కల్యాణిఖని ఓసీపీ సిద్ధం
కల్యాణిఖని ఓసీపీ సిద్ధం
Published Mon, Aug 14 2017 1:32 AM | Last Updated on Sun, Sep 17 2017 5:29 PM
- సింగరేణి ఖాతాలోకి మరో ఓపెన్‌కాస్ట్
- ఈ నెలాఖరులోగా ఉత్పత్తి ప్రారంభం ∙లక్ష్యం ఏటా 2 మిలియన్ టన్నులు
సాక్షి, మంచిర్యాల: సింగరేణి ఖాతాలోకి మరో ఓపెన్‌కాస్ట్ గని చేరింది. మంచిర్యాల జిల్లా లోని మందమర్రి ప్రాంతంలో ప్రతిపాదించిన కల్యాణిఖని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు పనులు శరవేగంతో సాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా గని నుంచి బొగ్గు ఉత్పత్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో సింగరేణిలో ఓపెన్‌కాస్ట్ గనుల సంఖ్య 19కి చేరనుంది.
భూగర్భ గనుల స్థానంలోనే..
సింగరేణి మందమర్రి ఏరియాలో సోమ గూడెం 1, 1ఏ, 3 గనులతోపాటు కల్యాణిఖని 2, 2ఏ పేరుతో భూగర్భ గనులు ఉండేవి. భూగర్భగనుల ద్వారా బొగ్గు వెలికితీతతో నష్టాలు వస్తుండడంతో వీటిని 2006–07లోనే మూసివేసి ఓపెన్‌కాస్ట్ గనిని తేవాలని సంస్థ నిర్ణయించింది. ఓపెన్‌కాస్ట్‌లపై స్థానికంగా వ్యతిరేకత ఎదురవడం, భూ సమస్య, 1/70 గిరిజన చట్టం నేపథ్యంలో ప్రణాళికా బద్ధంగా సోమగూడెం 1వ గనితోపాటు కేకే 2 గని జీవితకాలాన్ని తగ్గించి మూసివేసింది. కాసిపేట ఓపెన్‌కాస్ట్ పేరుతో కొత్త గనికి అంకురార్పణ చేసేందుకు జరిగిన ప్రయత్నాలను స్థానికులు వ్యతిరేకించారు. దీంతో 2013లో మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని–2 వద్ద ప్రజాభిప్రాయం చేపట్టి, కళ్యాణిఖని ఓపెన్‌కాస్ట్‌కు శ్రీకారం చుట్టింది.
945 హెక్టార్ల భూమి అవసరం
కల్యాణిఖని ఓపెన్‌కాస్ట్ కోసం ప్రస్తుతం సింగరేణి సంస్థ అధీనంలో 246.17 హెక్టార్ల భూమి ఉండగా, మరో 250 హెక్టార్ల వరకు భూసేకరణ ద్వారా స్వాధీనం చేసుకుంది. మరో 250 హెక్టార్ల వరకు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. పలు వివాదాల నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 500 హెక్టార్ల భూమిలో పనులు ప్రారంభించాలని నిర్ణయించి, మార్చి 24న భూమిపూజ చేశారు. ప్రస్తుతం ఓబీ (మట్టి) తొలగింపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది.
కల్యాణిఖని ఓపెన్‌కాస్ట్ ప్రొఫైల్..
ఓపెన్‌కాస్ట్ కోసం అవసరమైన భూమి: 945.21 హెక్టార్లు
గని విస్తీర్ణం: 799.98 హెక్టార్లు
ముంపు గ్రామాలు: కాసిపేట మండలంలోని దుబ్బగూడెం, గొండుగూడెం
గని జీవిత కాలం: 19 సంవత్సరాలు
బొగ్గు నిల్వలు: 45.32 మిలియన్ టన్నులు
భూగర్భం ద్వారా తీసిన బొగ్గు: సోమగూడెం –1, 1ఏ, 3, కె.కె–2, 2 ఏ ద్వారా 10.25 మిలియన్ టన్నులు
తీయాల్సిన బొగ్గు: 30.54 మి.టన్నులు
బొగ్గు గ్రేడ్ : జీ–10
ఉత్పత్తి లక్ష్యం: ఏటా 2 మిలియన్ టన్నులు
పెట్టుబడి: రూ. 417.33 కోట్లు
బొగ్గు, మట్టి వెలికితీత రేషియో: 1:12
బొగ్గు లభించే లోతు: 15 నుంచి 250 మీ.
గనిలో తీసే మట్టి (ఓబీ): 365.49
మిలియన్ క్యూబిక్ మీటర్లు
Advertisement
Advertisement