సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌ఎం కార్యాలయాన్ని ముట్టడిస్తున్న ఆర్టీసీ కార్మికులు (ఫైల్)
సాక్షి, సంగారెడ్డి: కొన్నేళ్లుగా ఆర్టీసీ కార్మికులు డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి నిరసనగా ఆ సంస్థలో సమ్మె సైరన్ మోగింది. కార్మిక సంఘాలైన టీఎంయూ, ఎన్‌ఎంయూ, టీజేఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్లు కొంతకాలంగా డిమాండ్ల సాధన కోసం పోరాటాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 25 లోగా తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె చేయకతప్పదని ఆ యూనియన్లు తెగేసి చెప్పాయి.
రాష్ట్రంలోనే అతిపెద్ద స్వతంత్ర సంస్థయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాలు ఓవైపు కోరుతూనే.. ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలని ఎత్తుగడలు వేస్తోందని మరోవైపు ఆరోపిస్తున్నారు. నష్టాల సాకు చూపి సంస్థను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం పన్నాగం పన్నుతోందని పలు సంఘాలు అనుమానిస్తున్నాయి. దీంతో సమ్మె సైరన్ మోగించడమే తక్షణ కర్తవ్యంగా భావించిన ఆర్టీసీ సంఘాలు సమ్మెకు ఉపక్రమించే దిశగా పయనిస్తున్నాయి. బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం సంస్థను నిర్వీర్యం చేసేలా చర్యలు చేపడుతోందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో పలు సంఘాలు ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులను అందజేశాయి. ఈ నెలాఖరులో సమ్మెకు దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని యూనియన్లు పరోక్ష సంకేతాలిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 8 డిపోలు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 8 బస్ డిపోలున్నాయి. సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, మెదక్, సిద్దిపేట్, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్‌లలో డిపోలున్నాయి. ఈ డిపోల పరిధిలో మొత్తం 672 బస్సులు నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. ఈ బస్సుల పరిధిలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రోజుకు 2.60లు ఉందని ఆర్టీసీ అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారుగా 3వేల మంది కార్మికులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.
డిమాండ్లు ఇవే..
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న కార్మికుల డిమాండ్లకు అనుగుణంగా ఆయా యూనియన్లు పరిష్కారానికి ప్రభుత్వంపై కొంత కాలంగా ఒత్తిడి తెస్తున్నాయి. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సమావేశమైన మంత్రివర్గం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించడంతో ఇక్కడ ప్రభుత్వంపై ఒత్తిడిని మరింత పెంచాలని యూనియన్లు నిర్ణయించాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధాన డిమాండ్‌గా కొంతకాలంగా యూనియన్లు పోరాటం చేస్తున్నాయి. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాయి. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. డబుల్ డ్యూటీకి రెట్టింపు వేతనం ఇవ్వాలని, ఆరోగ్య పరంగా ఫిట్‌గా లేని డ్రైవర్లకు ప్రత్యామ్నాయ విధులు కేటాయించాలని కోరుతున్నారు.
విధి నిర్వహణలో కార్మికుడు మృతిచెందితే కనీసం రూ.30 లక్షలకు తక్కువ కాకుండా చెల్లించాలన్నది మరో డిమాండ్. మహిళా ఉద్యోగులకు రెండేళ్ల చైల్డ్‌కేర్ సెలవులను అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సీలింగ్ లేకుండా గ్రాట్యుటీ చెల్లించాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ల సాధనకోసం కొంతకాలంగా డిపోల ఎదుట ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, రీజినల్ కార్యాలయాల ముట్టడి, తదితర కార్యక్రమాలు చేపట్టినప్పటికీ యాజమాన్యంలో సానుకూల దృక్పథం కనిపించలేదు. పోరాటం చేస్తున్నా పట్టించుకోకపోవడంతో కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. కార్మికులతో యాజమాన్యం చర్చలు సఫలం కాకపోతే ఈ నెల 25 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
ప్రత్యామ్నాయంపై దృష్టి:
ఆర్టీసీ యాజమాన్యానికి పలు కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇవ్వడంతో విరమణకు ప్రభుత్వం ఒకవైపు ప్రయత్నిస్తూనే.. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఆర్టీసీపై ప్రభుత్వానికి సానుకూల దృక్పథం లేదని కొంతకాలంగా తీసుకుంటున్న చర్యలను బట్టి తెలుస్తోందంటున్నారు. ఒక వేళ సమ్మె విరమణకు కార్మిక సంఘాలు అంగీకరించకపోతే పరిస్థితి ఏమిటన్న విషయంలో యాజమాన్యం సంబంధిత ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. రీజియన్ల వారీగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమిటనే దానిపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తప్పని పరిస్థితుల్లో కార్మికులు సమ్మెకు ఉపక్రమిస్తే ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై దృష్టి సారించాలని సంబంధిత జిల్లాల ఉన్నతాధికారులకు యాజమాన్యం నుంచి ఆదేశాలు జారీ అయినట్లు యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు. ఒకవైపు తమను సమ్మె విరమించుకోవాలని చెబుతూనే..ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తాము సమ్మె చేయాలనే ఉద్దేశమే ప్రభుత్వానికి ఉన్నట్లుందని వారు ఆరోపిస్తున్నారు.
25 తర్వాత ఏ క్షణమైనా సమ్మె చేస్తాం
కొంతకాలంగా మా డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ఆశించిన స్పందన కనిపించడం లేదు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు, బిల్లులు చెల్లించాలి. కొత్త బస్సులను కొనుగోలు చేయాలి. కార్మికులకు పనిభారం తగ్గించాలి. సంస్థను ప్రభుత్వంపరం చేయాలి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే డిమాండ్ల సాధనకోసం పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే టీఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చాం. ప్రభుత్వం ఇప్పటికైనా మా సమస్యలను పరిష్కరించాలి. లేకుంటే ఈ నెల 25 తర్వాత ఏ క్షణమైనా సమ్మెకు దిగుతాం.
- కృష్ణారెడ్డి, సంగారెడ్డి డిపో టీఎంయూ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment