
కాంగ్రెస్‌వి నీతిమాలిన రాజకీయాలు
‘2013 భూసేకరణ చట్టం చేసిన కాంగ్రెస్.. పేరు తమకే రావాలన్న దుర్బుద్ధితో, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 2016 భూసేకరణ, పునరావాస చట్టానికి అడ్డుపడుతోంది.
♦ సభ నుంచి సస్పెండ్ కావాలన్నదే వారి వ్యూహం
♦ కాంగ్రెస్ అంటేనే దళారుల పార్టీ: డిప్యూటీ సీఎం కడియం
♦ ప్రాజెక్టులు ఆపేందుకు మొండిగా వ్యవహరిస్తున్నారు: మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: ‘2013 భూసేకరణ చట్టం చేసిన కాంగ్రెస్.. పేరు తమకే రావాలన్న దుర్బుద్ధితో, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 2016 భూసేకరణ, పునరావాస చట్టానికి అడ్డుపడుతోంది. రాష్ట్రాలు మార్పులు చేసుకోవచ్చని 2013 చట్టంలోనే ఉంది. కేంద్రం సూచించిన సవరణల కోసం జరిపిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో అడ్డుపడాలనే ఉద్దేశంతో ఇతర అంశాలపై చర్చకు పట్టుబట్టింది.
శనివారం నాటి బీఏసీ సమావేశంలో అంగీకరించి రాత్రికి రాత్రి కుట్రలు పన్నారు. మార్షల్స్‌ను నెట్టేశారు, నినాదాలు చేశారు, కాంగ్రెస్‌వి నీతిమాలిన రాజకీయాలు కావా’ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పంటల ధరలు, ముఖ్యంగా మిర్చి ధరలపై మాట్లాడాలని కాంగ్రెస్ కోరిందని, ఇందుకు మరో సమావేశం పెట్టుకుందామని సీఎం కేసీఆర్ బీఏసీలోనే చెప్పారని వివరించారు.
టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలసి కడియం విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ‘రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేసింది ఎవరు, రైతులు రోడ్డెక్కేలా చేసింది ఎవరు, ఎరువులు, విత్తనాల కోసం రైతులు అల్లాడేలా చేసింది ఎవరు, విద్యుత్ కోతలపై ఆందోళనలు చేసేలా పాలించింది ఎవరు, ఈ కాంగ్రెస్ కాదా’ అని ఎద్దేవా చేశారు.
రైతును రాజును చేసేందుకు తమ ముఖ్యమంత్రి మూడేళ్లుగా వినూత్న పథకాలను ప్రవేశ పెడుతున్నారని, మరి టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు శాపంగా ఎలా మారిందో చెప్పాలని ప్రశ్నించారు. చవకబారు ప్రకటనలు మానుకోవాలని హితవు పలికారు. రైతు వ్యతిరేక దళారుల టీఆర్‌ఎస్ అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారని, అసలు కాంగ్రెస్ అంటేనే దళారుల పార్టీ అని ధ్వజమెత్తారు. రూ.వందల కోట్ల అవినీతికి పాల్పడిన పార్టీ అని విమర్శించారు. సభకు సస్పెండ్ కావాలనే వ్యూహంతో కాంగ్రెస్ వచ్చిందని, బిల్లును పాస్ చేసుకోవాలన్న వ్యూహంతో తాము వచ్చామని, తామే సక్సెస్ అయ్యామని పేర్కొన్నారు.
ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు: మంత్రి తుమ్మల
కాంగ్రెస్ పరిస్థితి ‘మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కిన’ అన్న చందంగా ఉందని, అన్నింటికీ మూలం ఆ పార్టీనే అని మంత్రి తుమ్మల ఆరోపించారు. రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, దళారులను ప్రోత్సహించడం వారి పేటెంట్ అని విమర్శించారు. రైతు కష్టాలకు కారణం కాంగ్రెస్ కాబట్టే రైతులు వారికి శిక్ష వేశారని ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేద్దామనుకుంటుంటే భూసేకరణ చట్టం సవరణలను అడ్డుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిల్లును అడ్డుకోవడం అంటే సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడమేనన్నారు. కేంద్రం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రకటించిన అన్ని పంటలను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, మిర్చికి మాత్రం ఎంఎస్‌పీని ప్రకటించలేదని తెలిపారు. ఎంసీపీని ప్రకటించాలని కేంద్రాన్ని కోరామని అన్నారు. అయినా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే మిర్చికి అత్యధిక ధర చెల్లిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తు శూన్యంగా కనిపించి ప్రాజెక్టులను ఆపడానికి కాంగ్రెస్ నేతలు మొండిగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.