ముస్లింల అభ్యున్నతికి కృషి
► అటవీ శాఖ మంత్రి జోగు రామన్న
► 3 వేల మందికి గిఫ్ట్ ప్యాకెట్లు అందజేత
ఆదిలాబాద్: రాష్ట్రంలో ముస్లింల అభ్యున్నతి కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ కృషి చేస్తోందని రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని 3 వేల మంది ముస్లిం మహిళలకు గిఫ్ట్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు కలిసి మెలిసి సోదరభావంతో జరుపుకోవాలని అన్నారు. గత పాలకుల హయాంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
మైనార్టీలకు షాదీముబారక్ కింద రూ.75 వేలు అందిస్తున్నామని తెలిపారు. మైనార్టీలకు గురుకులాలు ఏర్పాటు చేశామని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు పవేశపెడుతూ దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. జేసీ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, మైనార్టీ నాయకులు సిరాజ్‌ఖాద్రి, సాజిదొద్దీన్, యూనుస్‌అక్బానీ తదితరులు పాల్గొన్నారు.