ప్రపంచంలో పెద్ద ఫాసిస్టు కేసీఆర్
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ: ప్రపంచంలో పెద్ద ఫాసిస్టు సీఎం కేసీఆర్ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రధాని మోడీని కేసీఆర్ ఫాసిస్టు అనడాన్ని ఖండిస్తూ, ఆ వ్యాఖ్యను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో శనివారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘గవర్నర్‌కు శాంతిభద్రతల అధికారాలను ఇచ్చే అంశాన్ని యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పెట్టింది. పార్లమెంటులో చట్టం ఆమోదమైంది. కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి సోనియా ఇంటికి వెళ్లి పాదాభివందనం చేసి, ఫోటోలు దిగారు. హైదరాబాద్‌కు వచ్చి గుర్రాలు, ఒంటెలు, ఏనుగుల మీద ఊరేగారు. గవర్నర్‌కు శాంతిభద్రతల అధికారాన్ని ఇచ్చిన విషయం అప్పుడు కేసీఆర్‌కు తెలియదా..? తెలిస్తే.. మరి, అప్పుడే ఎందుకు వ్యతిరేకించలేదు’ అని ప్రశ్నించారు.
21, 22 తేదీల్లో అమిత్ షా రాక
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈనెల 21, 22 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. 21వ తేదీన రాష్ట్ర పదాధికారుల సమావేశం, 22వ తేదీన కార్యకర్తల భేటీ, మీడియా అధిపతులతో సమావేశమవుతారని చెప్పారు.
న్యాయం ఉంది: సురేష్ వ్యాఖ్య
గవర్నర్‌కు శాంతిభద్రతల అధికారాలు ఇవ్వడంలో న్యాయం ఉందని సినీనటుడు, బీజేపీ నేత సురేష్ అన్నారు. తెలంగాణలో అభద్రతాభావంతోఉన్నవారికి ఊరటనిస్తుందని చెప్పారు.