సాక్షి, హైదరాబాద్: డాక్టర్. బాబా సాహెబ్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అంబేడ్కర్ 128వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం గాంధీ భవన్‌లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి భట్టి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో భట్టి మాట్లాడుతూ అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇదే దేశంలోని రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేసుకుంటూ భవిష్యత్ భారత దేశాన్ని నిర్మించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్య వాదులను కలవరపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్నాయని చెప్పారు. ఒక పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు రాజ్యాంగంలోని ఫిరాయింపుల చట్టం ప్రకారం నడుచుకోవడం లేదని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎం అయిన కేసీఆర్ ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని అప హాస్యం చేసేలా పాలిస్తూ, కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. విలువలకు తిలోదకాలిస్తూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖాతరు చేయకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వారిపై చర్యలు తీసుకోండి
రాజ్యాంగాన్ని ఖాతరు చేయకుండా టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి కోరినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వర రావు, హర్షవర్ధన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియానాయక్‌లపై రాజ్యాంగంలోని యాంటీ డిఫెక్షన్ బిల్లు ప్రకారం చర్యలు తీసుకోవాలని, వారి శాసనసభ్యత్వాలను రద్దు చేయాలని పోచారంను కోరామని, ఆయన రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకుంటారనే విశ్వాసం తమకు ఉందని భట్టి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment