మిషన్ కాకతీయకు బడా కాంట్రాక్టర్ల గండం
- భారీగా చెరువు పనులు దక్కించుకునేందుకు యత్నాలు
- వివిధ వర్గాల నుంచి సర్కార్‌కు ఫిర్యాదులు
- క్లాస్-5 కాంట్రాక్టర్ల అర్హతను రూ.50 లక్షలకు పెంచాలని ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో బడా కాంట్రాక్టర్లంతా ‘మిషన్ కాకతీయ’ కోసం రింగ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. చిన్న కాంట్రాక్టర్లకు పనులేవీ దక్కకుండా తామే మొత్తం పనులు చేజిక్కించుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. దీంతో ఈ వ్యూహానికి విరుగుడును ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా సీ-5 కాంట్రాక్టర్ల టెండర్ అర్హతను ఇప్పుడున్న పదిలక్షల రూపాయల వరకే పనిచేసే స్థాయి నుంచిరూ.50 లక్షల వరకు పెంచడానికి సిద్ధమైంది.
కాంట్రాక్టర్లు రింగ్ కాకుండా ఉండేం దుకు, ఒక్కో కాంట్రాక్టరు వేసే టెండర్ల సంఖ్యపై పరిమితి విధించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. రూ.రెండు వేల కోట్లతో చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం తొలి దశలో 600 చెరువులకు రూ.230 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించనుంది. జనవరి మొదటివారం నుంచి టెండర్లు పిలిచి, రెండోవారం నుంచి పనులు ప్రారంభించేలా ప్రణాళికలు వేస్తోంది.
మరోవైపు ఒకే జిల్లాలోని అరవై నుంచి డెభ్భై చెరువుల పనులు చేజిక్కించుకోవడం కోసం, ఇతరులెవరూ పోటీకి రాకుండా చూసేందుకు బడా కాంట్రాక్టర్లు కొద్దిమంది సిండికేట్ అవుతున్నట్టు ప్రభుత్వానికి వివిధ వర్గాల నుంచి సమాచారం అందింది. పనులు దక్కించుకునే బడా కాంట్రాక్టర్‌లు గరిష్టం, కనిష్ట విలువకు టెండర్లు ఒక్కరే దాఖలు చేసి, మధ్యలో ఉన్న వారిని పక్కకు తప్పించేలా చేయడం వీరి వ్యూహంలో భాగమని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి.
అందుకే కాంట్రాక్టర్ల అర్హతా ప్రమాణాలను సవరించాలని, క్లాస్-5 కాంట్రాక్టర్ల అర్హతా ప్రమాణాల్ని సడలించి టెండర్లు దాఖలు చేయడానికి అర్హత కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ రకంగా స్థానిక కాంట్రాక్టర్లందరికీ పనులు దక్కే విధంగా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. మంగళవారం చిన్న నీటి పారుదల శాఖపై సమీక్షించనున్న మంత్రి టి.హరీశ్‌రావు ఈ విషయం చర్చించనున్నట్టు తెలిసింది.