తెలంగాణ బంద్కు కేసీఆర్ పిలుపు
తెలంగాణ బంద్కు కేసీఆర్ పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన ఓ పార్టీ నాయకుడు.. అదికూడా మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోయే నాయకుడు బంద్కు పిలుపునివ్వడం బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆయన ఈ బంద్కు పిలుపునిచ్చారు.
గురువారం నాడు తెలంగాణ వ్యాప్తంగా బంద్ పాటించాలని ఆయన కోరారు. పోలవరంపై కేంద్ర మంత్రివర్గం ఆర్డినెన్సు జారీ చేసిందని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన ద్రోహానికి నిరసనగా రేపు తెలంగాణ వ్యాప్తంగా బంద్ పాటించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణ బంద్కు తెలంగాణ ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.