సీఎం కాలేదు.. డిప్యూటీ అయ్యారు
హైదరాబాద్: టీఆర్ఎస్ నాయకుడు, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరికి మరో రూపంలో అదృష్టం కలసి వచ్చింది. ఒకప్పుడు టీడీపీలో కీలక నేతగా వ్యవహరించిన కడియం.. టీఆర్ఎస్ గూటికి చేరినప్పుడు తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చారు. టీఆర్ఎస్ అధినేత దళితుణ్ని సీఎం చేస్తానని అప్పట్లో ప్రకటించడంతో కడియం పేరు తెరపైకి వచ్చింది.
తెలంగాణ ఆవిర్భవించాక మారిన రాజకీయ పరిస్థితుల్లో టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకువచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం.. లోక్సభకు పోటీ చేసి గెలిచిన కడియం ఎంపీగానే మిగిలిపోయారు. దీంతో సీఎం అవుతారని భావించిన కడియం మంత్రి కూడా కాలేకపోయారు. అయితే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కడియంను అదృష్టం వరించింది. స్వైన్ ఫ్లూను అరికట్టడంలో విఫలమవడంతో పాటు అవినీతి ఆరోపణల కారణంగా డిప్యూటీ సీఎం రాజయ్య (వైద్య ఆరోగ్య శాఖ)ను కేసీఆర్ తొలగించారు. ఇది కడియంకు కలసి వచ్చింది. సీనియర్ నేత కావడం, మంత్రిగా పనిచేసిన అనుభవం, సమర్థుడిగా పేరు, ముఖ్యంగా రాజయ్య సామాజిక వర్గానికే చెందిన వ్యక్తి కావడంతో కడియంను కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కీలక విద్యా శాఖను అప్పగించి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు. కేసీఆర్ సలహా మేరకు గవర్నర్ రాజయ్యను తొలగించడం.. కడియం చేత ప్రమాణం స్వీకారం చేయించడం ఆదివారం చకచకా జరిగిపోయాయి. ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న కడియంను ఎమ్మెల్సీగా ఎంపిక చేసే అవకాశముందని భావిస్తున్నారు. కాస్త ఆలస్యం అయిన కడియం డిప్యూటీ సీఎం అయిపోయారు. రాష్ట్రాభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తానని, ఈ అవకాశం ఇచ్చిన కేసీఆర్ కు కడియం కృతజ్ఞతలు తెలిపారు.