హాజరైన సీఎం కేసీఆర్, మంత్రులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రముఖ స్వాతంత్య సమరయోధుడు బోయినపల్లి వెంకటరామారావు (బోవెరా) అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు. అభిమానుల నినాదాలు, కుటుంబసభ్యులు, బంధుమిత్రుల కన్నీళ్ల మధ్య ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బోయినపల్లి వెంకటరామారావు అంత్యక్రియలకు హజరయ్యారు. మధ్యాహ్నం 12.14 గంటలకు మంత్రులు ఈటెల రాజేందర్, టి.హరీష్‌రావు, ఎంపీ బాల్క సుమన్‌లతో కలిసి హెలికాప్టర్లో ఇక్కడికి చేరుకున్నారు. కలెక్టరేట్ ఆవరణలోని హెలిప్యాడ్ నుంచి నేరుగా నగర శివారులోని మానేరు తీరానికి వెళ్లి బోవెరా పార్థీవదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. సరిగ్గా ఐదు నిమిషాల తరువాత పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి నివాళులర్పించగా, అధికార లాంఛనాల మధ్య బోవెరా అంత్యక్రియలు నిర్వహించారు. బోవెరా కుమారుడు హనుమంతరావు చితికి నిప్పంటించగా, అభిమానులు, బంధువులు, ప్రముఖులు ‘బోవెరా అమర్హ్రే’ అంటూ నినాదాలు చేస్తూ బోయినపల్లి వెంకటరామారావుకు అంతిమ వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి తన పర్యటన సమయాన్ని పూర్తిగా బోవెరా అంతిమ వీడ్కోలుకే పరిమితం చేశారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా మానేరు తీరాన ఏర్పాటు చేసిన బోవెరా అంత్యక్రియలకు వచ్చిన ఆయన అక్కడి అక్కడి పది నిమిషాలు ఉన్నారు. బోవెరా చితికి ఆయన కుమారుడు నిప్పటించిన అనంతరం తిరిగి హెలిప్యాడ్ వద్దకు వచ్చారు.
పెలైట్ కోసం సీఎం ఎదురుచూపు..: హెలిప్యాడ్ వద్దకు సరిగ్గా 12.50 గంటలకు చేరుకున్న కేసీఆర్ కొద్ది నిమిషాలపాటు పెలైట్ కోసం వేచి చూడాల్సి ఉంది. అంత్యక్రియలు ముగిసిన వెంటనే సీఎం హెలిప్యాడ్ వద్దకు వస్తున్నట్లు సమాచారం ఇవ్వడంలో జాప్యం జరగడంతో పెలైట్ కలెక్టరేట్ కార్యాలయంలో కూర్చున్నారు. సీఎం రావడం, పెలైట్ అక్కడ లేకపోవడంతో కొద్ది నిమిషాలపాటు కేసీఆర్ తన కాన్వాయల్‌లోనే ఉన్నారు.
బోయినపల్లి మృతికి చంద్రబాబు విచారం
సాక్షి, హైదరాబాద్: బోయినపల్లి మృతికి ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల సంఘం అధ్యక్షుడిగా, సర్వోదయ అధ్యక్షుడిగా బోయినపల్లి సేవలను కొనియాడారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
అధికార లాంఛనాలతో బోయినపల్లి అంత్యక్రియలు
Published Wed, Oct 29 2014 2:09 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement