88 గెలిచి.. 103కు చేరి.. | KCR Government Completes One Year Today | Sakshi
Sakshi News home page

88 గెలిచి.. 103కు చేరి..

Published Fri, Dec 13 2019 2:21 AM | Last Updated on Fri, Dec 13 2019 9:05 AM

KCR Government Completes One Year Today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి వరుసగా రెండో పర్యాయం అధికారంలోకి వచ్చి శుక్రవారం నాటికి ఏడాది పూర్తయింది. ఉద్యమపార్టీగా 2014 ఎన్నిక ల్లో పోటీ చేసి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ నేతృత్వంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్, 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించి మరోసారి అధికారాన్ని చేపట్టింది. 88 స్థానాల్లో గెలుపొందిన ఆ పార్టీ.. ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి శాసనసభ్యుల చేరికల ద్వారా బలాన్ని మరింత పెంచుకుంది. గతేడాది డిసెంబర్‌ 13న సీఎంగా కేసీఆర్‌తో పాటు హోంమంత్రిగా మహమూద్‌ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రెండో విడత మంత్రివర్గ విస్తరణలో మరో పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సుమారు ఐదేళ్లుగా మంత్రిమండలిలో మహిళలకు ప్రాతి నిధ్యం లేదనే విమర్శకు తెరదించుతూ ఈ ఏడాది సెప్టెంబర్‌ మొదటివారంలో మరోమారు కేసీఆర్‌ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. హరీశ్‌రావు, కేటీఆర్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ మూడో విడత విస్తరణలో మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కేబినెట్‌లో గరిష్టంగా సీఎం సహా 18 మందికి మాత్రమే చోటు కల్పించే అవకాశం ఉండటంతో పలువురు పార్టీ నేతలకు కేబినెట్‌ హోదాతో నామినేటెడ్‌ పదవులు అప్పగించారు. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ జాబితాలో ఉన్నారు. 

కాంగ్రెస్‌ శాసనసభాపక్షం విలీనం 
గతేడాది డిసెంబర్‌లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి శాసనసభ్యుల చేరికల ద్వారా బలాన్ని పెంచుకుంది. ఫలితాలు వెలువడిన వెంటనే ఆల్‌ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ తరపున గెలుపొందిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, వైరా ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే ఎల్‌.రాములునాయక్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. టీడీపీ శాసన సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య పార్టీకి దూరంగా ఉంటూ టీఆర్‌ఎస్‌తో సన్నిహితంగా మెలుగుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి 19 మంది గెలుపొందగా, 12 మంది టీఆర్‌ఎస్‌ గూటికి చేరుకోవడంతో ఈ ఏడాది జూన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీలో కాంగ్రెస్‌ శాసనసభా పక్షం విలీనమైంది. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించారు.

రాష్ట్ర కేబినెట్‌లో చోటు దక్కని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వ చీఫ్‌ విప్, విప్‌లుగా, శాసనసభా కమిటీల్లో సీఎం కేసీఆర్‌ చోటు కల్పించారు. మిత్రపక్షంగా ఉంటున్న ఏఐఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీకి పబ్లిక్‌ అకౌంట్స్‌ చైర్మన్‌ పదవి దక్కింది. 40 మంది సభ్యులున్న శాసనమండలిలోనూ తన బలాన్ని టీఆర్‌ఎస్‌ గణనీయంగా పెంచుకోగా, మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా రెండో పర్యాయం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిగంటల వ్యవధిలోనే కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 

లోక్‌సభలో మిశ్రమం.. స్థానికంలో ఏకపక్షం 
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న టీఆర్‌ఎస్‌ రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలను చవిచూసింది. 17 లోక్‌సభ స్థానాలకు గాను 9 చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందగా, బీజేపీ 4, కాంగ్రెస్‌ 3, ఏఐఎంఐఎం ఒకచోట విజయం సాధించింది. అయితే ఈ ఏడాది మేలో జరిగిన స్థానిక సంస్థల్లో 32 జెడ్పీ చైర్మన్‌ స్థానాలతో పాటు, ఎంపీటీసీ ఫలితాల్లో 63 శాతం విజయాన్ని నమోదుచేసింది. హుజూర్‌నగర్‌ నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచి ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని టీఆర్‌ఎస్‌ సెప్టెంబర్‌లో జరిగిన ఉపఎన్నికలో గెలుపొందింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement