గురువారం కరీంనగర్ జిల్లా శాలపల్లి–ఇందిరానగర్‌లో లబ్ధిదారునికి రైతుబంధు చెక్కు, పాస్‌బుక్‌ను అందజేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో ఆర్థికమంత్రి ఈటల
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించిన గౌరవం తెలంగాణకే దక్కుతుంది. 58 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూర్చేలా ఏటా రూ.12 వేల కోట్లను రైతులకు పెట్టుబడి సాయంగా అందజేసే అద్భుత పథకమిది. ఇందులో ఒక పంట పెట్టుబడిగా ఇప్పటికే రూ.6 వేల కోట్లను బ్యాంకులో జమచేశాం..’’.. అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఇంత పెద్ద కార్యక్రమంలో భాగంగా పాస్‌బుక్కులు, చెక్కుల రూపకల్పన నుంచి వాటిని క్షేత్రస్థాయిలో అందించేదాకా రాత్రింబవళ్లు కృషి చేసిన యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి–ఇందిరానగర్‌లో ప్రతిష్టాత్మకమైన ‘రైతుబంధు’పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
సద్వినియోగం చేసుకోండి..
పెట్టుబడి సాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని బంగారు పంటలు పండించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. వ్యవసాయం బాగుండాలంటే భూములుండాలని, నీళ్లు, కరెంటు ఉండాలని.. తాము వాటన్నింటినీ సమకూర్చుతున్నామని పేర్కొన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో భూరికార్డుల ప్రక్షాళన చేశామని, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం నుంచి పంట పెట్టుబడి కూడా అందజేస్తున్నామని, అభివృద్ధి పథకాల అమల్లో తెలంగాణ నేడు యావత్ దేశానికి దిక్సూచిగా నిలుస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో 2.9 కోట్ల ఎకరాల భూమి ఉంటే.. అందులో 2.3 కోట్ల ఎకరాల భూమికి రికార్డులు తయారు చేశారని చెప్పారు. ఇందులో కోటి 40 లక్షల ఎకరాల పైచీలుకు భూమి సాగుకు అనుకూలంగా ఉందన్నారు. ఈసారి రైతులందరికీ పెట్టుబడి సాయం చెక్కులు అందజేస్తామని.. ఏవైనా సందేహాలుంటే కొద్దిపాటి వెరిఫికేషన్ చేసి చెక్కులు అందిస్తామని తెలిపారు. నిధులు దుర్వినియోగం కావొద్దని, అసలైన రైతుకే డబ్బులు అందాలని చెప్పారు. రైతు సమన్వయ సమితి సభ్యులు చెక్కుల పంపిణీలో ఇబ్బందులను పరిష్కరించాలని సీఎం సూచించారు.
వ్యవసాయాన్ని నాశనం చేసింది కాంగ్రెసే..
ఆంధ్రా నాయకుల తొత్తులుగా ఉండి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇక్కడ వ్యవసాయాన్ని నాశనం చేశారని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్ల మాటలు వింటే ఆగమవుతారని వ్యాఖ్యానించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనంటే.. ఒక్కనేత కూడా కిక్కురుమనలేదని... నాడు నోరు మూసుకున్న నాయకులు ఇప్పుడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు వద్దంటున్నారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని నిలదీశారు. కాళేశ్వరం నీళ్లతో రాష్ట్రంలో మూడు పంటలు పండించుకునే అవకాశం ఉందని.. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయితే కోటి ఎకరాలకుపైగా సాగునీరు అందుతుందని చెప్పారు. తాము నీటి తీరువా బకాయిలు రద్దు చేశామని.. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించామని తెలిపారు. అదే కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లపాటు రైతులను గోస పెట్టిందని మండిపడ్డారు. తెలంగాణ సాధించిన పార్టీ టీఆర్‌ఎస్ అయితే.. తెలంగాణను వేధించిన పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు.
జూన్ 2 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల విధానంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టామని... జూన్ 2 వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులున్న మండలాలుపోగా.. మిగతా 430 మండలాల్లో ఎమ్మార్వోలే రిజిస్ట్రేషన్లు చేస్తారని తెలిపారు. రిజిస్ట్రేషన్ కాగితాలు, పాస్‌బుక్కులు పోస్టు ద్వారానే ఇంటికి వస్తాయన్నారు. పాస్ పుస్తకాల్లో పట్టాదారు పేరే ఉంటుందికానీ అనుభవదారు పేరుండదని స్పష్టం చేశారు. పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ పుస్తకాలు తీసుకోవద్దని సూచించారు. ఇక కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేమని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు.
20 శాతం రాబడి ఉన్న రాష్ట్రం మనది..
దేశంలో 20 శాతం సొంత రాబడి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని.. మిగతా రాష్ట్రాలు కేవలం 10 శాతం రాబడి మాత్రమే కలిగి ఉన్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంతేకాకుండా 28 శాతం క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఏకైక రాష్ట్రం.. రైతులకు బీమా చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు. జూన్ 2 నుంచి రాష్ట్రంలో రైతులకు రూ.5 లక్షల బీమా అమలు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో ధనికులైన రైతులున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవాలని ఆకాంక్షించారు. అగ్రకులాల్లోని పేదలకు కూడా తగిన పథకాలను ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారు. రెండు, మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని తెలిపారు. సభలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి ఈటల రాజేందర్, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బండ ప్రకాశ్, జోగినిపల్లి సంతోష్‌కుమార్, బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, వొడితెల సతీశ్‌కుమార్, బొడిగె శోభ, రసమయి బాలకిషన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అంధకారమైతదన్నరు.. మన బిడ్డలే సివిల్స్ టాపర్లు..
‘‘తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని.. మీకు తెలివిలేదని, పాలన తెలవదని అప్పట్లో పిల్లి శాపాలు పెట్టారు. ఎన్ని శాపాలు పెట్టినా సత్యం, ధర్మం మనవైపే ఉన్నాయి. దేశంలోని 29 రాష్ట్రాల్లో అన్నివర్గాలకు 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఘనత తెలంగాణకే దక్కింది. 2014కు ముందు కరెంటు ఉంటే వార్త.. ఇప్పుడు కరెంటు పోతే వార్త అన్నట్టు తయారు చేశాం. సివిల్స్‌లో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించిన వ్యక్తి దుర్శేటి అనుదీప్ కరీంనగర్ బిడ్డ. హుజూరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులు సైతం సివిల్స్ ర్యాంకులు సాధించడం అభినందనీయం.’’అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఉపాధి హామీ, మద్దతు ధరలపై తీర్మానాలు..
బహిరంగ సభ సందర్భంగా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు. వాటిని ఈ సభ తీర్మానాలుగా పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి కూలీలకు ఇచ్చే డబ్బుల్లో సగం కేంద్రం భరించాలని, మిగతా సగం రైతులు భరించాలని సూచించారు. దీంతోపాటు కేంద్రం అన్ని పంటలకు ఇప్పుడున్న మద్దతు ధరలలో నాలుగో వంతు మేర పెంచాలని డిమాండ్ చేశారు. ఈ రెండు డిమాండ్లను తీర్మానాలుగా సభ ఆమోదించాలని కేసీఆర్ కోరగా.. సభికులంతా చప్పట్ల ద్వారా తీర్మానాలకు ఆమోదం తెలిపారు.
కరీంనగర్ సెంటిమెంట్.. ఇక్కడి నుంచే కొత్త పథకాలు
‘కరీంనగర్ వ్యక్తిగతంగా నాకు సెంటిమెంట్ జిల్లా.. ఇక్కడి నుంచి ఏ పథకం ప్రారంభించినా వంద శాతం విజయం సాధిస్తున్నాం. టీఆర్‌ఎస్ ఆవిర్భావం సందర్భంగా సింహగర్జన మొదలు ఇప్పటివరకు చేపట్టిన అన్నింట్లో విజయమే సాధించాం. ప్రజల అభిమానం, ఆశీర్వాదాలు నాకు చావును తప్పించి పునర్జన్మ ఇచ్చాయి. దెబ్బకు కేంద్రం దిగొచ్చి తెలంగాణ ప్రకటన చేసింది. అందుకే ప్రతిష్టాత్మకమైన రైతుబంధు పథకాన్ని సైతం ఈ జిల్లా నుంచే ప్రారంభిస్తున్నా..’’అని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ సాధనకు మొట్టమొదటి సింహగర్జన నాటి నుంచి 14 ఏళ్లలో ఏ పోరాటం తలపెట్టినా విజయం సాధించేలా కరీంనగర్ ఆత్మగౌరవ బావుటా ఎగురవేసిందని వ్యాఖ్యానించారు. అలాంటి సెంటిమెంట్ జిల్లాకు అప్పు చేసైనా నిధులు కేటాయిస్తామన్నారు. మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి మేరకు వెంటనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి రూ.500 కోట్లు ఇస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.
సీఎం నుంచి చెక్కులు అందుకున్నది వీరే..
రైతుబంధు పథకం ప్రారంభం సందర్భంగా హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లె గ్రామానికి చెందిన 10 మంది రైతులు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాసుబుక్‌లు, పెట్టుబడి సాయం చెక్కులను అందుకున్నారు. ఈ గ్రామంలో మొత్తంగా 279 మంది చెక్కులు అందుకున్నారు. కేసీఆర్ చేతుల మీదుగా మూగల సంజీవరెడ్డి, వంగపండ్ల లక్ష్మి, అంతం రాజిరెడ్డి, పాకాల లక్ష్మారెడ్డి, నిమ్మ సాయిలు, పూదరి రమ, జక్కుల సారయ్య, పూసాల సూరమ్మ, చిలుముల నిర్మల, మంద అయిలయ్య తదితరులు చెక్కులు, పాస్‌బుక్‌లు అందుకున్నారు.
నూతన జంటకు సీఎం ఆశీర్వాదం
శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్‌లో గురువారం నూతన జంటను సీఎం కేసీఆర్ ఆశీర్వదించారు. తాడికల్‌కు చెందిన ఒడ్నాల ఉమ, లక్ష్మీనారాయణ దంపతుల కుమార్తె కావ్య వివాహం మంచికట్ల మనోహర్‌తో గురువారం జరిగింది. కేసీఆర్ హుజూరాబాద్‌లో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం కోసం రోడ్డు మార్గంలో వెళ్తుండగా.. కావ్య వివాహానికి హాజరై ఆశీర్వదించాలని సర్పంచ్ మహిపాల్ అభ్యర్థించారు. మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా ఇదే విజ్ఞప్తి చేయడంతో.. సీఎం వివాహానికి హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు వద్దంటున్నారో కాంగ్రెస్ నేతలు చెప్పాలి. కాళేశ్వరం నీళ్లతో రాష్ట్రంలో 3 పంటలు పండించుకునే అవకాశం ఉంది. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయితే కోటి ఎకరాలకుపైగా సాగునీరు అందుతుంది. –సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment