జుంబా నృత్యంతో వ్యాయామం చేస్తున్న మహిళలు
సాక్షి, భద్రాచలం(ఖమ్మం): గతంలో మెట్రో నగరాలకే పరిమితమైన ఫిట్‌నెట్ సంగీతాలు నేడు ఏజెన్సీ ప్రాంతంలోనూ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం యువత ఆరోగ్యంతో పాటు అందానికి ప్రాముఖ్యత ఇస్తూ, ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలోనూ ఏరోబిక్స్, జుంబా నృత్యాలు కనిపించడం విశేషం. ఆధునికతను జోడించుకుని బరువు తగ్గించుకునే ఈ పద్ధతికి మహిళల నుంచి కూడా ఆదరణ లభిస్తోంది.
అందం, ఆరోగ్యాల కలబోత నయా ఫిట్‌నెస్ మంత్ర..
నేడు మారిన ఆహార పద్ధతులతో ఊబకాయం ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించుకోవడానికి పురుషులు, మహిళలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో శాస్త్రీయంగా బరువును తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం జిమ్‌లు, ఏరోబిక్స్, జూంబా వంటివి కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే వీటిలో ఏరోబిక్స్, జుంబాలకు ప్రత్యేక శిక్షణ కలిగిన నిపుణులు అవసరమం.
అలాంటి ఏరోబిక్స్, జుంబాల ఫిట్‌నెస్ సెంటర్లు సైతం ఏజెన్సీలోని భద్రాచలం, కొత్తగూడెం వంటి పట్టణాల్లో కనిపిస్తున్నాయి. ఉద్యోగులు, వైద్యులు, గృహిణులు ఖాళీ సమయాల్లో సంతోషంగా, ఆహ్లాదకరమైన సంగీతం వింటూ ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకునేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు.
సులువుగా ఏరోబిక్స్, జుంబా..
బరువు తగ్గించేందుకు ఏరోబిక్స్, జుంబాల శిక్షణను విడివిడిగా నిర్వహిస్తారు. అయితే ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా రెండింటినీ కలబోసి ఫిట్‌నెస్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఏరోబిక్స్‌లో ప్లోర్, స్టెప్ వర్కౌట్‌లు, స్టెప్ ఏరోబిక్స్, బాల్ ఏరోబిక్స్, రోపింగ్‌లతో సాధన చేయిస్తారు. ఇక జుంబాలో ఆహ్లాదకరమైన సంగీతంతో సులువైన ఆసనాలతో కూడిన నృత్యాలు, ఎక్సర్‌సైజ్ స్టెప్పులతో ఉంటుంది. రోజుకు ఒక గంటలో చేసే వీటి ద్వారా సుమారు 500 నుంచి 800 వరకు కేలరీస్ ఖర్చవుతాయని శిక్షకులు చెబుతున్నారు. మూడు నెలల్లో 5 నుంచి 8 కేజీల బరువు తగ్గుతారని అంటున్నారు.
ఈ సెంటర్లతో చాలా ఉపయోగం
గతంలో ఉద్యోగ రీత్యా మెట్రో సిటీలలో ఉండేవాళ్లం. అక్కడ కనిపించే ఫిట్‌నెస్ సెంటర్లు భద్రాచలంలో కూడా ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యాను. ప్రతిరోజూ ఫిట్‌నెస్ సెంటర్‌కు వస్తున్నాను. చార్జీలు సైతం సిటీలో కంటే చాలా తక్కువగా ఉన్నాయి.
– శిల్ప, గృహిణి
పది కేజీల బరువు తగ్గాను
ఎటువంటి ప్రయాసలు, శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుండా అధిక బరువును తగ్గించుకోవటానికి ఇది చాలా సులువైన మార్గం. ఉల్లాసంగా.. ఉత్సాహంగా..ఏరోబిక్స్, జుంబాలో వర్కవుట్ చేస్తూ మూడు నెలల్లో పది కేజీల బరువు తగ్గాను.
– రీనా, గృహిణి
వ్యయ, ప్రయాసలతో ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేశాం
ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో ఏరోబిక్స్, జుంబాలను పరిచయం చేయాలనే సంకల్పంతోనే ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి దీన్ని ఏర్పాటు చేశాం. స్పందన అద్భుతంగా వస్తోంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మహిళలైనా, పురుషులైనా బరువు తగ్గించుకోవడానికి ఇది సులువైన మార్గం.
– నాగరాజు, ప్రియాంక, క్రేజీ మాస్టర్ డ్యాన్స్ అండ్ ఫిట్‌నెస్ స్టూడియో నిర్వాహకులు, భద్రాచలం
Comments
Please login to add a commentAdd a comment