జర్నలిస్టులకు నో ఎంట్రీ | Journalists Protest At Secretariat For Not Allowed In | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులకు నో ఎంట్రీ

Published Sat, Oct 12 2019 2:35 AM | Last Updated on Sat, Oct 12 2019 2:35 AM

Journalists Protest At Secretariat For Not Allowed In - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర తాత్కాలిక సచివాలయం బూర్గుల రామకృష్ణారావు భవన్‌ (బీఆర్‌కేఆర్‌ భవన్‌)లో జర్నలిస్టుల ప్రవేశంపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలంటూ పాత్రికేయులు డిమాండు చేశారు. తాత్కాలిక సచివాలయంలోకి జర్నలిస్టులను అనుమతించక పోవడంపై శుక్రవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌ ప్రధాన ద్వారం ఎదుట వివిధ మీడియా సంస్థలకు చెందిన విలేకరులు మౌన ప్రదర్శన చేశారు. కొత్తగా నిర్మించే సచివాలయంలోకి భవిష్యత్తులో జర్నలిస్టుల ప్రవేశాన్ని నిరోధించాలనే ముందస్తు ఆలోచనతోనే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని వారు ఆరోపించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో జర్నలిస్టులు సమావేశమై.. సచివాలయంలోకి జర్నలిస్టుల ప్రవేశంపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు. స్వేచ్ఛగా వార్తలు సేకరించేందుకు అనుమతించాలని వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టులను అనుమతించ కూడదనే నిర్ణయం ప్రభుత్వ స్థాయిలో తీసుకున్నారని, సీఎం సీపీఆర్వో ద్వారా వార్తలను సేకరించాలని సీఎస్‌ సలహా ఇచ్చారు.

సీఎం సీపీఆర్వో కేవలం సీఎంవోకే పరిమితమని, సచివాలయంలో వార్తల సేకరణతో వారికెలాం టి సంబంధం లేదని జర్నలిస్టులు తెలిపారు. సమాచార, ప్రజా సంబంధాల కమిషనర్‌ను సంప్రదించాలని సీఎస్‌ సూచించడంపై జర్నలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ప్రవేశంపై ఆంక్షలు విధించడం.. పాత్రికేయ స్వేచ్ఛను అడ్డుకోవడమేనని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా పాలకులు ఈ తరహాలో వ్యవహరించలేదని జర్నలిస్టులు నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తాము ముందు వరుసలో ఉన్నామని, ఆ జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించడం సరికాదన్నారు. జర్నలిస్టుల ప్రవేశంపై ఆంక్షలు విధించిన అంశాన్ని కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement