సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
రైలు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
ఆస్పత్రిలో క్షతగాత్రులకు పరామర్శ
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద గురువారం ఉదయం పాఠశాల బస్సును రైలు ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ప్రమాద వార్త తెలియగానే ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు అవసరమైన పూర్తి వైద్య సదుపాయాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పోలీసు డెరైక్టర్ జనరల్ అనురాగ్‌శర్మలతో ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన ఆదే శాలు జారీ చేశారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. గాయపడిన విద్యార్థుల చికిత్సకు అయ్యే మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టంచేశారు.
ప్రమాదానికి కారణమైన రైల్వే శాఖ అధికారులపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవతో మాట్లాడి.. గేటు, కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద వెంటనే గేట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా గేట్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి.
క్షతగాత్రులను చూసి చలించిపోయిన కేసీఆర్..
రైలు దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క్షతగాత్రులైన విద్యార్థుల పరిస్థితి చూసి, ఆయన తీవ్రంగా చలించిపోయారు. ఎంత ఖర్చు అయినా వారికి పూర్తిస్థాయి వైద్యసేవలు అందించాలని ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులను ఓదార్చి ధైర్యం చెప్పారు.