ఈ ఉద్యోగం కన్నా ప్రైవేట్‌ కొలువే మేలు | Junior Panchayat Secretary Employee Resignation In Khammam District | Sakshi
Sakshi News home page

ఈ ఉద్యోగం కన్నా ప్రైవేట్‌ కొలువే మేలు

Published Tue, Sep 3 2019 8:46 AM | Last Updated on Tue, Sep 3 2019 12:53 PM

Junior Panchayat Secretary Employee Resignation In Khammam District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఖమ్మం: ఎన్నో ఆశలతో ఉద్యోగ బాధ్యతలు తీసుకున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శు(జేపీఎస్‌)లు విధి నిర్వహణలో నెట్టుకు రాలేకపోతున్నారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటి..కొలువు కొట్టి భరించలేని ఒత్తిడి నడుమ విధులు నిర్వహించలేక, వచ్చే వేతనం చాలక అవస్థలు పడుతున్నారు. ఆఖరుకు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్న దయనీయ పరిస్థితి జిల్లాలో నెలకొంది. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల కోసం ఎంతగానో ఎదురు చూసిన వీరు, ఆ పోస్టులో చేరిన కొద్ది రోజుల్లోనే తమకు ఈ జాబ్‌ సరిపడదని కొందర, ఇతర ఉద్యోగాలు రావడంతో మరికొందరు గుడ్‌బై చెబుతున్నారు. ఇలా..ఆరునెలల కాలంలోనే 20మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు తమ ఉద్యోగాలను వీడారు. 2018 అక్టోబర్‌లో ప్రభుత్వం జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీకి పరీక్ష నిర్వహించింది. ప్రతిభ కనబర్చిన వారికి 2019 ఏప్రిల్‌లో నియామక పత్రాలు అందించారు.

జిల్లాలో 584 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 422మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా కొలువు దీరారు. ఉద్యోగాలు రావడంతో ఆనందపడ్డారు. మొదట్లో ఉన్న సంతోషం మెల్లమెల్లగా సన్నగిల్లింది. ప్రతి నెలా రావాల్సిన వేతనాల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు పని ఒత్తిడి ఎక్కువ కావడం.. జీతాల్లో తీవ్ర జాప్యంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో 20మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు రాజీనామా చేసి వెళ్లిపోగా, ఒకరు మరణించగా, మరొకరు ఇప్పటి వరకు విధులకు హాజరుకావట్లేదు. ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం సైతం అందించలేదు.

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా విధుల్లో చేరిన వారికి కనీస ఉద్యోగ భద్రత లేదు. రూ.15వేల రూపాయల వేతనంతో మూడేళ్ల పాటు పని చేయాలని ఒప్పందం ఉండడంతో చాలా మంది ఉద్యోగాలకు మంగళం పాడుతున్నట్లు తెలుస్తోంది. వివిధ శాఖల్లో ఉద్యోగాలు రావడంతో కొందరు ఉద్యోగాలు మానివేయగా, మరికొందరు మాత్రం ఉద్యోగాలకు భద్రత లేకపోవడంతో పాటు కనీస వేతన స్కేలు అమలు చేయకపోవడం వల్లే విధుల నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.

లక్ష్యం చేరుకోలేక.. 
జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన వారు అధికారులు నిర్ణయించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార యంత్రాంగం హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణాలు, తదితర పనులు వేగవంతం చేసేందుకు లక్ష్యంగా నిర్ణయిస్తారు. ఇలాంటి వాటిని చేసేందుకు వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగంలో అనుభవం తక్కువగా ఉండటం, పనిభారం ఎక్కువగా ఉండడం,  అన్ని రకాల పనులు ఒకేసారి మీద పడడంతో ఉద్యోగాలను వదులుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు యువతలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు చర్యలు తీసుకుంటేనే రాజీనామాలు తగ్గే అవకాశం ఉంది.

వేతనాల జాప్యం..  
ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్నాం.. జీతం ఆలస్యం కాదనే ఉద్దేశంతో అనేక మంది విధులు స్వీకరించారు. అయితే ఉద్యోగాల్లో చేరిన తర్వాత మాత్రం పరిస్థితి మరోలా ఉంది. విపరీతమైన పని ఒత్తిడి ఉండడం, నెల ముగిసిన అనంతరం వేతనాలు రాకపోవడంతో ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా అలసిపోయారు. ఈ ఉద్యోగం కన్నా ప్రైవేట్‌ కొలువే మేలు అనే స్థితిలో అనేకమంది ఉద్యోగాన్ని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా ఎన్నికైన వారు నెలనెలా వేతనాలు వస్తాయని తొలుత ఆశించారు. కానీ ఆ స్థాయిలో వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. దీంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడిన సందర్భాలు సైతం ఉన్నాయి. కాగా సుమారు ఆరు నెలలకు సంబంధించిన వేతనాలు గత రెండు రోజుల క్రితం విడుదలయ్యాయి. తిరిగి మళ్ళీ విధుల్లో ఉంటే తమకు వేతనాలు ఎప్పుడు వస్తాయోననే ఆందోళనలో సైతం ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement