తెలంగాణను విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి
తాండూరు: తెలంగాణాను విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తాండూరులోని గంగోత్రి హైస్కూల్ సిల్వర్‌జూబ్లీ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రూ.50కోట్లతో జిల్లాల్లో పాఠశాలల భవనాలు, తరగతి గదుల నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరుస్తూనే ప్రైవేట్ పాఠశాలలకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. మంచి లక్ష్యంతో పాతికేళ్లుగా పాఠశాలను నడిపిస్తున్న గంగోత్రి స్కూల్ యాజమాన్యాన్ని మంత్రి అభినందించారు. ‘దశవతారం’పై విద్యార్థి ఇందూరు ప్రణయ్‌కుమార్ బృందం చేసిన నృత్యప్రదర్శన అతిథులను ఆకట్టుకుంది. ప్రణయ్‌కుమార్‌ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ నర్సింహులు, పాఠశాల ప్రిన్సిపాల్ సుజాత, కరస్పాండెంట్ డా.సుధాకర్ పాల్గొన్నారు.