
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర జలాల్లో తమ రాష్ట్ర అవసరాలు అధికంగా ఉన్న దృష్ట్యా, ఈ ఏడాది తమకు కొంత నీటిని సర్దాలని కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రాన్ని కోరింది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు రెండు రోజుల కిందట లేఖ రాశారు. తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో ఆలస్యంగా వర్షాలు కురిసిన దృష్ట్యా, ఖరీఫ్ పంటల సాగు ఆలస్యమైందని, ప్రస్తుతం పంటలన్నీ పొట్ట దశలో ఉన్నందున వాటిని కాపాడేందుకు తుంగభద్రలో తెలంగాణకు దక్కే 3.5 టీఎంసీలను తమకు వాడుకునే అవకాశం ఇవ్వాలని కోరారు.
నిజానికి తుంగభద్రలో ఆర్డీఎస్ కింద 16.9 టీఎంసీల మేర నీటి కేటాయింపులున్నా, కాల్వల ఆధునీకరణ జరగని కారణంగా ఏటా సగటున 6 నుంచి 8 టీఎంసీల మేర నీటిని మాత్రమే రాష్ట్రం వాడుకుంటోంది. ఈ సారి తుంగభద్ర పరీవాహకంలో సరైన వర్షాలు లేని కారణంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో ఆర్డీఎస్ కింద వినియోగమే జరగలేదు. ప్రస్తుతం తుంగభద్ర నదిలో మొత్తంగా 9 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. ఇందులో 5.5 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్, 3.5 టీఎంసీలను తెలంగాణ వాడుకునే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో తమ ఖరీఫ్ పంటలను కాపాడేందుకు 3.5 టీఎంసీలను వాడుకునే అవకాశం ఇవ్వాలని సిద్దరామయ్య కోరారు. ఇదే అంశంపై ఏపీకి దక్కే వాటా నీటిని సైతం తమ వినియోగానికే ఇవ్వాలని సిద్దరామయ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సైతం లేఖ రాసినట్లు తెలుస్తోంది. కాగా, కర్ణాటక ముఖ్యమంత్రి లేఖపై తెలంగాణ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఆర్డీఎస్ కింద 8 వేల ఎకరాల మేర ఆరుతడి పంటల సాగు జరుగుతోంది.
ఈ అవసరాలకు సరిపడే నీటిని పక్కనపెట్టి 2.5 టీఎంసీలను కర్ణాటకకు సర్దే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. గతంలో తెలంగాణకు తాగునీటి కొరత సమయంలో కర్ణాటక తన ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసి ఉదారత చాటుకున్న దృష్ట్యా, అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతను కోరుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించిన నేపథ్యంలో దీనిపై సానుకూల నిర్ణయమే వెలువడుతుందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment