
సాక్షి ,కరీంనగర్ : 20 టీఎంసీల సామర్థ్యం గల ఎల్లంపల్లిని 365 రోజులు నింపి ఉంచడమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎల్లంపల్లి గుండెకాయ. మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల ఎత్తిపోతల పథకాల ద్వారా వచ్చే నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకున్న తరువాతే ఆయకట్టుకు నీరందించే అసలు ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటి వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరు మంచిర్యాల జిల్లా గూడెం ఎత్తిపోతల పథకంతోపాటు హైదరాబాద్‌కు తాగునీటి రూపంలో వెళ్తుంది. ఎన్‌టీపీసీ, సింగరేణి, పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాజెక్టులకు నీరు ఇక్కడి నుంచే చేరుతుంది. ఇప్పుడు కొత్తగా వేమునూరు వద్ద ఏర్పాటు చేసిన మూడు గేట్ల ద్వారా కరీంనగర్ ఉమ్మడి జిల్లా భూభాగంలోకి ప్రవేశిస్తుంది.
ఇక్కడి నుంచి నీరు గ్రావిటీ ద్వారా రెండు 9.53 కిలోమీటర్ల పొడువున్న భారీ సొరంగ మార్గాల ద్వారా నందిమేడారం వద్ద భూగర్భంలోనే నిర్మించిన సర్జిపూల్‌కు వెళ్తుంది. ఇక్కడ భూగర్భంలోనే ఏర్పాటు చేసిన సర్జ్‌పూల్ పంప్‌హౌజ్‌కు 124 మెగావాట్ల సామర్థ్యంతో 7 మోటార్లు ఏర్పాటు చేశారు. ఈ పంప్‌హౌజ్‌ల ద్వారా మేడారం నుంచి 1.95 కిలోమీటర్ల కాలువ, 15.37 కిలోమీటర్ల దూరం గల రెండు సొరంగ మార్గాల ద్వారా ప్రవహించే నీరు లక్ష్మిపూర్ పంప్‌హౌజ్‌కు చేరుతుంది. లక్ష్మీపూర్ పంప్‌హౌజ్ వద్ద ఒక్కోటీ 139 మెగావాట్ల సామర్థ్యంతో 7 మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు.
వీటి సాయంతో నీటిని 117 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వరద నీటి కాలువలో పోసి, ఒక టీఎంసీని ఎస్‌ఆర్‌ఎస్‌పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా శ్రీరాంసాగర్ వరద కాలువలోకి రివర్స్ పంపింగ్ ద్వారా మళ్లిస్తారు. 182 కిలోమీటర్ల ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరద నీటి కాలువకు నీటిని మళ్లించడం వల్ల చొప్పదండి, పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం నియోజకవర్గాలకు సాగునీటి కష్టాలు దూరం కానున్నాయి. ఈ కాలువ పొడవునా ఉన్న రైతుల కోసం సుమారు 30 చోట్ల తూములు ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కారు ఉంది. ఇక మరో టీఎంసీ నీరు మిడ్‌మానేరుకు చేరుతుంది.
మిడ్‌మానేరు ద్వారా సిరిసిల్లలోని లక్షకు పైగా ఎకరాలకు నీరు లభించనుంది. మిడ్‌మానేరు నుంచి అప్పర్ మానేర్ దారిలో గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్లు నింపుకుంటూ గోదావరి ఎగువకు సాగనుంది. అనంతగిరి, రంగనాయకసాగర్ ద్వారా మల్లన్నసాగర్ వరకు వస్తాయి. ఈ ప్రాజెక్టు కారణంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజన్న సిరిసిల్ల రైతాంగానికి అధికంగా మేలు జరగబోతుంది. ఏకంగా 1,41,205 ఎకరాల ఆయకట్టు ఈ ప్రాజెక్టు వల్ల రాబోతుంది. ఎస్‌ఆర్‌ఎస్‌పీ పునరుజ్జీవ పథకం ద్వారా స్టేజ్–1 కింద 1,60,000 ఎకరాలకు, స్టేజ్ 2 ద్వారా ఏకంగా 4లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. మిడ్‌మానేరు ద్వారా 30వేల ఎకరాలతోపాటు మిడ్‌మానేరు నుంచి అప్పర్ మానేరు దారిలో 86,150 ఎకరాలకు సాగునీరు అందబోతుంది. కరీంనగర్ జిల్లాలో 800 ఎకరాలు కొత్తగా సాగులోకి రానుంది.
గోదావరి నీరు ఎత్తిపోసే దారి ఇదే..
మేడిగడ్డ దగ్గర 1063 మీటర్ల వెడల్పు బ్యారేజీతో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలవుతుంది. ఇక్కడి నుంచి గోదావరి నదిలో బ్యాక్ వాటర్ కన్నెపల్లి వరకు 16.37 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. కన్నెపల్లి వద్ద 11 మోటార్లతో కూడిన పంప్‌హౌజ్ ఏర్పాటు చేశారు. ఈ మోటార్లు అన్నారం బ్యారేజీలోకి నీటిని ఎత్తిపోస్తాయి. 10.87 టీఎంసీల నిల్వసామర్థ్యంతో, 66 గేట్లతో నిర్మించిన అన్నారం బ్యారేజీలో బ్యాక్ వాటర్‌ను సుందిళ్ల బ్యారేజీలోకి ఎత్తిపోసేందుకు గుంజపడుగు వద్ద భారీ పంప్‌హౌజ్ నిర్మించారు. ఒక్కోటీ 40 మెగావాట్ల సామర్థ్యం గల 8 భారీ మోటార్లతో అన్నారం బ్యారేజీలోని నీటిని 34 మీటర్ల ఎత్తుకు పంప్ చేసి.. 74 గేట్లతో నిర్మించిన సుందిళ్ల బ్యారేజీలో పోస్తుంది. ఇక సుందిళ్ల బ్యారేజీ నుంచి నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోసేందుకు గోలివాడ వద్ద మరో పంప్‌హౌజ్ ఏర్పాటు చేశారు. ఇక్కడి పంప్‌హౌస్ నుంచి 9 భారీ మోటార్ల ద్వారా 40 మీటర్ల ఎత్తుకు పంప్ చేసి.. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పోస్తుంది. ఒక్కోటీ 40 మెగావాట్ల సామర్థ్యంగల మోటార్‌ను అమర్చడం గమనార్హం.
జగిత్యాల జిల్లాలో 1.60 లక్షల ఎకరాలకు నీరు
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలాలపై జగిత్యాల జిల్లా రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాకు మణిహారమైన ఎస్సారెస్పీ కాలువలు పునరుజ్జీవం పొందనున్నాయి. ఎస్సారెస్పీ కాలువల్లో నిరంతరం నీరుండేలా మల్యాల మండలం రాంపూర్ వద్ద రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువలోకి నీటిని ఎత్తిపోయనున్నారు. ఇక్కడి నుంచి కాళేశ్వరం నీటిని ఎస్సారెస్పీకి తరలించడం ద్వారా జిల్లాలోని లక్షకు పైగా ఎకరాలలో రెండు పంటలకు సాగునీరు అందనుంది. జిల్లాలో ఎస్సారెస్పీ కింద లక్ష ఎకరాల వరకు ఆయకట్టు ఉన్నప్పటికీ... ప్రస్తుతం నీరు లేక 50 వేల నుంచి 70 వేల ఎకరాలకే సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని లక్ష ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు చేరుకోనుంది. ఇది కాకుండా అదనంగా మరో 60 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందనుంది. జిల్లాలోని ఎస్సారెస్పీ నీరు చేరని మల్యాల, కొడిమ్యాల, మేడిపల్లి, కథలాపూర్ మండలాలకు సైతం కాళేశ్వరం నీరు అందనుండటంతో ఆ మండలాలు కూడా సస్యశ్యామలం కానున్నాయి. మొత్తంగా జిల్లాలోని 1.60 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరిచ్చే అవకాశం ఉంది.
పెద్దపల్లికి ‘పేద్ద’ ఊరట
కాళేశ్వరం ప్రాజెక్టు జల ఫలాలు పెద్దపల్లి జిల్లా వాసులు ధర్మారం మండలం పత్తిపాక నరసింహస్వామి గుట్టపై ప్రాజెక్టు నిర్మించేందుకు గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం అవి పెండింగ్‌లో ఉన్నాయి. పత్తిపాక కంటే లక్ష్మిపూర్ వరద కాలువ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా కాకతీయ కాల్వకు నీరందించడం ద్వారా పెద్దపల్లి జిల్లాలోని లక్షా 85వేల ఎకరాలకు సాగునీరు చేరనుంది. డీ–83 కాల్వలకు లక్షా 5వేల ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతుంది. డీ–86 కాల్వ ద్వారా 80వేల ఎకరాలకు సాగునీరు వెళుతుంది. ఇలా రెండు ప్రధాన కాల్వల ద్వారా పిల్ల కాల్వల నుంచి ప్రతిపల్లెకు ఎస్సారెస్పీ నీటిని అందించడానికి కాళేశ్వర జలాలను రివర్స్ పంపింగ్ ద్వారా అందజేసేందుకు వరద కాల్వ వద్ద పనులు కొనసాగుతున్నాయి. అయితే అన్నారం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మంథని ప్రాంతానికి, అంతర్గాం లిఫ్టు ఇరిగేషన్ ద్వారా రామగుండం నియోజకవర్గం నుండి నిర్ధేశిత గ్రామాలకు సాగునీరు అందించడానికి అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రివర్స్ పంపింగ్‌తోపాటు అంతర్గాం, అన్నారం లిఫ్టు ఇరిగేషన్‌లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కాళేశ్వర జలాలు ఎల్లంపల్లి నుంచి మేడారం అక్కడి నుంచి లక్ష్మిపూర్ వరకు టన్నెల్ నిర్మాణం పూర్తయి పంపుహౌజ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. గోపాల్‌రావుపేట, పాతగూడూరు, సాయంపేట, ముంజంపల్లి, నల్లలింగయ్యపల్లి, మేడారం తదితర గ్రామాలకు మేడారం రిజర్వాయర్ ద్వారా పొలాలకు కాళేశ్వరం నీళ్లు చేరుతున్నాయి.
పెరగనున్న భూగర్భ జలమట్టం
ఎల్లంపల్లి ప్రాజెక్టు కారణంగా ఇప్పటికే వెల్గటూరు, ధర్మారం మండలాల్లోని పలు గ్రామాల్లో భూగర్భ జల మట్టం పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా ధర్మపురి నుంచి మేడిగడ్డ వరకు వందల కిలోమీటర్ల దూరం నిత్యం నీటి నిల్వ ఉండడంతో గోదావరి దిగువన ఉన్న గ్రామాలతోపాటు పంప్‌హౌజ్‌లు ఏర్పాటు చేసిన ప్రాంతాలు, ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువల దిగువ ప్రాంతాలు, మిడ్‌మానేరు, అప్పర్ మానేరు ప్రాంతాల్లో భూగర్భజల మట్టం భారీగా పెరుగుతుందని సాగునీటి నిపుణులు చెపుతున్నారు.
సిరిసిల్ల జిల్లాలో 1.41 లక్షల ఎకరాలకు సాగునీరు..
జిల్లాలోని బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద 25.873 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మధ్యమానేరు జలాశయ నిర్మాణం పూర్తయింది. గత ఏడాది ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరద కాల్వ ద్వారా ఐదు టీఎంసీల నీటిని మధ్యమానేరుకు చేర్చారు. మిషన్ భగీరథ కోసం తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఈ నీటిని వినియోగిస్తున్నారు. రూ.650 కోట్ల అంచనాలతో మధ్యమానేరు పనులు చేశారు. ఇప్పటికే 25 గేట్లు బిగించారు. 10 కిలోమీటర్ల మేర మట్టి కట్టను నిర్మించారు. గేట్ల బిగింపు పూర్తి కావడంతో ప్రాజెక్టులో 25.873 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. 25 టీఎంసీల సామర్థ్యం గల మిడ్‌మానేరుకు కాళేశ్వరం నీరు రావడంతో 30వేల ఎకరాల ఆయకట్టు రానుంది.
మిడ్‌మానేర్ నుంచి అప్పర్ మానేరుకు నీటిని తరలించే క్రమంలో మరో 85,150 ఎకరాలు సాగులోకి రానుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–9,10, 11, 12లతో రాజన్న సిరిసిల్ల జిల్లా సస్యశ్యామలం కానుంది. ప్యాకేజీ–9 ద్వారా మల్కపేట రిజర్వాయర్, నిమ్మపల్లి మూలవాగు, సింగసముద్రం, ఎగువమానేరు, పెనంమడుగు జలాశయాలకు ఎత్తిపోతల ద్వారా సాగునీరు దరి చేరనుంది. వేములవాడ నియోజకవర్గంలోని 60వేల ఎకరాలకు, సిరిసిల్ల నియోజకవర్గంలోని 80వేల ఎకరాలకు గోదావరి జలాలు రానున్నాయి. సిరిసిల్ల ముస్తాబాద్ మండలాలకు సాగునీరు అందించేందుకు పనులు సాగుతున్నాయి. సిద్దిపేట జిల్లా పరిధిలోని రంగనాయకసాగర్ నుంచి నీటిని ముస్తాబాద్, సిరిసిల్ల మండలాల్లోని గ్రామాలకు సాగునీరు అందనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు శాశ్వతంగా సాగునీరు అందించే పనులు సాగుతున్నాయి. ప్యాకేజీ–10, –11 ద్వారా మధ్యమానేరు నుంచి అంతగిరి రిజర్వాయర్‌కు నీరు మళ్లిస్తారు. మూడున్నర టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులతో ఇల్లంతకుంట మండలంలోని గ్రామాలకు సాగునీరు అందనుంది.
Comments
Please login to add a commentAdd a comment