'స్మార్ట్‌' మిషన్‌.. స్టార్ట్‌ ! | Karimnagar Smart City Mission Work In Progress | Sakshi
Sakshi News home page

'స్మార్ట్‌' మిషన్‌.. స్టార్ట్‌ !

Published Wed, Sep 11 2019 11:12 AM | Last Updated on Wed, Sep 11 2019 11:12 AM

Karimnagar Smart City Mission Work In Progress - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కరీంనగరాన్ని సుందరీకరించే ‘స్మార్ట్‌’ పనుల్లో ఎట్టకేలకు వేగం పెరగనుంది. నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు గంగుల కమలాకర్‌ రాష్ట్ర కేబినెట్‌లో స్థానం సంపాదించుకోవడంతో స్మార్ట్‌ రోడ్లకున్న ఆటంకాలు తొలగాయి. మంత్రిగా స్మార్ట్‌సిటీ పనులను త్వరితగతిన పూర్తి చేయడమే తొలి ప్రాధాన్యతగా ఆయన ఎంచుకున్నారు.  రూ.1878 కోట్లతో కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం అనుమతిచ్చి మూడేళ్లు అవుతున్నా... స్థానికంగా నెలకొన్న రాజకీయాల కారణంగా ఒక అడుగు కూడా సవ్యంగా ముందుకు పడలేదు. ఇప్పటి వరకు మూడు విడతల్లో కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ కోసం రూ.271.70 కోట్లు మంజూరైనప్పటికీ, అరకొర పనులు తప్ప ఏ ఒక్క పని పూర్తికాలేదు.

స్మార్ట్‌సిటీ కింద అంబేద్కర్‌ స్టేడియం అభివృద్ధి పనులు, ఆర్ట్స్‌ కాలేజీ, సర్కస్‌ గ్రౌండ్స్‌ల్లో చేపట్టిన అభివృద్ధి పనులు కొంత మేర సాగుతున్నా... స్మార్ట్‌ రోడ్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియలోనే పనులు నిలిచిపోయాయి. మూడు ప్యాకేజీల్లో రూ.228.70 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక రూపొందించి తొలిసారి టెండర్లు పిలవగా, ఎవరూ ముందుకు రాలేదు. రెండోసారి టెండర్లు ఆహ్వానిస్తే రూ.53 కోట్ల విలువైన మూడో ప్యాకేజీ పనులకు మాత్రమే కాంట్రాక్టర్‌ను ఎంపిక చేశారు. రూ.164 కోట్ల విలువైన మొదటి, రెండో ప్యాకేజీ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించడంతో రద్దయ్యాయి.

మూడో విడత టెండర్లపై కూడా కోర్టులో దావా వేయగా, గత నెలలో స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్‌ స్వయంగా చొరవ తీసుకొని కేసులను ఉపసంహరింప జేయడంతో స్మార్ట్‌ రోడ్లకు గ్రహణం తొలిగింది. మూడో ప్యాకేజీ పనులను దక్కించుకున్న నమిత కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీకి ఆరునెలల క్రితమే వర్క్‌ ఆర్డర్‌ వచ్చినప్పటికీ, ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. వివాదాల నడుమ రూ.164 కోట్ల విలువైన  ఒకటి, రెండో ప్యాకేజీలను దక్కించుకున్న రాజరాజేశ్వరి కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీకి సోమవారమే వర్క్‌ ఆర్డర్‌ వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం నుంచే స్మార్ట్‌ రోడ్ల పనులు మొదలు కాబోతున్నాయని మంత్రి గంగుల కమలాకర్‌ స్వయంగా వెల్లడించడం గమనార్హం. 

నేడు అధికారులతో సమావేశం
స్మార్ట్‌రోడ్ల పనులకు సంబంధించి తొలి అడుగుగా బుధవారం అధికారులతో మంత్రి గంగుల సమావేశం కానున్నారు. మూడో ప్యాకేజీ కింద వర్క్‌ ఆర్డర్లు వచ్చినా హౌసింగ్‌బోర్డు కాలనీలో పనులు సాగకపోవడానికి వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం కూడా కారణమని స్పష్టమైంది. హౌసింగ్‌ బోర్డులో 7.5 కిలోమీటర్ల మేర వేయాల్సిన రోడ్లతోపాటు ఒకటి, రెండు ప్యాకేజీల్లో 27.5 కిలోమీటర్ల పొడవునా రోడ్లు నిర్మించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రోడ్ల నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న చెట్లు తొలగించడం, విద్యుత్‌ స్తంభాల స్థల మార్పిడి, మిషన్‌ భగీరథ పనులు, భూగర్భ డ్రైనేజీ పనులు మొదలైన వాటితో ఆటంకాలు ఎదురు కాకుండా ఎంపిక చేసిన రోడ్లలో సమన్వయంతో అన్ని శాఖలు పనిచేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన కలెక్టర్‌ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్, మునిసిపల్‌ కమిషనర్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొనే ఈ సమావేశంలో స్మార్ట్‌సిటీ పనులతోపాటు మిషన్‌ భగీరథ, ఆర్‌అండ్‌బీ, పంచాయితీ రాజ్, యూజీడీ, సీఎం హామీ పనులకు సంబంధించి ప్రోగ్రెస్‌ను తెలుసుకోనున్నారు. ప్రధానంగా స్మార్ట్‌రోడ్లకు అడ్డంకులను తొలగించి రహదారులను సుందరీకరించడం, సీఎం హామీ కింద జరుగుతున్న రూ.347 కోట్ల పనుల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవడమే ఈ సమావేశం ప్రధాన ఉద్ధేశం. 

తగ్గనున్న రాజకీయ జోక్యం
స్మార్ట్‌రోడ్లకు సంబంధించి రెండు కంపెనీలకు వర్క్‌ ఆర్డర్లు కూడా జారీ కాగా, మంత్రి గంగుల స్వయంగా పర్యవేక్షించనుండడంతో పనుల్లో రాజకీయ జోక్యం తగ్గనుంది. మునిసిపల్‌ కౌన్సిల్‌ కూడా రద్దయిన నేపథ్యంలో మాజీ కార్పొరేటర్లు కొంత మేర ఆజమాయిషీ చలాయించాలని చూసినా, మంత్రి దృష్టి పెడుతుండడంతో కాంట్రాక్టర్లకు ఇబ్బందులు చాలా వరకు తగ్గనున్నాయి. వర్క్‌ ఆర్డర్లు కూడా వచ్చిన నేపథ్యంలో అభివృద్ధి పనులను అడ్డుకునే సాహసం ఇతర రాజకీయ పార్టీల నుంచి కూడా ఉండదని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులు సమన్వయంతో పనిచేస్తే స్మార్ట్‌రోడ్లతోపాటు ఇతర స్మార్ట్‌సిటీ పనులు కూడా వేగంగా సాగే అవకాశం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement