Telangana bundh
-
నేడు తెలంగాణ బంద్‌కు దళిత జేఏసీ పిలుపు
-
నేడు తెలంగాణ బంద్‌కు దళిత జేఏసీ పిలుపు
రోహిత్ మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ మృతికి బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ దళిత సంఘాల జేఏసీ గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. ఏబీవీపీ నాయకులు, కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ, వీసీ అప్పారావుల వేధింపుల వల్లే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఇది ముమ్మాటికీ హత్యేనని పేర్కొంది. దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. బుధవారమిక్కడ జేఏసీ చైర్మన్ ఈదుల పరశురాం, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు బజ్జొ శ్రీధర్, బహుజన శ్రామిక సమితి రాష్ట్ర అధ్యక్షుడు గందమల్ల యాదగిరి, తెలంగాణ దళిత బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్రావు తదితరులు విలేకరులతో మాట్లాడారు. రోహిత్ మృతికి నిరసనగా గురువారం తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలను మూసివేస్తున్నట్లు తెలిపారు. -
మిర్యాలగూడ డిపో వద్ద ఉద్రిక్తత
మిర్యాలగూడ: రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్షాలు చేస్తున్నబంద్ లో భాగంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బస్సు డిపో ఎదుట సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీ నాయకులు బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డు తొలగించడానికి ప్రయత్నించగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ధర్నాలో పాల్గొన్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
బీజేపీ కార్యకర్తలపై దాడి
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం అఖిలపక్ష పార్టీలు చేస్తున్న బంద్ లో భాగంగా నగరంలోని ఎన్టీఆర్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికంగా బంద్ లో పాల్గొన్న బీజేపీ కార్యకర్తలపై ఓ షాపు యజమాని కత్తితో దాడి చేశాడు. బంద్ సందర్భంగా షాపులు మూయిస్తున్న కార్యకర్తలపై ఒక్కసారిగా దాడిచేశాడు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. దీంతో ఆగ్రహంతో యజమానిని కార్యకర్తలు చితకబాదారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కరీంనగర్లో బంద్ ఉద్రిక్తం
కరీంనగర్: మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా శుక్రవారం వామపక్షాలు చేపడుతున్న తెలంగాణ బంద్‌లో భాగంగా కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలోని మార్కెట్ రోడ్డులో కాంగ్రెస్ కార్యకర్తలు దుకాణాలు బంద్ చేస్తుండగా.. ఎందుకు బంద్ చేస్తున్నారని ఒక షాపు యజమాని అడగడంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు అతని దుకాణంలో ఉన్న సామాగ్రిని బయట పడేసి ఆందోళనకు చేశారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అరెస్ట్ పారిశుధ్య కార్మికుల సమ్మెకు మద్దతుగా బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు సీసీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు రాంగోపాల్‌రెడ్డి, ముకుందరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. -
తెలంగాణ బంద్ తో భక్తుల ఇక్కట్లు
హన్మకొండ (వరంగల్): మున్సిపల్ కార్మికుల సమ్మెతో గోదావరి పుష్కరాలకు వెళ్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ జిల్లాలోని హన్మకొండ బస్‌స్టేషన్ నుంచి బస్సులను బయటకు రానీయకుండా కార్మికులు గేటు ఎదుట బైఠాయించడంతో.. పుష్కరాలకు వెళ్తున్న భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. మహబూబ్‌నగర్: మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్ధతుగా వామపక్షాలు రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో వామపక్ష కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట డిపో వద్దకు చేరుకొని బస్సులను నిలిపి వేశారు. నాలుగు గంటల పాటు డిపో ఎదుట కార్యకర్తలు బైఠాయించడంతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో పుష్కరాలకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
డిపోలకే పరిమితం
నిజామాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాలు ఇచ్చిన బంద్‌తో నిజామాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. గురువారం ఉదయం నుంచే వామపక్ష కార్యకర్తలు డిపోల ఎదుట ఆందోళనలు చేపట్టారు. దీంతో పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ బంద్‌లో వామపక్షాలతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బస్సులను అడ్డుకుంటున్న వామపక్షాలు
హైదరాబాద్: బస్సులను అడ్డుకోవడానికి యత్నిస్తున్న వామపక్ష కార్యకర్తలను అడ్డు తొలగించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం తెల్లవారుజామున నుంచే జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను వెళ్లనీయకుండా.. ఇమ్లీబన్ బస్టాండ్ ఎదుట కార్యకర్తలు ధర్నాకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బస్టాండ్ ఎదుట నిరసనలు చేపడుతున్న పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లని తీర్చాలని కోరుతూ.. వామపక్షాలు శుక్రవారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. -
బంద్‌లను బంద్ చేయాలన్న కాజల్
భవిష్యత్తులో ఇక రాజకీయ బంద్‌లను బంద్ చేయాలని టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెప్పింది. వీటివల్ల సమయం వృథా కావడంతో పాటు ప్రభుత్వాలకు ఆదాయం కూడా తగ్గిపోవడం తప్ప మరేమీ ఉపయోగం ఉండబోదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్డినెన్సుకు నిరసనగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా గురువారం నాడు బంద్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ ట్వీట్ చేసింది. టాలీవుడ్ హీరోయిన్లలో ఎక్కువగా సమంతా మాత్రమే ట్విట్టర్ వ్యాఖ్యలకు బాగా ఫేమస్. అడపాదడపా ఆమె చిక్కుల్లో కూడా పడింది. ఇప్పుడు కాజల్ చేసిన కొత్త ట్వీట్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. No more political bundhs pls its waste of time and revenue to new governments... — kajal agarwal (@KajalAgarwal) May 29, 2014 -
తెలంగాణ బంద్‌కు కేసీఆర్ పిలుపు
తెలంగాణ బంద్‌కు కేసీఆర్ పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన ఓ పార్టీ నాయకుడు.. అదికూడా మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోయే నాయకుడు బంద్‌కు పిలుపునివ్వడం బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆయన ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. గురువారం నాడు తెలంగాణ వ్యాప్తంగా బంద్ పాటించాలని ఆయన కోరారు. పోలవరంపై కేంద్ర మంత్రివర్గం ఆర్డినెన్సు జారీ చేసిందని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన ద్రోహానికి నిరసనగా రేపు తెలంగాణ వ్యాప్తంగా బంద్ పాటించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణ బంద్‌కు తెలంగాణ ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. -
అక్బరుద్దీన్‌ను అడ్డుకున్న తెలంగాణవాదులు
మహబూబ్‌నగర్ : చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి తెలంగాణ సెగ తగిలింది. గురువారం ఆయనను తెలంగాణ వాదులు కొత్తూరు మండలం జేపీ దర్గా వద్ద అడ్డుకున్నారు. అక్బరుద్దీన్ కారుపై రాళ్లతో దాడి చేశారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ నేడు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా దర్గా సందర్శనకు వచ్చిన అక్బరుద్దీన్ ను తెలంగాణవాదులు అడ్డుకుని, వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వాహనంపై రాళ్లు రువ్వటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి, భద్రత నడుమ అక్బరుద్దీన్ ను హైదరాబాద్ పంపించారు. -
హైదరాబాద్ మినహా తెలంగాణ బంద్‌కు బీజేపీ మద్దతు
హైదరాబాద్ మినహా తెలంగాణ బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వరంగల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో గొడవలు సృష్టించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. అందువల్ల శాంతిభద్రతలను కాపాడాలన్న ఉద్దేశంతోనే తాము హైదరాబాద్‌లో బంద్‌కు మద్దతు ఇవ్వడం లేదని వివరించారు. ఇక, ఊసరవెల్లే చంద్రబాబు నాయుడిని చూస్తే భయపడుతుందని ఆ పార్టీ మాజీ నేత, ప్రస్తుత టీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. నైతిక విలువలు పక్కనపెట్టి ఇరు ప్రాంతాల్లో చంద్ర బాబు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు.