నోటికి నల్లటి వస్త్రాలు కట్టుకుని పట్టణంలో ర్యాలీని నిర్వహిస్తున్న కార్మికులు
సాక్షి, మెదక్: రాష్ట్రంలోని అన్నివర్గాల మద్దతును కూడకట్టుకుని రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించి నియంత ప్రభుత్వానికి బుద్ధి చెప్పే వరకు విశ్రమించేదిలేదని సీఎం ఇచ్చిన 24 గంటల వ్యవదిగడిచిపోయిందని ఆయన బెదిరింపులకు భయపడేదిలేదని ఆర్టీసీ టీఎంయూ రాష్ట్రకార్యదర్శి ఎంఆర్‌కె రావు పేర్కొన్నారు. ఆదివారం వందలాది మంది ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలను నోటికి కట్టుకుని పట్టణంలో ర్యాలినిర్వహించి పలుడిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అంబేడ్కర్ విగ్రహానికి ఇచ్చారు. అనంతరం పట్టణంలోని గుల్షన్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. న్యాయపరమైన కోరికలను తీర్చాలని 5 మాసాలముందే ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చామన్నారు. సమస్యలను పరిష్కరించక పోవటంతోనే సమ్మెబాట పట్టామన్నారు. సమస్య పరిష్కరించకుండా ప్రభుత్వం కార్మికులను బెదిరించటం ఎంతవరకు సమంజసమన్నారు. రాష్ట్రంలో 55 వేల మందికార్మికులు ఒక్కమాటపై నిలబడి సమ్మెలో కొనసగాడం కార్మికుల నైతిక విజయం అని అన్నారు.
చంద్రబాబుకు పట్టిన గతే పడుతుంది..
రాష్ట్రంలో రైతుల నుంచి మొదలుకుని అందర్ని మోసం చేసిన కేసీఆర్‌కు గతంలో చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని ఎంఆర్‌కే రావు అన్నారు. ఒక్క ఉద్యోగిని తొలగించనా రాష్ట్రం అగ్నిగుండం కావటం కాయమని ఎంఆర్‌కె రావు అన్నారు. ఆటోడ్రైవర్లను లారీడ్రైవర్లును తీసుకొచ్చి ఎలాంటి టికెట్లు లేకుండా బస్సులను నడపిస్తూ సీఎం దోపిడిదారితనానికి ఆజ్యం పోస్తున్న నియంత సీఎం కేసీఆర్ అని విమర్శించారు.
అనంతరం ఆర్టీసీ టీఎంయూ రీజనల్ సెక్రటరి, డిపోకార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, శాకయ్యలు మాట్లాడుతూ.. సీఎం ఇచ్చిన హామాలనే నెరవేర్చ కుండా మాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. టీచర్లను, రైతులను, నిరుద్యోగులను, ఆర్టీసీ కార్మికులను, ఉపాద్యాయులను, ఉద్యోగులను అందరిని మోసం చేసిన నియంత పాలనకు చరమగీతం పాడేందుకు అన్నివర్గాల ప్రజలం ఏకం కావల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమానికి సీఐటీయూతో పాటు పలు ఉపాద్యాయ సంఘాలు మద్దతును ఇచ్చాయి. ఈ కార్యక్రమంలో టీఎంయూ నాయకులు బోస్, నర్సింలుతో పాటు కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment