
కేసీఆర్ హామీల విలువ రూ.10 లక్షల కోట్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ గత 14 నెలల కాలంలో ఇచ్చిన హామీల విలువ రూ.10 లక్షల కోట్లు దాటిందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యానించారు...
- రైతులు కరవుతో అల్లాడుతున్నా ఆదుకోవడం లేదు
- కోర్టులను విమర్శిస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం
- కేసీఆర్, కవితలపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఫైర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ గత 14 నెలల కాలంలో ఇచ్చిన హామీల విలువ రూ.10 లక్షల కోట్లు దాటిందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులకు మినహా రైతులు, సామాన్య ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయాన్నే అమలు చేశానంటూ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని ధారాదత్తం చేసిన కేసీఆర్... అదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లకు ఎందుకు బిల్లులు చెల్లించడం లేదని ప్రశ్నించారు. కరీంనగర్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణరావుతో కలిసి రమణ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు.
గత ఏడాది కరవుతో రైతులు ఇబ్బంది పడ్డా పట్టించుకోలేదని, కనీసం కేంద్రానికి నివేదిక పంపలేదని అన్నారు. ఈ ఏడాది కూడా మళ్లీ వర్షాల్లేక వేసిన పంటలు మొలకెత్తే పరిస్థితులు లేకుండా పోయాయన్నారు. రెతుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని, ఇప్పటికే వెయ్యి మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నాని, అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితిపై శుక్రవారం పార్టీ తరపున కమిటీని ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో రైతులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్నారు. ఇందిరమ్మ పథకం కింద సుమారు 5 లక్షల ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఆగిపోయి లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా బిల్లులు మంజూరు చేయకపోవడం విడ్డూరమన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసం రీడిజైన్, కొత్త ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆయా ప్రాజెక్టులపై తక్షణమే అఖిలపక్షం ఏర్పాటు చేస్తే, పార్టీ తరపున నిర్మాణాత్మక సలహాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. న్యాయస్థానాలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు పెత్తనం చేస్తున్నారంటూ నిజామాబాద్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కోర్టులను గౌరవించకుండా విమర్శిస్తే కాలగర్భంలో కలిసిపోతారని హెచ్చరించారు.
వరంగల్ ఉప ఎన్నికలో టీడీపీ తరపున అభ్యర్థిని బరిలో దించుతారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబివ్వలేదు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ప్రకారం వరంగల్ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి నిలబడాలని, కానీ అక్కడి రాజకీయ పరిస్థితిని బట్టి గెలుపుకు అనుకూలంగా ఏ అభ్యర్ధి ఉంటే వారికే మద్దతిస్తామని స్పష్టం చేశబుూరు. హైదరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్సీకి మద్దతిచ్చి గెలిపించుకున్నట్లుగానే... వరంగల్‌లోనూ ప్రభుత్వ వైఫల్యాలపై గుణపాఠం చెప్పేలా అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటామన్నారు.