అత్యుత్తమం యోగా! కసరత్తులూ మంచివేగా!!
అత్యుత్తమం యోగా! కసరత్తులూ మంచివేగా!!
Published Fri, Aug 9 2013 10:42 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ‘యోగా’ వీడియో విడుదల చేసింది. ఇక టాలీవుడ్ సెలబ్రిటీ అమల అక్కినేని యోగా శిక్షకురాలు. అలాగే ‘విక్రమ్ యోగా’ అని, ‘క్రియ యోగా’ అనీ... విభిన్న రకాల ప్రక్రియల్ని మిగిలిన సెలబ్రిటీలు వరుసగా మోసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు యోగా అంటే ఒక ఫ్యాషన్. ఒక ఓషన్. మన సంప్రదాయం అందించిన, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న వ్యాయామ సాధనంగా యోగా ప్రస్తుతం జేజేలు అందుకుంటోంది. దీనికి మరోవైపు సిక్స్‌ప్యాక్ లు, స్లిమ్ ట్రిమ్ ఫిజిక్‌లూ వాటి కోసం అందుబాటులోకి వస్తున్న వ్యాయామాలు కూడా హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ పరిస్థితిలో అందాలు, షేప్‌లూ అని ఆరాటపడకుండా కేవలం ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలనుకునేవారికి కొన్ని సంశయాలు ఏర్పడుతున్నాయి. మనదైన సంప్రదాయ యోగా మంచిదా? ఆధునిక ప్రపంచం అందిస్తున్న వెరైటీ వర్కవుట్స్ మేలా? అనేది అందులో ఒక ప్రధాన సందేహం. ఈ నేపథ్యంలో విభిన్న రకాల వ్యాయామాలకు, యోగాకు ఉన్న వ్యత్యాసాలను నిపుణులు ఇలా వివరిస్తున్నారు...
నిశ్చలం... దీర్ఘకాలం...
దీర్ఘకాల ఆరోగ్యలాభాలను అందించే విధంగా యోగాసనాలు రూపొందాయి. దీనిని సాధన చేసే ప్రక్రియలో వ్యక్తి కదలికలు నిదానంగా, నిశ్చలంగా ఉంటాయి. ఆసనాలు కేవలం బాహ్యంగా కనిపించే శరరీభాగాలకు మాత్రమే కాక, అంతర్గత సామర్థ్యం పెంపు, మానసిక ఉల్లాసాన్ని అందించేందుకు సైతం ఉపకరిస్తాయి. దేహాన్ని ఫ్లెక్సిబుల్‌గా, సరళంగా మారుస్తాయి. సాధన సందర్భంగా ఎటువంటి ప్రత్యేక పరికరాలు అక్కర్లేదు. లోలోపలి అవయవాలకి వ్యాయామాన్నిస్తాయి. కీలక అవయవాలన్నింటికీ మసాజ్ చేస్తాయి. ఆహారపరంగా మార్పుచేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఎక్కువ. నిర్ణీత వేళలు పాటించడం, ఆసనానంతరం మరో ఆసనం ద్వారా రిలాక్స్ కావడం... ఇలాంటి కొన్ని నియమ నిబంధనలకు తప్పనిసరిగా లోబడి సాధన చేయాల్సి ఉంటుంది. మానసిక పటుత్వాన్ని కూడా మెరుగుపరిచే శక్తి ఉన్న యోగా కారణంగా... శరీరం ఆరోగ్యవంతంగా, మనసు దృఢంగా మారుతుంది. ఉచ్ఛ్వాసనిశ్వాసలను తీసుకునే స్థాయిని మెరుగు పరుస్తుంది యోగా.
అందం...అపు‘రూపం’...
ఏరోబిక్స్ (స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్, డ్యాన్స్... వగైరా), స్ట్రెంగ్త్‌ట్రైనింగ్ (బరువులెత్తుతూ చేసే వ్యాయామం), బాడీ వెయిట్ వర్కవుట్స్ (పుషప్స్, సిటప్స్... వంటివి)... పలు వ్యాయామాలలో వ్యక్తి కదలికలు చాలా స్పీడుగా, జర్కులతో ఉంటాయి. ఇవన్నీ దేహాన్ని, కండర సముదాయాన్ని ఆద్యంతం మార్చే లక్ష్యంతో రూపొందాయి. వీటిని మితిమీరి చేస్తే... దేహంతో పాటు మైండ్‌కి కూడా అలసట కలుగుతుంది.
దేహంలో స్పష్టంగా కనపడే కండరాలకు వ్యాయామాన్ని అందిస్తాయి. అంతర్గత అవయవాలపై చూపే ప్రభావం తక్కువ. ఈ వ్యాయామాలు దేహాన్ని కఠినంగా, దృఢంగా చేస్తాయి. వీటి సాధనకు ఎక్విప్‌మెంట్ అవసరం ఎక్కువ. అలాగే ఫలితాల విషయంలో వ్యక్తివ్యక్తికీ మారుతుంటాయి. అలాగే వీటి ఫలితాలు చాలావరకూ స్వల్పకాలికమే అయి ఉంటాయి. ఫిజిక్‌ను అందంగా, అవసరమైన విధంగా మలచుకోవడానికి ఉపకరిస్తాయి.
- ఎస్.సత్యబాబు
మేళవింపే ‘మేలు’...:::
ఆధునిక వ్యాయామాలు చేయడానికి కొన్ని పరిమితులున్నప్పటికీ, యోగాను మాత్రం వయసుకు అతీతంగా అందరూ సాధన చేయవచ్చు. అయితే మరీ పెద్దవారు కాకపోతే, తమ ఆరోగ్యస్థాయులను బట్టి విభిన్నరకాల వ్యాయామాలను మేళవించడమే మేలని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే శారీరక మానసిక స్థితిగతులను బట్టి వీటిని వ్యాయామ శైలులను ఎంచుకోవాలని చెబుతున్నారు.
Advertisement
Advertisement