![KCR Forecast is wonderful - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/2/GUTTA-6.jpg.webp?itok=f5hi9o5e)
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ దూరదృష్టితో వ్యవసాయ రంగం, రైతాంగం బలోపేతానికి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ పథకాలు, కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. హైదరాబాద్ మాదాపూర్ శిల్పారామంలో శుక్రవారం గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం, భారతీయ కిసాన్ సంఘ్, రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి, సేంద్రియ ఉత్పత్తుల మేళా–2019ను గుత్తా ప్రారంభించారు. మూడ్రోజులపాటు జరగనున్న ఈ ప్రదర్శనలో 100కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి ప్రకృతి, సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన సాగనుంది.
పంట కాలనీలకు చర్యలు
సేంద్రియ వ్యవసాయానికి సర్కారు పెద్దపీట వేసిందని, ఆ దిశగా రైతాంగం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని గుత్తా చెప్పారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా వరి, ఇతర ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, పండ్ల ఉత్పత్తి పెంచడం ద్వారా స్వయం సమృద్ధి సాధనకు ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఇందుకు పంట కాలనీల ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఏటా బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయించి ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఉద్యాన సంచాలకుడు ఎల్.వెంకటరామిరెడ్డి, రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు, ప్రగతి రిసార్ట్స్ అధినేత డాక్టర్ జీబీకే రావు, ఏకలవ్య ఫౌండేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment