
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో తరచుగా జంతువులు మృత్యువాత పడుతుండటంపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అటవీ అధికారుల నుంచి వివరణ కోరారు. ఈమేరకు ‘జూపై రోగాల దాడిì ’అనే శీర్షికతో ఈనెల 6న జంతువులు మరణిస్తున్న తీరును వివరిస్తూ ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. దీనిపై మంత్రి స్పందించారు. గురువారం సచివాలయంలో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
జంతువుల మృతిపై వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ మునీంద్ర, జూపార్క్ డైరెక్టర్ సిద్ధాంత్ కుక్రేటీల నుంచి వివరణ కోరారు. వార్ధక్యం, తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావడం వల్లనే అరుణ అనే సింహం, జమున అనే ఏనుగు, దీప అనే చిరుత మృతి చెందాయని అధికారులు మంత్రికి వివరించారు. జూపార్క్‌లో ఉన్న మిగతా జంతువుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. జంతువుల సంరక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మెరుగైన వైద్యాన్ని అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను హెచ్చరించారు.