మాట్లాడుతున్న మంద కృష్ణ మాదిగ
మర్పల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. గురువారం సాయంత్రం ఆయన మర్పల్లి మండల కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మార్పీఎస్ జెం డాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో దళితుడిని ముఖ్య మంత్రి చేస్తానని హామీ ఇచ్చి అనంతరం విస్మరించారని దుయ్యబట్టారు.
దళిత జాతికి తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని నిర్వీర్యం చేసేవిధంగా కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నుతోందని మండిపడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకొనేందుకు దళితులు సంఘటితంగా ఉండాలని ఆయన సూచించారు. అట్రాసిటిచట్టం నిర్వీర్యం కాకుండా ఉండేవిధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఎమ్మార్పీఎస్ కృషి చేస్తోందని వివరించారు.
అట్రాసిటి చట్టాన్ని కాపాడుకునే విధంగా రాజ్యాంగ సవరణ చేసేవరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఈక్రమంలో ఆగస్టు 15న ఎస్సీ, ఎస్టీలతో కలిసి ఢిల్లీలో పెద్దఎత్తున ధర్నా కార్యక్రమం చేపడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు దళితులు ముందుకు రావాలని మందకృష్ణ సూచించారు. ఇటీవల కత్తి మహేష్ నోరు జారి రాముడిని నిందిస్తే 6 నెలల పాటు నగర బహిష్కరణ చేయడం దళితుల పట్ల ప్రభుత్వం చూపుతున్న తీరుకు నిదర్శనమని పేర్కొన్నారు.
పరిపూర్ణానంద 2017న సాయిబాబాను దూశించినా ఏడాది తర్వాత నగర బహిష్కరణ చేయడం ఎంతవరకు సబబమని ప్రశ్నించారు. 23 సంవత్సరాల ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమే వికలాంగులకు రూ. 1,500 పింఛన్, వితంతువులకు రూ. 1,000 పింఛన్ ప్రభుత్వాలు అమలు చేశారని ఆయన గుర్తు చేశారు.
అంతకు ముందు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలు వేశారు. అనంతరం స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు మందకృష్ణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డప్పు మోహన్, జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, మండల కన్వీనర్ మధుకర్, ఆయా పార్టీల నాయకులు మధుకర్, రాములు, ఆకాష్, ప్రభాకర్, నారాయణ, వికాస్, రాచన్న, విజయ్, కుమార్, నవీన్, మైపాల్, రవీందర్ తదితరులు ఉన్నారు
Comments
Please login to add a commentAdd a comment