మిడతలతో ముప్పే | KCR Holds Review Meeting On Locust Threat In Telangana | Sakshi
Sakshi News home page

మిడతలతో ముప్పే

Published Thu, Jun 11 2020 2:15 AM | Last Updated on Thu, Jun 11 2020 5:05 AM

KCR Holds Review Meeting On Locust Threat In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిడతల దండు ప్రమాదం మరోసారి పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. గత నెలలో మూడు విడతలుగా దేశంలో ప్రవేశించిన మిడతల దండ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ వరకే వచ్చాయి. తెలంగాణ వైపు రాలేదు. తాజాగా ఓ మిడతల దండు తెలంగాణ సమీపంలోకి వచ్చింది. రాష్ట్రానికి 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాంటెక్‌ వద్ద గల అజ్ని గ్రామం వద్ద ప్రస్తుతం ఈ దండు ఉంది. దాని ప్రయాణం దక్షిణం వైపు సాగితే, చాలా తక్కువ సమయంలో తెలంగాణలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వీటి నుంచి రాష్ట్రాన్ని కాపాడే చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, సీఐపీఎంసీ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఆర్‌.సునీత, వ్యవసాయ యూనివర్సిటీ సీనియర్‌ శాస్త్రవేత్త రహమాన్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.

మిడతల దండు దక్షిణం వైపు వస్తే ఏ క్షణమైనా తెలంగాణకు ముప్పేనని, ఈనెల 20 నుంచి జూలై 5 వరకు మళ్లీ ఇవి వచ్చే అవకాశం ఉందని నిపుణులు సీఎంకు వివరించారు. అప్పటికి తెలంగాణలో వానాకాలం పంట సీజన్‌ ప్రారంభమై, పంటలు మొలకెత్తే దశలో ఉంటాయని, అప్పుడు మిడతలు దాడిచేస్తే చాలా నష్టం జరుగుతుందని, లేత పంటను పీల్చేస్తాయని, అందుకే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో సీఎం అధికారులను ఆదేశించారు. 

తొమ్మిది జిల్లాల్లో అప్రమత్తత
మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉన్నందున ఈ రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న 9 జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. భద్రాచలం, చర్ల, వెంకటాపురం, వాజేడు, పేరూరు, మంగపేట, ఏటూరునాగారం, చెన్నూరు, వేమనపల్లి, కౌటాల, ధర్మాబాద్, బోధన్, జుక్కల్, బాన్స్‌వాడ, నారాయణఖేడ్, జహీరాబాద్‌ ప్రాంతాల నుంచి మిడతల దండు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆదిలాబాద్‌కు సీఎస్‌ బృందం
మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తీసుకున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏర్పాటుచేశారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌ రావు, సీఐపీఎంసీ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఆర్‌.సునీత, వ్యవసాయ యూనివర్సిటీ సీనియర్‌ శాస్త్రవేత్త రహమాన్‌ తదితరులతో కూడిన బృందం రెండ్రోజుల్లో ఆదిలాబాద్‌లో పర్యటించనుంది. ఈ బృందం ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమావేశమవుతూ, మిడతల దండు గమనాన్ని పరిశీలిస్తూ, పరిస్థితిని పర్యవేక్షిస్తుందని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement