ఇక మీ ధూమ్ ధామ్ సర్కార్ కోసం! | KCR lauds role of artists in Telangana formation | Sakshi
Sakshi News home page

ఇక మీ ధూమ్ ధామ్ సర్కార్ కోసం!

Published Mon, Apr 20 2015 2:39 AM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్‌కు భారీ కలాన్ని బహూకరిస్తున్న రసమయి. చిత్రంలో కేవీ రమణాచారి - Sakshi

హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్‌కు భారీ కలాన్ని బహూకరిస్తున్న రసమయి. చిత్రంలో కేవీ రమణాచారి

నేనున్నా.. పోయినా రాష్ట్రం అభివృద్ధి తీరం చేరేదాకా ఆడిపాడాలి
సాంస్కృతిక సారథులకు సీఎం కేసీఆర్ పిలుపు
హైదరాబాద్‌లో 531 మంది కళాకారుల సమ్మేళనం
ఇకపై సాంస్కృతిక సారథులుగా అధికారిక విధులు..
పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రచార కార్యక్రమాలు
కళాకారులకు వాయిద్య పరికరాలు, వాహనాలు, ఆరోగ్యకార్డులు
జిల్లా స్థాయిలో కమిటీలు,అందరికీ గౌరవవేతనం
వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి
తెలంగాణకు అండగా నిలిచింది డప్పులు, పాటలేనని వ్యాఖ్య

 
కళాకారులే నా వారసులు. 60 ఏళ్ల నా జీవితం పండింది. తెలంగాణ రావాలనుకుంటే వచ్చింది. నేను ఉన్నా... పోయినా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి తీరాలు చేరేదాకా మీరు ఆడాలెపాడాలే.. మీ గజ్జె ఆగొద్దు.. గొంతు ఆగొద్దు. కళాకారులకు ఈ సారథి ఉద్యోగం చిన్న సత్కారమే. కళాకారులు నా బిడ్డలు.
 - ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు

సాక్షి, హైదరాబాద్: ‘కళాకారులే నా వారసులు. 60 ఏళ్ల నా జీవితం పండింది. తెలంగాణ రావాలనుకుంటే వచ్చింది. నేను ఉన్నా పోయినా తెలంగాణ రాష్ర్టం అభివృద్ధి తీరాలు చేరేదాకా మీరు ఆడాలెపాడాలే.. మీ గజ్జె ఆగొద్దు.. గొంతు ఆగొద్దు. కళాకారులకు ఈ సారథి ఉద్యోగం చిన్న సత్కారమే. కళాకారులు నా బిడ్డలు’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. సాంస్కృతిక సారథులుగా ఎంపికైన 531 మంది కళాకారుల సమ్మేళనాన్ని హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో గల  సాంస్కృతిక సారథి కార్యాలయంలో ఆదివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు. ‘ఇక నుంచి కళాకారులు కడుపునిండా తినాలె.. గొంతు నిండా పాడాలె. 2001లో టీఆర్‌ఎస్ పార్టీ పుట్టినప్పుడు ఒక్కన్నే మొండిగా ముందుకెళ్లి తెలంగాణ సాధించిన. చాలా అవమానాలు జరిగినయి. చాలా మంది నాయకులు వచ్చారు.. పోయారు. తెలంగాణ కోసం ఉన్నది మాత్రం డప్పులు, పాటలే. నాకన్నా ముందే సభలకు డప్పులు, పాటలు పోయేవి. ఆ తర్వాతే కేసీఆర్ వచ్చేటోడు. నేనూ చిన్నప్పుడు పాటలు రాసిన. అప్పట్లో బాగా పాటలు పాడేవాన్ని.

తెలంగాణ ప్రజలకు తమ సంఘటితశక్తి ఎంతో తెలియదు. ఎవరో ఒకరు చెప్పాలి. అప్పుడే అర్థమవుతుంది. తెలంగాణ పోరాటం ఆ విషయాన్ని నిరూపించింది. అందుకు కారణం కళాకారులే. బంగారు తెలంగాణ కోసం ఇప్పుడు మళ్లీ మీరు కష్టపడాలె. పేదరికాన్ని పారదోలేందుకు సాంస్కృతిక కళాకారులే మేధోపరమైన చైతన్యం తీసుకురావాలె. కళాకారుల పనిదినాలు, కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ఎక్కడ ఉండాలనే విషయాన్ని త్వరలోనే చెబుతాం’ అని కేసీఆర్ తెలిపారు.
 
‘మిషన్ కాకతీయ’ ప్రచార బాధ్యతలు
చెరువుల అభివృద్ధి కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకాన్ని విజయవంతం చేసేందుకు కళాకారులు కృషి చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో హరితహారం కోసం చెట్ల పెంపకాన్ని విస్తృతంగా చేపట్టాలని కోరారు. గ్రామాల్లో కోతుల బెడద పోవాలి.. వానలు వాపస్ రావాలని వ్యాఖ్యానించారు. మిషన్ కాకతీయపై ప్రచారం చేసేందుకు కళాకారులకు త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ ఏడాది జూన్‌లో రాష్ట్ర అవతరణ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని, కళాకారులు ముందువరుసలో ఉండి జిల్లాల నుంచి శోభాయాత్రగా హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంటుందని సీఎం పేర్కొన్నారు.

సాంస్కృతిక సారథులుగా ఎంపికైన కళాకారులకు డప్పులు, ఇతర వాయిద్య పరికరాలు, వాహనాలను ప్రభుత్వం సమకూరుస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. కళాకారులకు, వారి కుటుంబసభ్యులందరికీ వర్తించేలా ఆరోగ్య బీమా కార్డులు అందజేస్తామన్నారు. మంత్రులకన్నా కళాకారులే మిన్న అని కొనియాడారు. ప్రతిగ్రామంలో సాంస్కృతిక సారథి బృందాలు తయారుకావాలన్నారు. సాంస్కృతిక సారథి కార్యాలయంలో మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియోను ఏర్పాటు చేస్తామన్నారు.
 
భవనానికి మిద్దె రాములు పేరు
తెలంగాణ సాంస్కృతిక సారథి భవనానికి ప్రముఖ ఒగ్గుకళాకారుడు మిద్దె రాములు పేరు పెడతామని సీఎం ప్రకటించారు. స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య హాలును ఏర్పాటు చేస్తామన్నారు. సాంస్కృతిక సారథి కళాకారులకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. కేసీఆర్  తెలంగాణ యాసలో సందర్భోచిత సామెతలతో అందరినీ ఆకట్టుకున్నారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధించాక కళాకారులకు ఉపాధి లేదని బాధపడుతున్న సమయం లో ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింద న్నారు.

సాంస్కతిక రంగానికి కళాకారుడిని చైర్మన్‌గా నియమించడంతోపాటు తోటి కళాకారులకు సముచిత గౌరవం ఇవ్వడం కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు.  ఉపాధి పొందిన కళాకారులు జిల్లా స్థాయి లో కమిటీలను ఏర్పాటు చేసుకుని పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. వారికి సైతం గౌరవ వేతనం అందిస్తామన్నారు.  కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీ జితేందర్‌రెడ్డి, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య  పాల్గొన్నారు.

ఊరూరా ఆటాపాట..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చి రాష్ట్రావిర్భావంలో కీలక భూమిక పోషించిన కళాకారులు మళ్లీ ఆటపాటతో ఊళ్లబాట పట్టారు. ఇకపై ‘సాంస్కృతిక సారథు’లుగా ప్రజలతో మమేకం కాబోతున్నారు. ఇంతకాలం ఉద్యమంలో భాగంగా ప్రత్యేక రాష్ర్టం కోసం ‘ధూంధాం’తో హోరెత్తించిన కళాకారులు ఇకమీదట ప్రభుత్వ ఉద్యోగులుగా గళం విప్పబోతున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రచార బాధ్యతలను చేపట్టారు.

ఉద్యమ సమయంలో ప్రజలను ఉత్తేజపర చడంలో కీలక భూమిక నిర్వహించిన ముఖ్య కళాకారులను ప్రభుత్వం సాంస్కృతిక సారథులుగా గుర్తించింది. మొత్తం 531 మంది ని దాని పరిధిలోకి తీసుకొచ్చింది. మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమ్మేళనంతో వీరంతా అధికారికంగా విధుల్లో చేరారు.
 
సీనియర్ అసిస్టెంట్ హోదా.. రూ.30 వేల వేతనం
సాంస్కృతిక శాఖ పరిధిలో స్వతంత్ర సంస్థగా ఏర్పడ్డ ‘సాంస్కతిక సారథి’లో ఈ కళాకారులు ఉద్యోగులుగా వ్యవహరిస్తారు. వీరికి ప్రభుత్వం సీనియర్ అసిస్టెంట్ హోదా కల్పించింది. నెలకు రూ.30 వేల వరకు వేత నం పొందుతారు. ప్రభుత్వ పథకాలపై ప్రజ ల్లో అవగాహన కల్పించి, వారిని భాగస్వాము లు చేయడం వీరి బాధ్యత. తెలంగాణ ఉద్యమంలో ఆటపాటలతో ప్రజలను అమితంగా ఆకట్టుకున్న తీరును గుర్తించిన కేసీఆర్ అదే పంథాలో ప్రభుత్వ పథకాలు విజయవంతమయ్యేలా కళాకారుల సేవలను పొందాలని నిర్ణయించి దీనికి రూపకల్పన చేశారు.

ఉద్యమంలో కళాబృందాల ప్రతినిధిగా రసమయి బాలకిషన్‌ను గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఆయననే ‘సాంస్కృతిక సారథి’కి చైర్మన్‌గా నియమించి కేబినెట్ హోదా కల్పించారు. తొలి బాధ్యతగా వీరికి మిషన్ కాకతీయ పథకం ప్రచారాన్ని ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటికే పాటలు, వీధి నాటికలు, స్కిట్స్‌ను సిద్ధం చేశారు. చెరువుల పునరుద్ధరణ జరిగే ఊళ్లలో వీరు కార్యక్రమాలు నిర్వహిస్తారు. 531 మంది సభ్యులుం డగా... ఒక్కొక్కరు టీమ్ లీడర్‌గా ప్రత్యేక బృందాలను సిద్ధం చేస్తున్నారు.  అవకాశం రాని వారిని బృందాల్లో సభ్యులుగా తాత్కాలిక పద్ధతిలో చేర్చుకుంటున్నారు. వీరికి రోజువారీ పద్ధతిలో గౌరవవేతనం చెల్లించాలని నిర్ణయించారు. గత బడ్జెట్‌లో ప్రభుత్వం ఇందుకోసం రూ.11 కోట్లు కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement