సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ అమలు చేస్తున్నామని ప్రకటించడంపై పింఛన్‌దారుల్లో ఆశలు చిగురించాయి. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు చెల్లిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని అర్హులంతా ఆశగా చూస్తున్నారు. పింఛన్ల వయసు ఇప్పటి వరకు 65 ఏళ్లుగా ఉండగా.. దాన్ని 57 ఏళ్లకు కుదిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దీంతో డీఆర్‌డీఏ అధికారులు జిల్లాలో అర్హుల జాబితాను సిద్ధం చేసే పనిలోపడ్డారు. 2018 నవంబరు 19న ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియకు అధి కారులు సిద్ధమయ్యారు.
పెరగనున్న పింఛన్ మొత్తం..
ప్రస్తుతం పింఛన్ రూ.1000 చెల్లిస్తున్నారు. దివ్యాంగుల కు రూ.1,500 అందిస్తున్నారు. టీఆర్‌ఎస్ ఎన్నికల హామీలో భాగంగా పింఛన్ రూ.2,016 నెలనెలా చెల్లించేందుకు నిర్ణయించింది. దివ్యాంగులకు రూ.3,016 గా నిర్ణయించింది. దీంతో జిల్లాలో ఇప్పటికే పింఛన్లు పొందుతున్న 1,16,351 మంది పెరిగే పింఛన్ సొమ్ము కోసం ఆ శగా చూస్తున్నారు. మరోవైపు.. కొత్తగా ఎంపికయ్యే లబ్ధి దారుల్లోనూ ఆసక్తి నెలకొంది. కొత్త నిబంధనల ప్రకారం పాతరేషన్ కార్డులు, ఓటరు కార్డు, బ్యాంకు పాస్ బుక్కులను పరిశీలిస్తూ.. వృద్ధుల వయసు నిర్ధారిస్తున్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన 2018 నవంబరు 19నాటికి 57 ఏళ్లు నిండితే పింఛన్‌కు అర్హులవుతారు. గతంలో ప్రభుత్వం జారీచేసిన జీవో 17 ఆధారంగా గ్రామాల్లోని వృద్ధులకు ఏడాది కుటుంబ ఆదాయం రూ.1.50 లక్షలు మిం చరాదు, పట్టణ ప్రాంతాల్లో దరఖాస్తుదారుల కుటుంబ ఆదాయం రూ.2 లక్షలకు మించరాదని ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ నిబంధన మేరకు జిల్లాలో అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నారు. వయసును 57 ఏళ్లకు కుదించడంతో ఆసరా పింఛన్‌దారుల సంఖ్య పెరుగనుంది.
ప్రభావశక్తిగా పింఛన్‌దారులు
పింఛన్‌దారులు ఎన్నికల తీర్పునివ్వడంలో ప్రభావశక్తిగా మారారు. ఓటర్ల సంఖ్యతో పోల్చితే.. పింఛన్‌దారుల సంఖ్య 28 – 30 శాతం వరకు ఉంటోంది. జిల్లావ్యాప్తంగా 4,06,006 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,16,351 మంది ఆసరా పింఛన్‌దారులు ఉన్నారు. మొత్తం ఓట్లలో పింఛన్‌దారుల ఓట్ల సంఖ్య 28.65 శాతం ఉంది. దీంతో ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు, ఓటములపై ఆసరా పింఛన్‌దారుల ప్రభావం ప్రధానంగా కనిపిస్తోంది.
పింఛన్‌దారుల్లో వృద్ధులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, నేత కార్మికులు, గీతకార్మికులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. పింఛన్‌మొత్తాన్ని రెట్టింపు చేయడంతో వారిలో ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో నెలనెలా ఇస్తున్న పింఛన్ల మొత్తం రూ.1,21,30,850గా ఉంది. దీనిని రెట్టింపు చేయడంతోపాటు కొత్త పింఛన్‌దారులకూ మంజూరుచేస్తే.. 1.54 లక్షల మంది పింఛన్‌దారులు అవుతారు. వీరికి ప్రతినెలా రూ.3.10 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
గ్రామసభ ఆమోదంతో..
అధికారులు గుర్తించిన జాబితాను గ్రామసభ ఆమోదం పొందాల్సి ఉంది. తొలుత జాబితాను పల్లెల్లో ప్రదర్శిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వానికి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్ చేస్తారు. పింఛన్‌దారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామసభ ఆమోదం పొందాల్సి ఉంది. జిల్లాలో అర్హులైన పింఛన్‌దారులు కొత్త పింఛన్ల కోసం ఆశగా చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment