నెక్ట్స్‌.. బాహుబలే | Kaleshwaram Engineers shift Focus to P8 Pump House | Sakshi
Sakshi News home page

నెక్ట్స్‌.. బాహుబలే

Published Fri, Apr 26 2019 2:59 AM | Last Updated on Fri, Apr 26 2019 3:07 AM

Kaleshwaram Engineers shift Focus to P8 Pump House - Sakshi

కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నీటిని ఎత్తిపోసే ప్రక్రియ పరిశీలనకు శ్రీకారం చుట్టిన రాష్ట్రప్రభుత్వం మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. కాళేశ్వరం ప్యాకేజీ–8లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రామడుగు పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అత్యంత పెద్దవైన బాహుబలి మోటార్లకు వెట్‌రన్‌ నిర్వహించే పనుల జోరుపెంచింది.

జూన్‌ మొదటి వారంలో రామడుగు పంప్‌హౌస్‌లోని 139 మెగావాట్ల విద్యుత్‌తో నడిచే బాహుబలి మోటార్లకు వెట్‌రన్‌ నిర్వహించి పరిశీలన చేయాలని ఇంజనీర్లు ఇప్పటికే షెడ్యూల్‌ నిర్ణయించారు. అయితే దానికన్నా ముందే.. ప్యాకేజీ–7లోని టన్నెళ్ల పనులు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 

ఏడింట్లో ఐదు సిద్ధం
కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఎల్లంపల్లి దిగువన ఉన్న నందిమేడారం పంప్‌హౌస్‌ పరిధిలో 124.5 మెగావాట్ల విద్యుత్‌తో నడిచే మోటార్లకు వెట్‌రన్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ఒక పంప్‌ వెట్‌రన్‌ విజయవంతం కావడంతో గురువారం మరో మోటార్‌కు వెట్‌రన్‌ నిర్వహించారు. ఇదీ విజయవంతం కావడంతో సాయంత్రం మొదటి, రెండో మోటార్లకు కలిపి ఒకేసారి వెట్‌రన్‌ నిర్వహించారు. మిగతా మోటార్లకు ఇదే విధంగా పరిశీలన చేయనున్నారు. తొలిరెండు రోజులపాటు చేపట్టిన ప్రక్రియ సజావుగా సాగడంతో ఇంజనీర్లు ప్యాకేజీ–7లోని టన్నెళ్ల పనుల పూర్తి, ప్యాకేజీ–8లోని బాహుబలి మోటార్ల వెట్‌రన్‌ పనులపై దృష్టి పెట్టారు. ప్యాకేజీ–6 మోటార్లతో పోలిస్తే ప్యాకేజీ–8లోని మోటార్ల సామర్థ్యం 15 మెగావాట్ల మేర ఎక్కువ.

ఒక్కో మోటారు సుమారు 15 మీటర్ల ఎత్తు అంటే 4 అంతస్తులు ఉంటుంది. వ్యాసం 22 మీటర్లు, బరువు 650 టన్నులు, రైతులు సాధారణంగా 5 హెచ్‌పీ మోటార్లను వినియోగిస్తారు. కాళేశ్వరం పంప్‌హౌస్‌లో ఉపయోగించే ఒక్కో మోటారు సుమారు 37వేల హెచ్‌పీ మోటార్లతో సమానం. ఏడు మోటార్లు ఉండే ఒక్కో పంప్‌హౌస్‌ ఏకంగా 2.60 లక్షల హెచ్‌పీ మోటార్లతో సమానంగా ఉంటుంది. ఈ మోటార్లు 115 మీటర్ల లోతు నుంచి 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తుంది. ఈ పంప్‌హౌస్‌లో మొత్తంగా 7 మోటార్ల నిర్మాణం చేయాల్సి ఉండగా ఇప్పటికే ఐదింటిని సిద్ధం చేశారు. మరో రెండింటిని మే నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. 

సిద్ధమైన 400కేవీ సబ్‌స్టేషన్‌
వీటికి కరెంట్‌ను సరఫరా చేసేందు కు 400 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేసన్‌ ఇప్పటికే సిద్ధమైంది. అయితే మోటార్లకు వెట్‌రన్‌ నిర్వహించాలంటే అంతకు ముందు ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కి.మీ. జంట టన్నెళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. టన్నెల్‌ తవ్వకపు పనులు ఇప్ప టికే పూర్తి కాగా కేవలం 840 మీటర్ల లైనింగ్‌ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ పనులు వచ్చే నెల్లో పూర్తి కానున్నాయి. ఈ పనులు ముగిసిన వెంటనే జూన్‌ మొదటి వారంలో నంది మేడారం రిజర్వాయర్‌లో చేరిన నీటితో ప్యాకేజీ–8లోని సర్జ్‌పూల్‌ని నింపనున్నారు. 2కోట్ల లీటర్ల నిల్వ సామర్థ్యం ఉన్న సర్జ్‌పూల్‌లో లీకే జీలు పరిశీలించిన అనంతరం జూన్‌లో మోటార్ల వెట్‌రన్‌ నిర్వ హించేందుకు అధికారులు సన్నా హాలు చేస్తు న్నారు.

భూగర్భంలో 330 మీటర్ల దిగువన నిర్మించిన ఈ పంప్‌హౌస్‌లో మోటా ర్లను పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు నెల సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గురువారం ప్యాకేజీ–8లో మోటార్ల ఏర్పాటు పనులను ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేలు పరిశీలించారు. మే నెలాఖరు కల్లా టన్నెల్‌ సహా మిగతా నిర్మాణ పనులను పూర్తి చేసి జూన్‌ మొదటి వారానికి వెట్‌ రన్‌కు అంతా సిద్ధం చేయాలని ఇంజనీర్లకు ఆదేశా లిచ్చారు. ఈ మోటార్ల ద్వారా నీరు మిడ్‌మానేరు రిజర్వాయర్‌కు చేర నుంది. మిడ్‌మానేరు కింద కొండ పోచమ్మ సాగర్‌ వరకు నీటిని తరలించే పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement