భూపాలపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటు కాబోయే ఫెడరల్ ఫ్రంట్‌కు అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు లభిస్తోందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో నిర్మించిన 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవనాన్ని శాసన సభాపతి మధుసూదనాచారి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, లక్ష్మారెడ్డితో కలసి మంగళవారం ఆయన ప్రారంభించారు. కడియం మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పాలన దేశాన్ని భ్రష్టు పట్టించాయని మండిపడ్డారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయడం ఎందుకు సాధ్యం కాదని ఆయన ప్రశ్నించారు. 70 ఏళ్ల పాటు బీజేపీ, కాంగ్రెస్ అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాయన్నారు. ఇరుపార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి దేశ ప్రజలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ జెండా కింద దేశ నాయకత్వం పని చేయ బోతుందన్నారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. దేశ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషించబోతుందన్నారు.
త్వరలో పీహెచ్‌సీల నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు, ఏరియా ఆస్పత్రి నుంచి బోధనాస్పత్రుల వరకు తెలంగాణ డయాగ్నోసిస్ పేరుతో మెరుగైన రక్త పరీక్షల సేవలు అందిస్తామని వెల్లడించారు. వైద్యఆరోగ్యశాఖలో 10 వేల కొత్త పోస్టులు మంజూరు చేశామని, 2, 3 నెలల్లో వాటిని భర్తీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 2008లో ఉమ్మడి రాష్ట్రంలో ఫార్మ్ డీ కోర్సును మంజూరు చేశారని, భవిష్యత్తులో వారికి ఏ విధంగా ఉద్యోగవకాశాలు కల్పించాలనే విషయాన్ని విస్మరించారన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 6 వేల మంది ఫార్మ్ డీ విద్యార్థులు ఉన్నారని, వారి సమస్యను పరిష్కరించేందుకు కమిటీ వేశామ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment