంప్రదాయ యోగా మంచిదా? ఆధునిక ప్రపంచం అందిస్తున్న వెరైటీ వర్కవుట్స్ మేలా? అనేది అందులో ఒక ప్రధాన సందేహం. ఈ నేపథ్యంలో విభిన్న రకాల వ్యాయామాలకు, యోగాకు ఉన్న వ్యత్యాసాలను నిపుణులు ఇలా వివరిస్తున్నారు... నిశ్చలం... దీర్ఘకాలం... దీర్ఘకాల ఆరోగ్యలాభాలను అందించే విధంగా యోగాసనాలు రూపొందాయి. దీనిని సాధన చేసే ప్రక్రియలో వ్యక్తి కదలికలు నిదానంగా, నిశ్చలంగా ఉంటాయి. ఆసనాలు కేవలం బాహ్యంగా కనిపించే శరరీభాగాలకు మాత్రమే కాక, అంతర్గత సామర్థ్యం పెంపు, మానసిక ఉల్లాసాన్ని అందించేందుకు సైతం ఉపకరిస్తాయి. దేహాన్ని ఫ్లెక్సిబుల్‌గా, సరళంగా మారుస్తాయి. సాధన సందర్భంగా ఎటువంటి ప్రత్యేక పరికరాలు అక్కర్లేదు. లోలోపలి అవయవాలకి వ్యాయామాన్నిస్తాయి. కీలక అవయవాలన్నింటికీ మసాజ్ చేస్తాయి. ఆహారపరంగా మార్పుచేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఎక్కువ. నిర్ణీత వేళలు పాటించడం, ఆసనానంతరం మరో ఆసనం ద్వారా రిలాక్స్ కావడం... ఇలాంటి కొన్ని నియమ నిబంధనలకు తప్పనిసరిగా లోబడి సాధన చేయాల్సి ఉంటుంది. మానసిక పటుత్వాన్ని కూడా మెరుగుపరిచే శక్తి ఉన్న యోగా కారణంగా... శరీరం ఆరోగ్యవంతంగా, మనసు దృఢంగా మారుతుంది. ఉచ్ఛ్వాసనిశ్వాసలను తీసుకునే స్థాయిని మెరుగు పరుస్తుంది యోగా. అందం...అపు‘రూపం’... ఏరోబిక్స్ (స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్, డ్యాన్స్... వగైరా), స్ట్రెంగ్త్ట్రైనింగ్ (బరువులెత్తుతూ చేసే వ్యాయామం), బాడీ వెయిట్ వర్కవుట్స్ (పుషప్స్, సిటప్స్... వంటివి)... పలు వ్యాయామాలలో వ్యక్తి కదలికలు చాలా స్పీడుగా, జర్కులతో ఉంటాయి. ఇవన్నీ దేహాన్ని, కండర సముదాయాన్ని ఆద్యంతం మార్చే లక్ష్యంతో రూపొందాయి. వీటిని మితిమీరి చేస్తే... దేహంతో పాటు మైండ్‌కి కూడా అలసట కలుగుతుంది. దేహంలో స్పష్టంగా కనపడే కండరాలకు వ్యాయామాన్ని అందిస్తాయి. అంతర్గత అవయవాలపై చూపే ప్రభావం తక్కువ. ఈ వ్యాయామాలు దేహాన్ని కఠినంగా, దృఢంగా చేస్తాయి. వీటి సాధనకు ఎక్విప్మెంట్ అవసరం ఎక్కువ. అలాగే ఫలితాల విషయంలో వ్యక్తివ్యక్తికీ మారుతుంటాయి. అలాగే వీటి ఫలితాలు చాలావరకూ స్వల్పకాలికమే అయి ఉంటాయి. ఫిజిక్‌ను అందంగా, అవసరమైన విధంగా మలచుకోవడానికి ఉపకరిస్తాయి. - ఎస్.సత్యబాబు మేళవింపే ‘మేలు’...::: ఆధునిక వ్యాయామాలు చేయడానికి కొన్ని పరిమితులున్నప్పటికీ, యోగాను మాత్రం వయసుకు అతీతంగా అందరూ సాధన చేయవచ్చు. అయితే మరీ పెద్దవారు కాకపోతే, తమ ఆరోగ్యస్థాయులను బట్టి విభిన్నరకాల వ్యాయామాలను మేళవించడమే మేలని ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే శారీరక మానసిక స్థితిగతులను బట్టి వీటిని వ్యాయామ శైలులను ఎంచుకోవాలని చెబుతున్నారు.