'ర్యాగింగ్‌ చేస్తే ఇంటికే’ | JNTU Campaign on No Ragging | Sakshi
Sakshi News home page

ఏడిపించొద్దు... భవిష్యత్తు పాడుచేసుకోవద్దు!

Published Wed, Aug 7 2019 1:13 PM | Last Updated on Sat, Aug 10 2019 9:43 AM

JNTU Campaign on No Ragging - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘ర్యాగింగ్‌ చేస్తే ఇక ఇంటికే’ అనే నినాదంతో జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ప్రచారం చేస్తోంది. ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో ‘యాంటీ ర్యాగింగ్‌’ కార్యాచరణ చేపట్టింది. ప్రత్యేక కమిటీల నియామకం, నూతన విద్యార్థులకు ప్రత్యేక వసతులు కల్పించడం, యాంటీ ర్యాగింగ్‌పై విస్తృతంగా ప్రచారం నిర్వహించడం తదితర చేపడుతోంది. జేఎన్‌టీయూహెచ్‌కు అనుబంధంగా రాష్ట్రంలో 423 కళాశాలలు ఉండగా... వాటిలో 3.50 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ప్రతిఏటా కొత్తగా వీటిలో చేరుతున్న విద్యార్థులు ర్యాగింగ్‌ విషయంలో ఆందోళన చెందుతున్నారు. దీంతో జేఎన్‌టీయూహెచ్‌ ప్రత్యేకంగా ప్రచారం చేస్తోంది. ర్యాగింగ్‌ నివారణకు ప్రభుత్వం కఠిన చట్టాలనూ అమల్లోకి తెచ్చింది. 

యాజమాన్యందే బాధ్యత  
ఎవరైనా విద్యార్థి ర్యాగింగ్‌ బారినపడినప్పుడు అవసరమైన సహాయం కోసం ఎవరిని సంప్రదించాలనే వివరాలను ఆయా కళాశాలల యాజమాన్యాలు కరపత్రాలు, బ్యానర్‌ల రూపంలో క్యాంపస్‌లో ఏర్పాటు చేయాలి. అడ్మిషన్‌ సమయంలో వాట్సాప్‌ ద్వారా విద్యార్థులకూ పంపించాలి. కళాశాల చైర్మన్, ప్రిన్సిపాల్, వైస్‌ ప్రిన్సిపాల్, వార్డెన్, హెచ్‌ఓడీలు, స్థానిక ఇన్‌స్పెక్టర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ల ఫోన్‌ నంబర్‌లను విద్యార్ధులకు అందుబాటులో ఉంచాలి. అధ్యాపకులు తరచూ నూతన విద్యార్థులతో మాట్లాడుతూ వారిలో భయాందోళనను తొలగించాలి. కళాశాలల్లో ర్యాగింగ్‌ జరిగినట్లయితే సంబంధిత యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ర్యాగింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు హాస్టల్‌ లొకేషన్‌ కమిటీ, క్యాంటీన్‌ కమిటీ, డిపార్ట్‌మెంట్‌ కమిటీ, స్పోర్ట్స్‌ ఏరియా కమిటీలను ఏర్పాటు చేయాలి.  

శిక్షలివీ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ర్యాగింగ్‌ వ్యతిరేక చట్టం–1997లో యాంటీ ర్యాగింగ్‌కు సంబంధించి యాక్ట్‌ 26ను తీసుకొచ్చింది. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను నిషేధిస్తూ 2002లో ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 2009లో మరిన్ని శిక్షలను పెంచింది.  
ర్యాగింగ్‌ చేసినా, సహకరించినా, ఇతరులను రెచ్చగొట్టినా చట్టరీత్యా నేరం. ర్యాగింగ్‌ చేసి అవమానించినా, బాధించినా 6 నెలల వరకు జైలు శిక్ష, రూ.1000 జరిమానా.   
ర్యాగింగ్‌లో భాగంగా విద్యార్థులపై దాడి చేస్తే ఏడాది జైలు శిక్ష, రూ.2వేల జరిమానా.  
అక్రమంగా నిర్భందించడం, గాయపరచడం చేస్తే రెండేళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా.  
విద్యార్థులను బలవంతంగా ఎత్తుకెళ్లడం, గాయపర్చడం, లైంగిక దాడికి పాల్పడడం చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల
జరిమానా.   
ర్యాగింగ్‌ సందర్భంలో విద్యార్ధి మరణించిన, బాధిత విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినా నిందితుడికి పదేళ్ల జీవిత ఖైదు, రూ.50 వేల జరిమానా.

భయం పోగొట్టాలి   
కళాశాల, హాస్టల్‌ వాతావరణంలోకి రావడంతో విద్యార్థుల్లో భయం అనేది ఉంటుంది. ప్రతి చిన్న దానికీ భయపడడం, చదువు అర్థం కాకపోవడం, పరీక్షలు తదితర విషయాల వల్ల విద్యార్థులు ఆందోళన పడుతుంటారు. వారిలో నెలకొన్న భయాన్ని తొలగించి, కళాశాల వాతావరణం అలవాటు చేయాలి. అందుకే మొదటి మూడు వారాలు సిలబస్‌ ప్రారంభించకుండా... ఓరియంటేషన్‌ తరగతులు నిర్వహిస్తున్నాం. కళాశాలల్లో ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే భయపడకుండా వెంటనే ప్రిన్సిపాల్‌/అధ్యాపకులకు సమాచారం అందించాలి.– సాయిబాబారెడ్డి, జేఎన్‌టీయూహెచ్‌ ప్రిన్సిపాల్‌   

భవిష్యత్‌ అంధకారమే...  
విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే కళాశాల నుంచి సస్పెండ్‌ చేస్తారు. జైలు శిక్ష ఆరు నెలలకు మించి పడితే ఏ విద్యాసంస్థలోనూ ప్రవేశం ఉండదు. విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్టు కూడా రాదు. కళాశాలలు అందించే ఉపకార వేతనాన్ని కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుడు. దీంతో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థి భవిష్యత్‌ అవకాశాలను పూర్తిగా కోల్పోతాడు. విద్యార్థి ర్యాగింగ్‌కు పాల్పడినట్లు విచారణలో తేలితే కళాశాల యాజమాన్యం సదరు విద్యార్థిని ఎన్ని రోజులైనా సస్పెండ్‌ చేయొచ్చు. ఒకవేళ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకుడు, చైర్మన్‌లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement