
యాంకర్ రవిపై కేసు నమోదు
బంజారాహిల్స్(హైదరాబాద్): మహిళలను కించపరుస్తూ వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన యాంకర్ రవిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఓ సినిమా వేడుకలో నటుడు చలపతిరావు మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఆ షోకు యాంకర్‌గా వ్యవహరించిన రవి సూపర్ అంటూ సమర్థించాడన్నారు.
చలపతిరావుతో పాటు యాంకర్ రవిపై కేసు నమోదు చేయాలని ఈ నెల 23న మహిళా, ప్రజాసంఘాల ప్రతినిధులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చలపతిరావుపై అదే రోజు కేసు నమోదు చేయగా, న్యాయ సలహా అనంతరం యాంకర్ రవిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
చలపతిరావు, రవిపై ఇప్పటికే సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. బండ్లగూడకి చెందిన మహిళా సంఘం నేత దెయ్యాల కల్పనా కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 354 ఏ (IV), 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.