సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో విస్తరించేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ముహూర్తం నిర్ణయించారు. ఆది వారం దశమి మంచిరోజు కావడంతో నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని శనివారం రాత్రి సీఎం ఆదేశించారు. ఆదివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న తమిళిసై సౌందరరాజన్‌కు మంత్రివర్గ విస్తరణ సమాచారాన్ని ముఖ్యమంత్రి తెలియజేశారు. సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో నూతన మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది.
ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో సీఎం కేసీఆర్‌తోపాటు మరో 10 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరుగురికి మంత్రిమండలిలో చోటుకల్పించేందుకు అవకాశం ఉండటంతో పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతమున్న మంత్రులను కొనసాగిస్తూనే కొత్తగా ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించడంపై సీఎం కసరత్తు పూర్తి చేశారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు హరీశ్‌రావు (సిద్దిపేట), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), గంగుల కమలాకర్ (కరీంనగర్), పువ్వాడ అజయ్ కుమార్ (ఖమ్మం), శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్ పేర్లు ఖరారయ్యాయి. మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఆరుగురికి మాత్రమే మంత్రివర్గంలో అవకాశం ఉండటంతో జోగు రామన్న, గుత్తా సుఖేందర్‌రెడ్డికి అవకాశాలు అంతగా లేవని తెలిసింది.
నేటి రాత్రి మంత్రివర్గం భేటీ...
ఆదివారం సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యాక రాత్రి 7 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 2019–20కి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించనుంది. మంత్రిమండలి సమావేశానికి ముందే నూతన మంత్రులకు శాఖల కేటాయింపుతోపాటు కొందరు మంత్రుల శాఖలను సీఎం కేసీఆర్ పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉంది. కేటీఆర్‌కు మరోసారి కీలకమైన ఐటీ, పరిశ్రమలశాఖ దక్కే అవకాశాలు ఉండగా నీటిపారుదల, ఆర్థికశాఖల్లో ఏదో ఒకటి హరీశ్‌కు కేటాయిస్తారని సమాచారం.
మండలి చైర్మన్‌గా గుత్తా?
మంత్రివర్గంలో చోటు కల్పించే పరిస్థితి లేనిపక్షంలో ఇటీవలే శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డిని మండలి చైర్మన్‌గా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే పార్టీలో కీలక నేతలైన కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులకు కీలక పదవులు అప్పగించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.
మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంతోపాటు మాజీ మంత్రి నాయినికి టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ పదవి అప్పగించే అవకాశం ఉంది. మాజీ మంత్రి జూపల్లికి రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి కట్టబెడతారని తెలియవచ్చింది. 12 మంది శాసనసభ్యులకు ఉన్నత పదవులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో కీలక పదవులు ఇచ్చే యోచనలో సీఎం ఉన్నారు. మానకొండూరు శాసనసభ్యుడు రసమయి బాలకిషన్‌కు సాంస్కృతిక సారథి చైర్మన్ పదవి మరోసారి దక్కే అవకాశం ఉంది.
పల్లాకు పార్టీలో కీలక పదవి...
శాసనమండలిలో విప్‌గా పనిచేస్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి పార్టీలో కీలక పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలనా యంత్రాంగంతోపాటు పార్టీని కూడా బలోపేతం చేయాలని భావిస్తున్న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్... పల్లా రాజేశ్వర్‌రెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలు తదితరాలను పల్లా రాజేశ్వర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డు, డివిజన్ కమిటీలు, సోషల్ మీడియా కమిటీల ఏర్పాటు వంటి అంశాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. పార్టీ కార్యాలయాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడం, పార్టీ కమిటీల నిర్మాణం ద్వారా అటు ప్రభుత్వం, ఇటు పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రభుత్వం, పార్టీలో గుర్తింపు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.
పదవుల పందేరంలో దూకుడు...
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచే సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు పదవుల పందేరాన్ని ప్రారంభించారు. శాసనసభ, శాసనమండలిలో చీఫ్ విప్, విప్ పదవులను భర్తీ చేసిన సీఎం కేసీఆర్.. శాసనసభ సమావేశాల్లో 12 సభా కమిటీల చైర్మన్లు, సభ్యులను కూడా నియమిస్తామని ప్రకటించారు. శనివారం రాత్రి మంత్రివర్గ విస్తరణకు ఆదేశాలు జారీ చేయడంతోపాటు మరికొందరు నేతలకు కీలక పదవులు ఇస్తామనే సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వ, పార్టీ పనితీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో పదవుల పందేరం ద్వారా చెక్ పెట్టాలనే వ్యూహంతో కేసీఆర్ శరవేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
తొలి మహిళా మంత్రులు సబిత, సత్యవతి...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు దక్కుతోంది. 2014–2018 మ«ధ్యకాలంలో తెలంగాణ తొలి శాసనసభలో మహిళలకు మంత్రివర్గంలో చోటు లభించలేదు. పద్మా దేవేందర్‌రెడ్డికి డిప్యూటీ స్పీకర్‌గా, గొంగిడి సునీతకు ప్రభుత్వ విప్‌గా గతంలో అవకాశం లభించింది. తాజా మంత్రివర్గంలో సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లకు చోటు దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment