సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏటా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఇంజనీరింగ్ (బీఈ/బీటెక్)లో ఎక్కువగా ఉండగా, ఉద్యోగానికి కావాల్సిన ప్రతిభా వారిలోనే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 2019లోనూ ఇంజనీరింగ్ విద్యార్థులే ఎక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాల విషయంలో వారు వెనుకబడిపోయారు. 2019లో ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఎంబీఏ విద్యార్థుల్లో ఎక్కువగా ఉన్నట్లు ఇండియా స్కిల్ రిపోర్టు–2020లో వెల్లడైంది. 2019 జూలై నుంచి నవంబర్ వరకు నేషనల్ ఎంప్లాయిబిలిటీ టెస్టు సర్వేను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సహకారంతో ది వీ బాక్స్ నిర్వహించింది. ఇండియా స్కిల్ రిపోర్టు–2020 పేరుతో ఆ నివేదికను విడుదల చేసింది.
సంఖ్య పెరిగింది.. నైపుణ్యం తగ్గింది..
దేశంలోని 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3 లక్షల మంది విద్యార్థులను, వివిధ రంగాలకు చెందిన 150 కంపెనీలను కలసి చేసిన సర్వే నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. 2018లో ఉన్నత విద్యను చదివే విద్యార్థుల్లో బీఈ/బీటెక్ వారు 23 శాతం ఉన్నారు. మిగతా వారంతా ఇతర కోర్సుల్లో ఉన్నారు. 2019కి వచ్చే సరికి ఉన్నత విద్యను చదివే విద్యార్థుల్లో ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య 31 శాతానికి పెరిగింది. ఉద్యోగానికి కావాల్సి ప్రతిభ ఇంజనీరింగ్ చదివే వారిలో తక్కువ మందిలో ఉన్నట్లు తేలింది.
2018లో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 57.09% మందిలో ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నట్లు వెల్లడి కాగా, 2019లో మాత్రం ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్న విద్యార్థుల సంఖ్య 49 శాతానికి పడిపోయింది. ఇక 2018 సంవత్సరంలో ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో ఎంబీఏ విద్యార్థులు 13 శాతం ఉంటే, 2019లో వారి సంఖ్య 17 శాతానికి పెరిగింది. ఇక నైపుణ్యాల విషయానికి వస్తే 2018లో ఎంబీఏ ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్న వారి సంఖ్య 36.44%ఉండగా 2019లో ఎంబీఏ విద్యార్థుల్లో ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్న వారి సంఖ్య 54 శాతానికి పెరిగినట్లు తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment