‘ప్రతిపక్షాలు బాధపడుతున్నాయ్’
-- టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
హైదరాబాద్: కులవృత్తులను బలోపేతం చేసేందుకు, ఆయా కులాలకు ప్రత్యక్షంగా మేలు చేసే కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. వివిధ కులాలకు చెందిన ప్రజలంతా చాలా సంతోషంగా ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం బాధపడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. గడిచిన రెండు దశాబ్దాల్లో చెరో పదేళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు కులవృత్తులను సర్వనాశనం చేశాయని మండిపడ్డారు. ఫలితంగా దాదాపు అన్ని కులవృత్తుల వారు పొట్టకూటి కోసం వలసలు పోయారని చెప్పారు.
ఈ పరిస్థితుల్లో ఉద్యమ కాలంలో ఇచ్చిన మాట మేరకు మార్పులు తీసుకొస్తుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. గతంలో ఓట్ల కోసమే హాహీలు ఇచ్చి, తెల్లారే మరిచిపోయేవారని, తాము మాత్రం ఇచ్చిన హామీలను గౌరవంగా భావించి అమలు చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 15 వందల గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమం మొదలైందన్నారు. వీటి విలువ రూ. 400 కోట్లని చెప్పారు. వెనకబడిన కులాల పక్షాన టీఆర్‌ఎస్ ఉందన్న భరోసా ఇస్తున్నామని తెలిపారు.