ప్రణాళికతోనే ‘స్వచ్ఛ’త | KCR inaugurates Swachh hyderabad programme | Sakshi
Sakshi News home page

ప్రణాళికతోనే ‘స్వచ్ఛ’త

Published Sun, May 17 2015 1:45 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

KCR inaugurates Swachh hyderabad programme

* ‘స్వచ్ఛ హైదరాబాద్’ ప్రారంభోత్సవంలో కేసీఆర్
* స్థానిక నాయకత్వం భాగస్వామ్యం పెరగాలి
* నేతలంతా ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలి
* ‘ప్లాన్ ద బస్తీ’ పేరుతో బస్తీ ప్రణాళికలు రూపొం
దించండి
* దీనిని ప్రజావసరాలు తీర్చే కార్యక్రమంగా తీర్చిదిద్దాలి

త్వరలోనే అన్ని మున్సిపాలిటీలు, పట్టణాల్లో ‘స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. వాటన్నింటికి స్వచ్ఛ హైదరాబాద్ స్ఫూర్తిగా నిలవాలి. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లో పౌర సదుపాయాలు తగిన స్థాయిలో లేకపోవడం బాధ కలిగిస్తోంది.    
 - సీఎం కేసీఆర్
 
సాక్షి, హైదరాబాద్: సరైన ప్రణాళిక, స్థానిక నాయకత్వం కలిస్తేనే సమస్యలు లేని హైదరాబాద్ నగరం సాధ్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఇందుకోసం స్థానిక నాయకులను తయారు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ‘స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్‌తో కలసి సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. ప్రపంచంలోని ఎన్నో సుప్రసిద్ధ నగరాలు సైతం ఒకప్పుడు అధ్వానంగానే ఉన్నాయని.. తగిన ప్రణాళికలతో, స్థానిక నాయకత్వం కృషితో అద్భుతంగా రూపొందాయని ఆయన చెప్పారు. స్థానిక సమస్యలపై పోరాడేందుకు స్థానికంగానే నాయకత్వ లక్షణాలు పెంచాలన్నారు. స్థానిక నాయకత్వం, తగిన ప్రణాళికలు కలిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని, ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమం ద్వారా దానిని నిరూపిద్దామని చెప్పారు. త్వరలోనే అన్ని మున్సిపాలిటీలు, పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని, వాటన్నింటికి స్వచ్ఛ హైదరాబాద్ స్ఫూర్తిగా నిలవాలన్నారు. దేశంలోని 6 ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లో సదుపాయాలు తగిన విధంగా లేకపోవడం బాధ కలిగిస్తోందన్నారు.
 
 ప్రజల మధ్యకు వెళ్లండి
 ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమానికి ప్యాట్రన్లు/మెంటార్లుగా ఉన్న వీవీఐపీలు ఆదివారం వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి నాలుగైదు గంటల పాటు ప్రజలతో గడపాలని.. స్థానిక సమస్యలు తెలుసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రజల మధ్యకు వెళితే.. వారిలో ప్రేరణ వస్తుందన్నారు. ప్రజలకు సౌలభ్యంగా ఉన్న సమయంలో బస్తీల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.  ‘ప్లాన్ ద బస్తీ’ పేరుతో బస్తీ ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి అయిన గవర్నర్‌కు, నీతి ఆయోగ్ నుంచి రూ.75 కోట్లు మంజూరు చేయించిన కేంద్ర మంత్రి దత్తాత్రేయకు కృతజ్ఞతలు తెలిపారు. పక్కాగా కార్యక్రమాన్ని రూపొందించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను, ఆయన బృందాన్ని సీఎం అభినందించారు.
 
 నిరంతర ప్రక్రియ కావాలి..
 దేశంలోనే తొలిసారిగా, ప్రజల ఇంటి ముందుకే ప్రభుత్వం వెళ్లే ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. ఇది 4 రోజుల్లోనే ముగియవద్దని, నిరంతర ప్రక్రియ కావాలని పేర్కొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకుంటే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. కారులోంచి వెళ్లే వారెవరైనా రోడ్డు మీద ఓ కాగితం పడేస్తే.. ప్రజలు ఆపి దాన్ని వారితోనే తీసివేయించేలా చైతన్యం రావాలన్నారు. ఇది మన హైదరాబాద్ అనే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.  కాగా సచివాలయ ఉద్యోగులు సీఎం కార్యాలయం ఉండే సమతా బ్లాక్ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను ఊడ్చి శుభ్రం చేశారు.
 
 నినాదం కాదు.. విధానం

 కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
 స్వచ్ఛ భారత్ ప్రధాని మోదీ నినాదం కాదని, ఒక విధానమని కేంద్ర మంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనను చేపట్టాలని సూచించారు. జీవ వ్యర్థాల నిర్వహణపై శ్రద్ధ చూపాలని, పూర్తిస్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ ఉంటేనే హైదరాబాద్ స్వచ్ఛ నగరం అవుతుందని వ్యాఖ్యానించారు. ‘స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్’ లోగోను, జీహెచ్‌ఎంసీ రూ పొందించిన ఫేస్‌బుక్ పేజీని, రసమయి బాలకిషన్ రూపొందించిన పాటల సీడీలను గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement