ఎట్టకేలకు సీఎం క్యాంపు ఆఫీస్ లోకి కేసీఆర్!
హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు బేగంపేటలోని అధికార నివాసం సీఎం క్యాంపు కార్యాలయంలోకి వెళ్లారు. తొలుత వాస్తు దోషాల కారణంగా సీఎం కేసీఆర్ బేగంపేటలోని అధికారిక నివాసంలోకి వెళ్లడానికి సంశయించారు.
దాంతో కుందన్ బాగ్ లో అధికారులు ప్రత్నామ్నయ ఏర్పాట్లు చేశారు. అయితే కుందన్ బాగ్ లో ఏర్పాటు చేసిన నివాస, కార్యాలయాలపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కారణంగా సీఎం అధికార నివాసం ఎక్కడ అనేది మళ్లీ మొదటికి వచ్చింది.
దాంతో బేగంపేట క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లాలనే ఆలోచన వ్యక్తం చేయడంతో.. వాస్తు మార్పులు చేయించారు. సీఎం క్యాంపు కార్యాలయంలోకి వెళ్లడానికి పండితులు మూహుర్తం నిర్ణయించడంతో కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రవేశించారు. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే భద్రతా సిబ్బంది అనుమతించారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు క్యాంప్ ఆఫీస్‌లోకి అనుమతి నిరాకరించడంతో ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.