నల్లగొండ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల హత్యకేసుకు సంబంధించి శుక్రవారం కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును జడ్జి ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు. నల్లగొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో న్యాయమూర్తి విశ్వనాథరెడ్డి ముందు ప్రాసిక్యూషన్ తరఫున పీపీ కె.చంద్రశేఖర్ వాదించగా, నిందితుడి తరఫున న్యాయవాది ఠాగూర్ వాదనలు వినిపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ వద్ద ముగ్గురు బాలికలపై అత్యాచారం చేయడంతోపాటు హత్య చేసి బావిలో పాతిపెట్టిన ఘటనలో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దానిపై నల్లగొండలోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ సాగింది. సాక్ష్యాలన్నింటినీ న్యాయమూర్తి వి.విశ్వనాథరెడ్డి నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి చదివి వినిపించి అతడి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
అనంతరం కోర్టులో ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాది చంద్రశేఖర్ వాదిస్తూ, ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్య చేసింది శ్రీనివాస్‌రెడ్డే అని, అందుకు మెడికల్ రిపోర్టులు, సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉండడం సరైంది కాదని, ఉరి శిక్ష విధించాలని అన్నారు. నిందితుడి తరపున వాదించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో లీగల్ ఎయిడ్ సంస్థ నియమించిన న్యాయవాది ఠాగూర్ శుక్రవారం తన వాదన వినిపించారు. హత్యలకు శ్రీనివాస్‌రెడ్డికి సంబం«ధం లేదని, సాక్ష్యాలు సక్ర మంగా లేవన్నారు. ఈనెల 8న కూడా ఇరు పక్షాలు వాదనలు వినిపించాయి. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును 27వ తేదీకి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment