ప్రతిపాదిత స్థలం మ్యాప్‌ను పరిశీలిస్తున్న బృందం
సాక్షి, సిరిసిల్ల: జిల్లాలో జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య టి.పాపిరెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణ శివారులోని పెద్దూరు, సర్దాపూర్, వెంకటాపూర్ శివారుల్లో 88 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బృందం బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అనంతరం సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాపిరెడ్డి మాట్లాడారు. కళాశాల స్థాపనకు అన్ని విధాలా అనుకూలమైన పరిస్థితులున్నాయని వివరించారు.
పట్టణానికి అతి సమీపంలో స్థలం ఎంపిక చేయడం బాగుందని, సిరిసిల్లలో ఏర్పాటు చేయడం వల్ల సిద్ధిపేట, కామారెడ్డి, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో విద్యార్థులకు అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. రెండేళ్లలో సిరిసిల్లకు రైల్వే లైన్ రానున్న నేపథ్యంలో రవాణా పరంగా ఇబ్బందులుండవని పేర్కొన్నారు. ఏర్పాటుకు సానుకూల నివేదిక అందిస్తామని స్పష్టం చేశారు. సిరిసిల్లలో సాధ్యమైనంత త్వరలో మోడల్ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా మాట్లాడుతూ ఎమ్మెల్యే తారకరామారావు ప్రత్యేక చొరవతో జేఎన్‌టీయూ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కమిటీ సభ్యులు, రాష్ట్ర విద్య మండలి వైస్‌చైర్మన్ ఆచార్య వి.వెంకటరమణ, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఈ. సాయిబాబారెడ్డి, ఓయూ ఇంజినీరింగ్ కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ ఆచార్య ఎ.కృష్ణయ్య, డీఆర్‌వో ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీవో టి.శ్రీనివాస్‌రావు, జిల్లా సర్వేయర్ శ్రీనివాస్, తహసీల్దార్ అంజన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment