'తెలంగాణలో ఉన్నవారంతా ఈ రాష్ట్ర పౌరులే'
ఇబ్రహీంపట్నం: ప్రతిపక్షపార్టీగా ప్రజాసమస్యలపై పోరాడతామని తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సులో రెండో రోజు ఆయన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రుణమాఫీ, దళితులకు భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య, పేదలకు ఇళ్లు వంటి టీఆర్ఎస్ హామీలను అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కరువు, విద్యుత్ కోతలు వంటి సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు, పంటనష్టం జరుగుతున్నా టీఆర్ఎస్ సర్కారుకు చీమ కుట్టినట్టుగా కూడా లేదన్నారు.
తెలంగాణలో ఉన్నవారంతా ఈ రాష్ట్ర పౌరులేనని వారికి అన్ని హక్కులుంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం వివక్ష చూపితే వ్యతిరేకిస్తామని, బాధితులకు అండగా ఉంటామని హామీయిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్ఎస్ ప్రతీకార దాడులకు పాల్పడుతోందని, ఈ దాడులను ఎదుర్కొంటామని జానారెడ్డి అన్నారు.