పరిశ్రమలు స్థాపించని భూములు వెనక్కి
సాక్షి, హైదరాబాద్: గతంలో అనుమతులు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేయని కంపెనీల నుంచి భూములు వెనక్కి తీసుకుంటామని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్ మార్గదర్శకాలు ఈ నెల 12న విడుదలవుతున్న నేపథ్యంలో ‘సాక్షి’తో మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో పరిశ్రమలకు అవసరాలకు మించి భూములు కేటాయించి, ఆ తర్వాత పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించలేదన్నారు. భూములు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేయని వారికి ఇప్పటికే నోటీసులు జారీచేసినట్లు వెల్లడించారు. ఆయన మాటల్లోనే...
♦ గతంలో పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ అతి పెద్ద సమస్యగా ఉండేది. రాష్ట్రంలో ప్రస్తుతం టీఎస్‌ఐఐసీ ద్వారా 1.65 లక్షల ఎకరాలను పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధం చేశాం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ధరకే భూములు పొందే అవకాశం ఉంది. విద్యుత్, నీటి సమస్యలు లేకపోవడం, భౌగోళికంగా, వాతావరణపరంగా తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనువైన వాతావరణం ఉంది.
♦ నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని జిల్లాల్లోనూ ‘స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు’ ఏర్పాటు చేస్తాం. సాంకేతిక విద్యలో నాణ్యత పెంచేలా విద్యా విధానం రూపకల్పన జరుగుతోంది. లైఫ్‌సెన్సైస్, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్లాస్టిక్, జెమ్స్ అండ్ జువెలరీ తదితర 14 రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నట్లు గుర్తించాం. ఆయా పరిశ్రమల ఏర్పాటుకు వసతుల కల్పనపై దృష్టి సారించాం.
♦ ఫార్మా, లైఫ్‌సెన్సైస్, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించినందున ఆయా పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. పెట్టుబడుల కోసం రాష్ట్రాల నడుమ పోటీ ఉన్నా పరిశ్రమల ఏర్పాటులో తెలంగాణ ముందుంటుంది.
♦ ప్రయోగాత్మకంగా గత జనవరి నుంచి ప్రారంభించిన టీఎస్‌ఐపాస్‌కు మంచి స్పందన లభిస్తోంది. రాష్ట్రస్థాయిలో 164 దరఖాస్తులు రాగా, రూ.6 వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. గత ఏడాది జూన్ 2 నుంచి ఇప్పటి వరకు జిల్లాల్లో 5 వేలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు అందాయి.
♦ ఈ నెల 12న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నూతన పారిశ్రామిక విధానం మార్గదర్శకాల విడుదల కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. టీఎస్‌ఐపాస్ దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానంగా మారబోతోంది.
అమెరికాలో సదస్సుకు జూపల్లి
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఈ నెల 15 నుంచి 18వరకు జరిగే ‘యుఎస్ బయో 2015’ సదస్సుకు మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, టీఎస్‌ఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ ఈవీ నర్సింహారెడ్డి ఆయనతో పాటు వెళ్లనున్నారు. ప్రభుత్వం చేపట్టిన బయో, పారిశ్రామిక విధానాలను ఈ సదస్సులో వివరించనున్నారు.