దేవయ్యను బలి పశువును చేశారు.. | Kadiyam SriHari Caomments On Kodandaram In Warangal | Sakshi
Sakshi News home page

దేవయ్యను బలి పశువును చేశారు..

Published Wed, Dec 5 2018 9:24 AM | Last Updated on Wed, Dec 5 2018 9:24 AM

Kadiyam SriHari Caomments On Kodandaram In Warangal - Sakshi

మాట్లాడుతున్న కడియం శ్రీహరి 

సాక్షి, ఐనవోలు: కాంగ్రెస్‌ నాయకులు కోదండరాంను కోదండం ఎక్కిస్తే ఆ కోదండరాం మతి తప్పి నియోజకవర్గంలో పగిడిపాటి దేవయ్యను బలిపశువును చేశారని ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. అరూరి రమేష్‌ లక్ష పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచి స్టేట్‌ రికార్డుగా చరిత్ర సృష్టించబోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు. వర్ధన్నపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అరూరి రమేష్‌కు మద్దతుగా మంగళవారం మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా నుంచి ఎస్సీ కాలనీసెంటర్‌ వరకు టీఆర్‌ఎస్‌ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎంపీపీ రవీందర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా కడియం హాజరై మాట్లాడారు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ను రాజకీయంగా బొందపెట్టాలని, టీడీపీ నాయకుడు చంద్రబాబునాయుడు తెలంగాణ ద్రోహి అన్న కోదండరాం కూటమితో పొత్తును ఏవిధంగా సమర్ధిస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. రిటైర్‌ కాగానే కోదండరాం మైండ్‌ పని చేయకుండా పోయి కాంగ్రెస్‌ నాయకులతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారా అని ప్రశ్నించారు. ఐనవోలు మల్లన్న ప్రాముఖ్యత తెలువని దేవయ్యకు నియోజకవర్గ సమస్యలెలా తెలుస్తాయని టికెట్‌ ఇచ్చారో కోదండరామే చెప్పాలన్నారు.

టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు దేవయ్య చుట్టూ చేరి ఆర్థికంగా ఆయనను పీల్చి పిప్పి చేస్తున్నారన్నారు. దేవతలకు బలి ఇచ్చేముందు గొర్రెలను కూడా సింగారిస్తారన్న విషయాన్ని దేవయ్య ఎంత తొందరగా తెలుసుకుంటే ఆయనకు అంత మంచిది అన్నారు. విదేశాల నుంచి వచ్చిన దేవయ్య మరలా డిసెంబర్‌ 12న తిరిగి వెళ్లడం ఖాయమన్నారు. అరూరి రమేష్‌ కారు గుర్తుకు 80–90 శాతం ప్రజలు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తే మండలాన్ని మరో ఐదేళ్లు దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్నారు. గత నాయకుల పనితీరుతో తన పనితీరు పోల్చుకుని నచ్చితే ఓటేయాలని వర్ధన్నపేట టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేష్‌ తెలిపారు. ఈ సారి మరింత అధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజక వర్గాన్ని తన రాజకీయ గురువు, ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ద్వారా అధిక నిధులు సాధించి అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్‌రావు, మునిగాల సమ్మయ్య, మిద్దెపాక రవీందర్, శ్రీరామోజు అరుణ జయకర్, శ్రీరాములు, రామిండ్ల స్వప్న, బొళ్లపల్లి మధు, పల్లకొండ సురేష్, మజ్జిగ జైపాల్, బుర్ర రాజ్‌కుమార్, ఆడెపు దయాకర్, పెండ్లి కావ్య తిరుపతి, చందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement