‘ఆశ’లు తీరాయి! | KCR Announces Hike in Asha Workers Salary | Sakshi
Sakshi News home page

‘ఆశ’లు తీరాయి!

Published Sat, May 6 2017 2:21 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

‘ఆశ’లు తీరాయి! - Sakshi

‘ఆశ’లు తీరాయి!

ఆశ వర్కర్లకు నెలకు రూ.6 వేల పారితోషికం: కేసీఆర్‌
► ఈ నెల నుంచే అమలు.. వచ్చే బడ్జెట్‌లో మరోసారి పెంపు
► వైద్యారోగ్య శాఖ ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత
► ఇతర సమస్యలనూ పరిష్కరిస్తామని హామీ
► ప్రజల ఆరోగ్యం బాధ్యత మీదేనంటూ వ్యాఖ్య
► ఆశ వర్కర్లతో వెట్టిచాకిరీ చేయించుకోవద్దని అధికారులకు ఆదేశం  


సాక్షి, హైదరాబాద్‌: ఆశ వర్కర్లకు ప్రతి నెలా అందుతున్న పారితోషికాన్ని రూ.ఆరు వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీనిని ఈ నెల నుంచే అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆశ వర్కర్లకు నెలకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు మాత్రమే పారితోషికంగా అందుతున్నాయి. ఇకపై రూ.ఆరు వేలు అందించనున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది బడ్జెట్‌ సందర్భంగా మరోసారి ఆశ వర్కర్ల పారితోషికం పెంచుతామని.. ఆశ వర్కర్లను అంగన్‌వాడీ కార్యకర్తల స్థాయికి తీసుకెళతామని సీఎం హామీ ఇచ్చారు. విద్యార్హతలుండి శిక్షణ పొందిన వారికి ఏఎన్‌ఎం ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తామని.. ఇతర కోర్సులు చేసినవారుంటే వైద్య ఆరోగ్య శాఖలో సంబంధిత ఉద్యోగాలిస్తామని తెలిపారు. ఆరోగ్య సంబంధ విధులు తప్ప మరో పని చెప్పకుండా అధికారులకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు.

శుక్రవారం రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆశ వర్కర్లు ప్రగతి భవన్‌ వచ్చారు. వారందరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయించిన సీఎం కేసీఆర్‌.. అనంతరం జనహితలో వారితో సమావేశమయ్యారు. ఆశ వర్కర్ల సమస్యలు, విజ్ఞప్తులను విన్నారు. క్షేత్రస్థాయిలో తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు తాము అన్ని రకాల సేవలు చేస్తున్నామని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి వివరించారు. కేవలం ఆరోగ్య సంబంధమైన పనులే కాకుండా, ప్రభుత్వం నిర్వహించే ఇతర కార్యక్రమాల్లో కూడా భాగస్వాములం అవుతున్నామని చెప్పారు. అయినా తమకు నెలకు రూ.వెయ్యి– పదిహేను వందలు మాత్రమే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

వెట్టి చాకిరీ చేయించొద్దు..
ఆశ వర్కర్ల సమస్యలు తీర్చుతామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అధికారులు ఆశ వర్కర్లతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. ‘‘వారికో జాబ్‌ చార్ట్‌ కూడా లేదు. ఏ పని పడితే ఆ పని చేయిస్తున్నారు. వాస్తవానికి వారి పనులు చేసుకుంటూ రోజులో గంటో రెండు గంటలో మాత్రమే పనిచేయడానికి ఆశ వర్కర్లను ఏర్పాటు చేశారు. కానీ ఆచరణలో రోజంతా పనిచేయిస్తున్నారు. వారికి కేటాయించిన పని మాత్రమే కాకుండా ఇతర పనులు చేయిస్తున్నారు. వాటికి అదనపు పారితోషికం కూడా ఇవ్వడం లేదు. గత పాలకులు ఆశ వర్కర్లను పట్టించుకోలేదు. అంగన్‌వాడీ వర్కర్ల విషయంలోనూ ఇలాగే జరిగింది. రెండు దఫాలుగా జీతాలు పెంచి వారికి న్యాయం చేశాం. ఇప్పుడు ఆశ వర్కర్లకు కూడా సమాజంలో, కుటుంబంలో గౌరవం పెరిగే విధంగా జీతాలు పెంచుతాం. ఈ నెల నుంచే రూ.6 వేలు ఇస్తాం. వచ్చే బడ్జెట్‌ సందర్భంగా మరోసారి పెంచుతాం..’’అని ప్రకటించారు. ఆశ వర్కర్లు ఏం పనిచేయాలి? ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎవరెవరు ఏ పనిచేయాలనే విషయాల్లో స్పష్టత ఉండాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి ఒక్కరు కేసీఆర్‌ కావాలి
ఆరోగ్య అంశాలపై ప్రజలకు అవగాహన లేదని, అనేక రోగాల బారిన పడుతున్నారని కేసీఆర్‌ పేర్కొన్నారు. పేదరికం కారణంగా నిండు గర్భిణులు కూడా కూలీ పనులకు వెళుతున్నారని, అది ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ బాధలు పోవాలనే గర్భిణులకు రూ.12 వేలు ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని.. తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కేసీఆర్‌ కిట్లు అందిస్తున్నామని చెప్పారు. వాటన్నింటా ఆశ వర్కర్లు భాగస్వాములు కావాలని, క్షేత్రస్థాయిలో ఆరోగ్య పరిరక్షకులుగా మారాలని సూచించారు. ప్రతి ఒక్కరు ఒక కేసీఆర్‌ కావాలని వ్యాఖ్యానించారు. ‘మీ అందరి కడుపునిండా జీతం ఇచ్చే బాధ్యత నాది. ప్రజల ఆరోగ్యం బాధ్యత మీది..’అని ఆశ వర్కర్లతో పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు సి.లక్ష్మారెడ్డి, టి.హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు వివేకానంద, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ సలీమ్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ తదితరులు పాల్గొన్నారు.

ఆశ వర్కర్ల హర్షం
తమకు అందించే పారితోషికాన్ని పెంచడంపై ఆశ వర్కర్లు సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రకటన చేయగానే జనహిత జైతెలంగాణ నినాదాలతో మార్మోగింది. ఆశ వర్కర్ల వేతనాలు పెంచడంపై టీఎన్జీవోల సంఘం గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.రాజేందర్‌ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రగతి భవన్‌లో పారితోషికం పెంపు విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్న ఆశ వర్కర్లు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement