కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్ : కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా 24వ డివిజన్ కార్పొరేటర్, టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు రవీందర్‌సింగ్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. రవీందర్‌సింగ్ పేరు ఎన్నికలు జరగకముందు నుంచే ప్రచారంలో ఉన్నా.. పార్టీ నిర్ణయం కోసం ఇన్నాళ్లూ ఎదురుచూడాల్సి వచ్చింది. కరీంనగర్ మేయర్ విషయమై గులాబీ దళపతి కేసీఆర్ పార్టీ శ్రేణులతో చర్చించి అందరి అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అలాగే డెప్యూటీ మేయర్ గా 18వ డివిజన్ కార్పొరేటర్ గుగ్గిళ్లపు రమేశ్, పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఆరో డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ ఆరిఫ్, విప్‌గా ఐదో డివి జన్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. సామాజిక వర్గాల సమీకరణలు కూడా కలిసివచ్చేలా సిక్కు, బీసీ, ముస్లిం, ఎస్సీ వర్గాలకు స్థానం కల్పించారు. నేడో రేపో అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
టెన్షన్‌కు తెర
ఈనెల 12న కార్పొరేషన్ ఎన్నికల ఫలి తాలు వెలువడినప్పటి నుంచి మేయర్, డెప్యూటీ మేయర్ అభ్యర్థులు ఎవరనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. టీఆర్‌ఎస్ 24 మంది కార్పొరేటర్లను గెలుచుకుని మేజిక్ ఫిగర్‌కు కేవలం ఇద్దరు కార్పొరేటర్ల దూరంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ కూడా తన ప్రయత్నాలు కొనసాగించింది. స్వతంత్ర కార్పొరేటర్ల నుంచి ఇద్దరు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడం.. ఎమ్మెల్యేగా గంగుల, ఎంపీగా వినోద్ టీఆర్‌ఎస్ నుంచి గెలుపొందడంతో మేయర్ పదవి కైవ సం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజారిటీ వచ్చినట్లయ్యింది. మేయర్ ఎన్నికకు సమయం ఎక్కువగా ఉండడం.. రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్‌ఎస్ తలమునకలై ఉండడంతో అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైంది.
ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం
ఇప్పటివరకు ఏ పాలకవర్గం చేయనిరీతిలో ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుంది. నగరపాలక సంస్థ పాలక వర్గం ఏర్పడిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో కాకుండా, ప్రజల మధ్య ప్రమాణస్వీకారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మేయర్ ఎన్నిక తేదీ.. అప్పటి పరిస్థితులను బట్టి వేదికను ఖరారు చేయనున్నట్లు సమాచారం.
కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్!
Published Wed, May 21 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM
Advertisement